అందమంతా చీరలో కాదు..
చెంగావి రంగు చీర కట్టుకున్నా చూసేవాళ్ల దిమ్మదిరగాలంటే, అందమంతా చీరలో కాదు.. అది కట్టుకున్న తీరులో ఉండాలి. కంచి పట్టయినా, ధర్మవరం నేత చీరైనా.. రోజువారీ కట్టునే అనుసరిస్తూ ఒంటికి చుట్టుకుంటే సాదాసీదాగా ఉంటుంది. అదే కొంగును ముందుకు వచ్చేలాగానో.. కుచ్చిళ్లకు, కొంగుకు ముడి వేసి చూపిస్తేనో కొత్తగా ఉంటుంది. ఇలా డిఫరెంట్‌గా చీరలు చుట్టడంలో డాలీ జైన్ ఎక్స్‌పర్ట్. ఎంతలా అంటే రకరకాల చీరలను.. విధవిధాలుగా.. కడుతూ అతివలకు అదనపు సొబగులు అద్దుతున్నారు.
డాలీ జైన్ పుట్టింది, పెరిగింది బెంగళూరులో. పెళ్లయ్యే వరకు ఆమెకు చీరంటే ఏంటో తెలియదు. వెస్ట్రన్ డిజైనింగ్స్ ఫాలో అయ్యే డాలీ.. యూనిక్ కాస్ట్యూమ్స్‌లో తళుక్కుమనేది. పెళ్లి డాలీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆమె మెట్టినింట్లో చీర తప్ప మరో కాస్ట్యూమ్‌కు అవకాశం లేదు. గత్యంతరం లేక చీర కట్టడం మొదలుపెట్టింది. అందరు కట్టేలా తనూ కడితే మజా ఏముంటుందని తన మార్క్ చూపించాలనుకుంది.
డిఫరెంట్‌గా చీరలు కట్టుకోవడం సాధన చేసింది. ఓ రోజు ఫ్రంట్ పల్లుతో దర్శనమిస్తే.. మరో రోజు గుజరాతీ కట్టులో కనిపించేది.. ఇంకో రోజు కేరళ కుట్టీలా చీర చుట్టుకునేది. ఇలా రోజుకో చీరావతారంలో కనిపించి అత్తింటి వాళ్లను, వారి బంధువుల మనసులు గెలుచుకోవడమే కాదు, వారికీ చీరలు కట్టేది. 6 గజాల చీరలే కాదు, బామ్మల జమానా నాటి 9 గజాల చీరలతో కూడా ప్రయోగాలు చేసేది. తనలో ఉన్న క్వాలిటీని గ్రహించిన డాలీ.. చీర కట్టడాన్నే ప్రొఫెషన్‌గా మలచుకుని శారీ డ్రేపర్ అవతారం ఎత్తింది.
చీరతో కనికట్టు..
శారీ డ్రేపర్‌గా మారాక డాలీ దూకుడు పెంచిం ది. దేశంలోని అన్ని సంప్రదాయాలను ఫాలో అవుతూ.. వాటన్నింటినీ చీరకట్టులో చూపిం చేది. బెంగాలీ, రాజస్థానీ చీరకట్టును మిక్స్ చేసి చూపింది. చిన్న చిన్న ఫంక్షన్స్‌లో చీరలు చుట్టిన డాలీ తర్వాతి కాలంలో, సెలబ్రిటీల ఇళ్లలో ఈవెంట్లకు శారీ డ్రేపర్‌గా తనేంటో ప్రూవ్ చేసుకుంది.
యుక్తాముఖి, దియా మీర్జా, తనుశ్రీ దత్తా, కంగనా రనౌత్ వీళ్లందరినీ చీరకట్టి సింగారించింది. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ పెళ్లికి ఉపాసనకు చీర చుట్టింది ఈవిడే. హిప్ హాప్, టైట్ ఫిట్, ఫిష్ స్టయిల్, హాఫ్ ముంతాజ్ ఇలా శారీ వేరింగ్ ట్రెండ్స్‌ను పరిచయం చేసింది. ఒళ్లున్న వారిని లావుగా కనిపించకుండా, పొట్టి వారిని.. ఆ లోపం కనిపించకుండా చీరకట్టుతో కనికట్టు చేస్తుంది.
రికార్డులు చుట్టి..
శారీ డ్రేపింగ్‌లో ఎప్పటికప్పుడూ కొత్తదనం చూపిస్తున్న డాలీ అందులో రికార్డులు కూడా సొంతం చేసుకుంది. 80 డిఫరెంట్ స్టయిల్స్‌లో చీరలు చుట్టి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఒక్కో చీరను 19 సెకండ్లలో చుట్టి వహ్వా అనిపించుకుంది. తర్వాత ఒక్కో చీరను 18.5 సెకండ్లలో కడుతూ 125 డిఫరెంట్ స్టయిల్స్‌ను చూపించి తన రికార్డును తనే చుట్టేసింది.
తాజాగా 225 చీరకట్టుల ప్రయోగానికి సన్నద్ధం అవుతోంది. ‘తరతరాల నుంచి వస్తున్నా చీరలు ఎప్పటికప్పుడూ నయా ట్రెండ్‌గానే కనిపిస్తాయి. అది చీర గొప్పదనమే. అందులో వస్తున్న కొత్త కొత్త స్టయిల్స్ శారీని నిత్య నూతనంగా ఉంచుతున్నాయి’ అని చెబుతున్న డాలీ శనివారం తాజ్‌బంజారాలో శారీ డ్రేపింగ్ వర్క్‌షాప్ నిర్వహించింది.