బాటిల్ ఆర్ట్
పనికిరాని గాజు బాటిల్స్ చక్కని కళాకృతులయ్యాయి. రంగు రంగుల కాగితాలను అద్దుకుని రంగవల్లుల్లా ముస్తాబయ్యాయి. సికింద్రాబాద్ అవర్ సేక్రెడ్ స్పేస్‌లో శనివారం ఏర్పాటు చేసిన పేపర్ క్రాఫ్ట్ వర్క్‌షాప్‌లో ఔత్సాహికుల చేతుల్లో ఇలాంటివెన్నో చూడముచ్చటైన ఆకృతులు రూపుదిద్దుకున్నాయి.
పేపర్ క్రాఫ్ట్‌లో నిపుణుడు సరోష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్‌షాప్‌లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 18వ శతాబ్దంలో విక్టోరియన్ ఆర్ట్‌గా ప్రసిద్ధి పొందిన ఈ కళను నేర్చుకోవడానికి సీనియర్ సిటిజన్స్ కూడా ఆసక్తి చూపారు. ‘ఈ సృష్టిలో పనికిరాని వస్తువంటూ ఏదీ ఉండదు. ప్రతిదాన్నీ రీసైకిల్ చేయవచ్చు. దీని వల్ల పర్యావరణానికి కలిగే ముప్పు తప్పించవచ్చు. అలాగే ఇలా ఇంట్లో ఉపయోగించుకొనేలా డెకరేటివ్ ఐటెమ్స్ చేసుకోవచ్చు. ఈ ఆర్ట్ కాస్త కొత్తగా ఉంది. అందుకే నేర్చుకోవడానికి ఆసక్తిగా వచ్చా’ అన్నారు గృహిణి అంజలి.
‘ముచ్చటైన ఈ కళను చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. మనసుకు నచ్చిన వ్యాపకం వల్ల మనసుకు ఆహ్లాదం లభిస్తుంది. చిన్న చిన్న చిట్కాలతో ఆకట్టుకునే ఇలాంటి వస్తువులను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బాటిల్స్‌తో పాటు ఉడెన్‌పై కూడా పేపర్ క్రాఫ్ట్‌తో అందమైన వస్తువులు తయారు చేయవచ్చు’ అంటారు శారదారెడ్డి.
- దార్ల వెంకటేశ్వరరావు