అతి కొద్దిమంది మాత్రమే వ్యర్థాలను కూడా ఉపయుక్తంగా మలచి, తమ జీవితాన్ని కూడా అర్థవంతంగా మార్చుకుంటారు. ఆ కొద్దిమంది జాబితాలో నిలుస్తుంది సౌమ్య కల్లూరి. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వాసి అయిన సౌమ్యముంబైలో సోషల్ ఎంటర్‌ప్రైజ్ ‘ద్విజ్’ అనే సంస్థను ఏర్పాటు చేసిదాని ద్వారా వాడి పడేసే డెనిమ్ దుస్తులను తిరిగి ఉపయోగించుకునేలా బ్యాగులు, టోపీలు, జ్యువెలరీ, క్లచ్‌లు, ఇతర యాక్సెసరీస్.. తయారు చేస్తోంది. ఈ పని ద్వారా 40 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నిథిమ్‌లో జరుగుతున్న దస్తకారి హాత్ సమితి క్రాఫ్ట్ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన డెనిమ్ స్టాల్‌లో తన ఉత్పత్తుల ద్వారా వ్యర్థాలతో కొత్త అర్థాలను మనకు పరిచయం చేస్తోంది.రెండోసారి మరింత కొత్తగా!
‘‘ద్విజ్ అంటే రెండవది అని అర్థం వచ్చేలా ఈ రీయూజ్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాను. డెనిమ్ లేదా జీన్స్ అని పిలిచే క్లాత్ చాలా గట్టిగా ఉంటుందని మనకు తెలుసు. కొంత కాలం వాడాక పాతబడి పోవడమో, బోర్ అనిపించడమో, రంగు వెలిసిందనో పిల్లలవైతే పొట్టిగా అయ్యాయనో .. ఇలా రకరకాల కారణాలతో డెనిమ్ దుస్తులను ఎవరికైనా ఇచ్చేస్తుంటారు. అవి తీసుకున్నవాళ్లు వాటిని వాడతారు అనే నమ్మకం లేదు. ఎందుకంటే, అవి వారి సైజుకు సరిపోకపోవచ్చు. వారు వాటిని చెత్తలో పడేయచ్చు. ప్రపంచమంతటా విరివిగా ఉపయోగిస్తూ, వాడి పడేసే జీన్స్‌ను తిరిగి ఉపయుక్తంగా మార్చేలా చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. దీంతో 2018లో ఈప్రాజెక్ట్‌ను 6 లక్షల రూపాయలతో ఆరంభించాను.
పర్యావరణ హితంగా..
మెకానికల్ ఇంజినీరింగ్ చేసి, ఎమ్మెస్ కోసం జర్మన్ వెళ్లాను. అక్కడ కార్బన్ ఉద్గారాలు, వ్యర్థాలపై పరిశోధన చేస్తున్నప్పుడు చాలా విషయాలు పరిశీలనకు వచ్చాయి. పర్యావరణహితంగా ఏదైనా వర్క్ చేయాలనుకున్నాను. ఏడాదిన్నర పాటు ఉద్యోగం చేసినా నా ఆలోచనలు మాత్రం రీ సైక్లింగ్ చుట్టూ తానే తిరుగుతూ ఉండేవి. వాడేసిన డెనిమ్‌పైన దృష్టి మళ్లి వాటిని సేకరించడం మొదలుపెట్టాను. వాడేసిన వాటర్ బాటిల్స్‌ను సేకరించి, రీ సైకిల్ చేసి, బ్యాగ్ లోపలివైపు వచ్చేలా డిజైన్ చేశాను. దీనివల్ల ఏదైనా పదార్థాన్ని బ్యాగ్‌లో తీసుకెళుతున్నప్పుడు డబ్బా మూతలు లీక్ అయినా సమస్య ఉండదు. ఈ బ్యాగ్‌లుఎక్కడా పాతవిగా అనిపించవు. మొదటిసారి వాడు తున్నట్టుగానే ఉంటాయి. ఈ తరం కోరుకునే బ్యాక్ ప్యాక్స్, క్లచ్‌లు, ల్యాప్‌టాప్ బ్యాగ్‌లు.. కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయి.
చిన్న పీస్‌ను కూడా వదలం
వాడేసిన జీన్స్‌ను సెకండ్ హ్యాండ్ మార్కెట్లో బల్క్‌లో కొనుగోలు చేస్తాం. కొందరు నేరుగా వచ్చి డొనేట్ చేస్తారు. ముందు వాటిని శుభ్రం చేయిస్తాం. ఆ తర్వాత వాటి సైజ్, షేడ్, సన్నం, మందం.. క్లాత్‌ని బట్టి దేనిని ఎలా మలచాలి అనే ఆలోచనకు వస్తాం. పదిమంది ఫుల్ టైమ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. 30మంది మహిళలు వాళ్ల ఇంటి నుంచే పని చేస్తారు. బాగా మందంగా ఉండి, పెద్ద పెద్ద జీన్స్ వస్తే వాటిని బ్యాగ్‌లుగా తయారు చేస్తాం. కొంచెం మీడియం సైజు వాటితో చిన్న బ్యాగ్స్,. పలుచటి, చిరిగిన జీన్స్‌తో హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ తయారు చేస్తాం. ఇంకా, బొమ్మలు, ఎంబ్రాయిడరీ చేసి హోమ్ డెకార్ ఐటమ్స్ కూడా ఇందులో ఉంటాయి.
మా దగ్గరకు వచ్చిన జీన్స్‌లో చిన్న ముక్కను కూడా వృథాగా పోనివ్వం. ఈ రోజుల్లో పర్యావరణం ఎలా ఉంటుందో చూస్తున్నాం. కాలానుగుణంగా వర్షాలు పడవు, భూ తాపం పెరిగిపోతుంటుంది. కాలుష్యం కంపెనీల నుంచో, వాహనాల నుంచో వస్తుందనే అనుకుంటాం. కానీ, మనం రోజూ వాడే బట్టలు కూడా కాలుష్యానికి పెద్ద కారకం. ఈ సమస్య నివారణకు చేసిన చిన్న ప్రయత్నమే ద్విజ్.
స్వచ్ఛంద సంస్థలతో కలిసి
మిషన్ గ్రీన్ ముంబయ్ స్వచ్ఛంద సంస్థతో కలిసి ప్రభుత్వ స్కూల్ పిల్లలకు హ్యాండ్ బ్యాగ్‌లను కానుకగా ఇచ్చాం. దీని ద్వారా అటు చదువుకునే పిల్లలనూ, ఇటు ఈ పనిలో భాగం పంచుకుంటున్న మహిళలనూ ్ ప్రోత్సహిస్తున్నాం. అనిమేథ్ చారిటబుల్ ట్రస్ట్ వారితో కలిసి మహిళలకు డెనిమ్ రీ యూజ్ ప్రాజెక్ట్‌లో భాగంగా వర్క్‌షాప్స్ ఏర్పాటు చేసి, శిక్షణ ఇస్తున్నాం. 2022లో సర్వోదయ ట్రస్ట్ ద్వారా తెలంగాణలోని వికారాబాద్ ప్రభుత్వ పాఠశాల పిల్లలకు హ్యాండ్ బ్యాగ్‌లను కానుకగా ఇచ్చాం. ఇండియా మొత్తంలో క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్స్ ఎక్కడ జరిగినా అక్కడ మా స్టాల్ ఏర్పాటుకు కృషి చేస్తుంటాం. దీనికి విడిగా షాప్ అంటూ ఏమీ లేదు. ఆన్‌లైన్ మార్కెటింగ్ చేస్తుంటాం’’ అని వివరిస్తారు సౌమ్య.
Comments
Please login to add a commentAdd a comment