స్లమ్ బ్లూమ్స్
సోమవారం రాత్రి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. ఢిల్లీ నుంచి వచ్చిన ఏపీ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ చేరుకుంది. అప్పటికే అక్కడ సందడి మొదలైంది. రైల్‌లో నుంచి ఇద్దరు బాలికలు దిగారు. ఆ బాలికలను వారి తల్లిదండ్రులు హత్తుకుని ముద్దాడి ఆనందపారవశ్యంలో మునిగిపోయారు. మురికివాడలో పుట్టిపెరిగిన ఆ పిల్లలకు ఇంతటి ఆత్మీయ స్వాగతం లభించడానికి కారణం.. ఆ బంగారు తల్లులు ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలసి వస్తున్నారు. భాగ్యనగరిలోని మురికివాడల్లో పుట్టిపెరిగిన ఈ పిల్లలు దేశ ప్రథమ పౌరుడిని ఎందుకు కలిశారన్నది తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!
బాలల దినోత్సవం రోజు రాష్ట్రపతితో సమావేశమయ్యేందుకు దేశవ్యాప్తంగా ఎంపికైన ఎనిమిది మంది బాలల్లో మన హైదరాబాద్‌కు చెందిన ఈ ఇద్దరు బాలికలు ఉన్నారు. మురుగు నిండిన గల్లీ నుంచి ఢిల్లీ చేరుకుని రాష్ట్రపతి భవన్‌లో అడుగు పెట్టారు. భారత రాష్ట్రపతితో సమావేశమయ్యారు. ఉంటున్న ఇల్లు.. చదువుకుంటున్న బడి తప్ప.. సిటీలో మరేం తెలియని వీరిద్దరూ.. పట్నం ఎలా ఉండాలో తమ అభిప్రాయాలను పెద్దాయనతో పంచుకున్నారు. ఆ ఇద్దరు ఆడపిల్లల పేర్లు శిరీష, నానావత్ వైష్ణవి. శిరీషది ముషీరాబాద్ సమీపంలోని అరుంధతినగర్ బస్తీ. వైష్ణవి బోరబండలోని అన్నానగర్ వాడలో ఉంటోంది.
ఢిల్లీ దిశగా..
శిరీష హిమాయత్‌నగర్‌లోని గురునానక్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. ‘మా నాన్న వెంకట సాయిలు దినసరి కూలీ. అమ్మ నాలుగు ఇళ్లలో పనిచేస్తుంది. మా ఇల్లు మురికివాడలో ఉంది. నేను బాగా చదువుకుంటున్నానని తెలిసి దివ్యదిశ స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధులు మా ఇంటికి వచ్చారు. హమారా బచ్‌పన్ బాలల సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నామని దానికి నన్ను లీడర్‌గా ఉండమన్నారు.
మా బస్తీలోని బాలలను కూడగట్టి వారి సమస్యలు తెలుసుకోవడం, పరిసరాల పరిశుభ్రత, విద్య, ఆరోగ్యకర వాతావరణం గురించి మురికివాడల పిల్లలకు తెలియజెప్పడం వంటి బాధ్యతలు అప్పగించారు. రెండేళ్లలో మా బస్తీలో ఎంతో మంది బాలల్లో పరివర్తన తీసుకురాగలిగాను. దివ్యదిశ సంస్థ తరఫున బాలల సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో రాష్ట్రపతిని కలిసే అరుదైన అవకాశం లభించింది’ అని శిరీష వివరించింది. ‘మా ఇల్లు బోరబండ అన్నానగర్‌లో ఉంది. నేను పెద్దమ్మనగర్ నాట్కో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నా. అమ్మ దేవి టైలర్ పని చేస్తుంది. నాన్న లక్ష్మణ్‌కు కంపెనీలో జాబ్. హమారా బచ్‌పన్‌లో టీమ్ లీడర్‌గా పనిచేసి ఢిల్లీకి వెళ్లగలిగాను’ అని తెలిపింది వైష్ణవి.
అన్నీ వివరించాం..
రాష్ట్రపతిని కలవడం జీవితంలో మరచిపోలేం అంటున్న ఈ బాలికలు.. ఆయనతో ఏం మాట్లాడారంటే ఇలా చెప్పుకొచ్చారు. ‘మాతో పాటు పలు రాష్ట్రాల నుంచి మరో ఆరుగురు బాలలు అక్కడికి వచ్చారు. రాష్ట్రపతితో ఆ రోజు రాత్రి మాట్లాడే అవకాశం వచ్చింది. మురికివాడల్లోని పరిసరాలు, అక్కడి కుటుంబాల గురించి వివరించాం. స్లమ్స్‌లో పుట్టిపెరుగుతున్న మాలాంటి బాలల జీవితాల గురించి కూడా చెప్పాం. మేం చేసిన కార్యక్రమాల వివరాలు తెలిపాం. మురికివాడలను డెవలప్ చేయాలని కోరాం. అన్నీ ప్రశాంతంగా విన్నారాయన. ఆ తర్వాత మాతో కరచాలనం చేశారు. రాష్ట్రపతితో కలసి గ్రూప్ ఫొటో కూడా దిగాం’ అని మరచిపోలేని క్షణాలను గుర్తు చేసుకున్నారు.
ఎంత బాగుందో..
రాష్ట్రపతిభవన్ గురించి చెబుతూ.. ‘ పెద్దగేట్ నుంచి పూల మొక్కలు, ఉద్యానవనాలు దాటుకుని రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నాం. మేం వెళ్లిన తర్వాత గంటకు ఆయన కలిశారు. ఆయనకు షేక్‌హ్యాండ్ ఇచ్చి జ్ఞాపికను అందిస్తున్న సమయంలో అన్నీ మరచిపోయాం. ఇల్లు, బడి తప్ప ఇంకేమి తెలియని మాకు ఆ భవనాన్ని చూడటానికి రెండు కళ్లు చాలలేదు. ఈ పర్యటన మా జీవితాంతం గుర్తుండిపోతుంది’ అని తెలిపారు.
..:: చీకోటి శ్రీనివాస్ ఫొటోలు: జి.రాజేష్