పడేసేవి కాదు.. పనికొచ్చేవే! | All are modern props from made recycling | Sakshi
Sakshi News home page

పడేసేవి కాదు.. పనికొచ్చేవే!

Published Thu, Feb 18 2016 6:13 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

పడేసేవి కాదు.. పనికొచ్చేవే!

- పాత జీన్స్‌తో బంప్ బ్యాగులు రెడీ...
- బంకమట్టే డిజైనర్ ఆభరణంగా మెరుస్తుంది
- గాజు సీసాలు బెడ్ ల్యాంపులుగా ధగధగలాడతాయి
- రీసైక్లింగ్‌తో సరికొత్త వస్తువులను సృష్టిస్తున్న నగరవాసులు

 
సాక్షి, బెంగళూరు: సాధారణంగా జీన్స్ ప్యాంట్స్ బిగుతైపోతే మనం వాటిని పడేయడమో లేదంటే ఏ స్టీల్ సామాన్ల వాడికి ఇవ్వడమో చేస్తూ ఉంటాం. కానీ వాటిని కూడా అందమైన బ్యాగులుగా మార్చవచ్చనే విషయం మీకు తెలుసా! ఎందుకూ పనికిరావనుకునే గాజు సీసాలను ఎంచక్కా బెడ్ ల్యాంప్‌లుగా మార్చవచ్చని మీరెప్పుడైనా విన్నారా, అంతేకాదు బంకమట్టితో డిజైనర్ ఆభరణాలు, పేపర్‌తో బ్యాగులు ఇలా ఏ వస్తువునైనా రీసైక్లింగ్‌తో మరింత కొత్తగా మార్చవచ్చనే విషయాన్ని రుజువుచేస్తున్నారు నగరానికి చెందిన అనేక మంది ఔత్సాహికులు. అంతేకాదు ఇలా తయారుచేసిన వస్తువుల ద్వారా లభించిన మొత్తాన్ని స్వచ్ఛంద కార్యక్రమాల కోసం వినియోగిస్తూ మన్ననలందుకుంటున్నారు.
 
బీరు సీసాల మూతలు,  బంకమట్టే డిజైనర్ జువెలరీ...
నగరానికి చెందిన గృహిణి ముక్త ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినదే ‘ఆర్ట్సీ క్రాఫ్టీ క్రియేషన్స్’ సంస్థ. ఇంట్లోనే ఉంటూ ఎన్నో వస్తువులను రీసైక్లింగ్ చేస్తూ మళ్లీ వాటికి కొత్త రూపును ఇస్తున్నారు ముక్త. బీరు సీసాల మూతల నుండి అందమైన ఇయర్ రింగ్స్‌తో పాటు బంకమట్టితో నెక్లెస్‌లు, డిజైనర్ జువెలరీని తయారుచేస్తున్నారు. ఇవి కాక దుస్తులు కుట్టేటపుడు మిగిలిపోయిన చిన్న చిన్న క్లాత్ పీసెస్‌తోటి చిన్నారుల కోసం అందమైన హెయిర్ క్లిప్స్‌ను తయారుచేయడం, ప్యాకింగ్ కోసం వాడే అట్టముక్కలను గృహాలంకరణకు వీలైన వెల్‌కమ్ బోర్డ్స్‌గా మార్చడం ముక్త ప్రత్యేకత. నగరంలో ఎక్కడ హ్యాండీక్రాఫ్ట్ మేళా జరిగినా తను తయారుచేసిన సరికొత్త వస్తువులతో ప్రత్యక్షమౌతారు ముక్త. వీటన్నింటితో పాటు బంకమట్టితో తయారుచేసిన ప్లేట్స్‌పై చిన్నారుల చేతి, పాద ముద్రలను కూడా అచ్చు పోయించి మధురస్మృతులను తయారుచేయిస్తుంటారు. ఈ తరహా వస్తువుల అమ్మకం ద్వారా లభించిన మొత్తంలో కొంత భాగాన్ని అనాధ శరణాలయాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులకు అందజేస్తుంటానని ముక్త తెలిపారు.
 
పాత సీసాలు బెడ్ ల్యాంప్‌లుగా మారతాయి
నగరంలో రీసైక్లింగ్ ఉత్పత్తుల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించిన సంస్థ మదర్ ఎర్త్. ఈ స్టోర్‌లో కనిపించే వస్తువులన్నీ రీసైక్లింగ్ విధానంలో తయారైనవే. అంతేకాకుండా ఎకోఫ్రెండ్లీ కూడా. పేపర్‌తో తయారుచేసిన బ్యాగులు మొదలుకొని పేపర్‌తో తయారైన గృహాలంకరణ వస్తువులు, మహిళలు వాడే పర్సులు, గడియారాలు కూడా పేపర్‌తోనే తయారవుతాయి. చాపలతో షూస్టాండ్‌లు, నారతో తయారుచేసిన ఫర్నీచర్ ఇవన్నీ ఈ స్టోర్ ప్రత్యేకత.  ముఖ్యంగా పనికిరాని గాజు సీసాలు ఈ స్టోర్‌లో బెడ్ ల్యాంప్‌లుగా దర్శనమిస్తాయి.

అంతేకాదు గాజు సీసాపై ప్రత్యేక కలర్ కోటింగ్‌లను వేసి, వాటిని ఫ్లవర్ వాజ్‌లుగా కూడా మార్చేస్తుంటారు. ఈ తరహా వస్తువుల తయారీనే ఎందుకు ఎంచుకున్నారని సంస్థ వ్యవస్థాపకులు ‘నీలం చిబ్బర్’ను ప్రశ్నిస్తే...‘ప్రస్తుతం ఏ వస్తువును తయారుచేయాలన్నా ఎన్నో రకాల రసాయనాలు వాడుతున్నారు. ఈ కారణంగా పర్యావరణ కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. అందుకే వస్తువుల తయారీలో ఎకోఫ్రెండ్లీ విధానాన్ని ఎంచుకున్నాం. ఇక రీసైక్లింగ్ ద్వారా సరికొత్త వస్తువులను తయారుచేయడం వల్ల వాటి ధర తక్కువై, మధ్య తరగతి వారికి ఆ వస్తువులు అందుబాటులో ఉంటాయనేది నా అభిప్రాయం’ అని చెప్పారు.
 
జీన్స్‌లతో బంప్ బ్యాగ్‌లు...
సాధారణంగా మార్కెట్‌లో ఇప్పటి వరకు లెదర్, ఫోమ్, కాటన్ ఇలా తదితర వాటితో తయారైన బ్యాగులు దర్శనమిస్తున్నాయి.  వాటన్నింటికి భిన్నంగా వచ్చిన బ్యాగ్‌లే బంప్ బ్యాగ్‌లు. ఈ తరహా బ్యాగ్‌ల తయారీకి శ్రీకారం చుట్టింది నగరానికి చెందిన ‘ఎ హండ్రెడ్ హ్యాండ్స్’ సంస్థ. వాడి పడేసిన జీన్స్ ప్యాంట్‌లను శుభ్రపరిచి, వాటితో బ్యాగ్‌లను తయారచేయడమే ఈ సంస్థ ప్రత్యేకత.  ఇలా తయారుచేసిన బ్యాగ్‌ల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకే వినియోగిస్తోంది. ఇందుకోసం ఈ సంస్థలో ఎంతో మంది విదేశీయులు కూడా వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఈ బంప్ బ్యాగ్స్ ధర రూ.250 నుండి ప్రారంభమౌతుందని సంస్థ ప్రతినిధి వెరీనా వెల్లడించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement