Saree fabrications
-
పండుగ ఓణీ
ఓణీ చుడితేనే తెలుగింటి పండుగకు కళ ఓణీ రెపరెపలాడితేనే పెళ్లింట సందడికి సంబరం ఆధునిక డ్రెస్సులు ఎన్ని మెరిసినా సంప్రదాయ లంగా ఓణీయే సంక్రాంతికి ముచ్చటైన రంగవల్లిక. నేటి రోజుల్లో అమ్మాయిలతో పాటు అమ్మలు కూడా లంగా ఓణీ ధరించి మురిసిపోతున్నారు. హాఫ్ శారీ అనబడే లంగా ఓణీలో ఎన్నో డిజైన్స్ వచ్చాయి. వాటిలో.. ► పట్టు ఎప్పుడూ అగ్రశ్రేణిలో ఉంటుంది. దీంట్లోనూ కంజీవరం, బెనారస్‌లు ముందుండగా మనవైన పోచంపల్లి ఇక్కత్, ధర్మవరం, ఉప్పాడ, నారాయణ్‌పేట.. పట్టు లంగాలు అమ్మాయిలను బుట్టబొమ్మలుగా చూపుతున్నాయి. ► డిజైనర్ లెహెంగా కావాలనుకుంటే మాత్రం నెటెడ్ ఫ్యాబ్రిక్ నేటికీ ముందున్నది. చూడముచ్చటైన రంగుల హంగుల వల్ల నెటెడ్ లెహెంగాలను డిజైనర్లు తీరొక్కవిధంగా తీర్చిదిద్దుతున్నారు. నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద ఎంబ్రాయిడరీ సొబగులు, లేసుల జతలు అల్లిబిల్లిగా చేరి అందంగా రూపుకడుతున్నాయి. కంచిపట్టు ఫ్యాబ్రిక్ లంగా ఓణీకి మంచి అందం తెస్తుంది. శరీరాకృతికి తగ్గట్టు బ్లౌజ్‌కి పొడవు లేదా బుట్ట లేదా పొట్టి చేతులు పెట్టించుకోవాలి. సన్నని అంచు ఉన్న ప్లెయిన్ ఓణీ వేసుకుంటే ముచ్చటగా కనిపిస్తారు. ఫ్యాషన్ కంచిపట్టు లాగానే బెనారస్ ఫ్యాబ్రిక్‌తో లెహంగాలు రూపొందించుకోవచ్చు. అదే రంగు ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని, పూర్తి కాంట్రాస్ట్ ఓణీ జత చేసుకుంటే లుక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఈ లెహెంగాకి ఆంధ్రాలో తయారైన పుట్టపాక శారీని ఎంచుకున్నాను. ప్లెయిన్ బ్లౌజ్ డిజైన్ చేసి, కలంకారీ దుపట్టా జత చేశాను. నగలు హెవీగా ఉండేలా ప్లాన్ చేయడంతో ఒక డిఫరెంట్ స్టైల్ వచ్చింది. సాదా సీదా – డిజైనర్ బ్లౌజ్ ► ప్లెయిన్‌ని ఇష్టపడేవారు పట్టు పావడాను అదే కాంబినేషన్లో ఉన్న పట్టు బ్లౌజ్ కుట్టేసి ఆ రెండింటినీ కూర్చుతున్నట్టు ప్లెయిన్ ఓణీని వేసుకుంటే పండుగ కళ రెట్టింపు అవుతుంది. ► డిజైనర్ బ్లౌజ్‌లలో కలర్ కాంబినేషన్స్‌తో పాటు ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, ప్యాచ్ వర్క్, మిర్రర్ వర్క్.. వంటివి ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇవి డిజైనర్ లెహెంగాలకే కాకుండా పట్టు లంగాలకు కూడా బాగా నప్పుతాయి. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అదీ పట్టు, రా సిల్క్, నెటెడ్.. ఏదైనా తీసుకుంటే పెద్ద పెద్ద అంచులు జత చేయడానికి మార్కెట్లో విడిగా డిజైన్ చేసిన బార్డర్లు లభిస్తున్నాయి. కుచ్చులు కూర్చాక, బార్డర్ని జత చేస్తే చాలు చూడముచ్చటైన లెహెంగా రెడీ అవుతుంది. పండుగకు నప్పే రంగులు ► పసుపు, పచ్చ, ఎరుపు రంగుల కాంబినేషన్‌తో రూపుదిద్దుకున్న లంగా ఓణీలు, చీరలు పండుగ కళను రెట్టింపు చేస్తాయి. ► వీటి మీదకు టెంపుల్ జువెల్రీ లేదంటే పాతకాలం నాటి యాంటిక్ జువెల్రీ బాగా నప్పుతాయి. ► పొడవాటి జడలు, పువ్వులతో అలంకరణ జడలు లంగాఓణీ కళకు జీవం పోస్తాయి. నెట్ ఫ్యాబ్రిక్ వాడినప్పుడు ఆలోవర్ డిజైన్ తీసుకోవాలి. బ్లౌజ్ ఎంబ్రాయిడరీ హెవీగా ఉండాలి. వీటిలో ఫ్లోరల్ లేదా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడు లెహెంగా ప్రింట్లో బాగా కనిపించే రంగు బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలి. రెండింటికీ నప్పేలా ఓణీని సెట్ చేసుకోవాలి. లెహెంగా మీద ఎంబ్రాయిడరీ వర్క్ హెవీగా ఉంటే బ్లౌజ్‌ని ప్లెయిన్‌గా స్టైలిష్‌గా డిజైన్ చేయించుకోవాలి. రాసిల్క్, వెల్వెట్ లెహెంగాల మీదా ఎంబ్రాయిడరీ గ్రాండ్‌గా తీర్చిదిద్దవచ్చు. భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్ -
అందమంతా చీరలో కాదు..
చెంగావి రంగు చీర కట్టుకున్నా చూసేవాళ్ల దిమ్మదిరగాలంటే, అందమంతా చీరలో కాదు.. అది కట్టుకున్న తీరులో ఉండాలి. కంచి పట్టయినా, ధర్మవరం నేత చీరైనా.. రోజువారీ కట్టునే అనుసరిస్తూ ఒంటికి చుట్టుకుంటే సాదాసీదాగా ఉంటుంది. అదే కొంగును ముందుకు వచ్చేలాగానో.. కుచ్చిళ్లకు, కొంగుకు ముడి వేసి చూపిస్తేనో కొత్తగా ఉంటుంది. ఇలా డిఫరెంట్‌గా చీరలు చుట్టడంలో డాలీ జైన్ ఎక్స్పర్ట్. ఎంతలా అంటే రకరకాల చీరలను.. విధవిధాలుగా.. కడుతూ అతివలకు అదనపు సొబగులు అద్దుతున్నారు. డాలీ జైన్ పుట్టింది, పెరిగింది బెంగళూరులో. పెళ్లయ్యే వరకు ఆమెకు చీరంటే ఏంటో తెలియదు. వెస్ట్రన్ డిజైనింగ్స్ ఫాలో అయ్యే డాలీ.. యూనిక్ కాస్ట్యూమ్స్‌లో తళుక్కుమనేది. పెళ్లి డాలీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆమె మెట్టినింట్లో చీర తప్ప మరో కాస్ట్యూమ్‌కు అవకాశం లేదు. గత్యంతరం లేక చీర కట్టడం మొదలుపెట్టింది. అందరు కట్టేలా తనూ కడితే మజా ఏముంటుందని తన మార్క్ చూపించాలనుకుంది. డిఫరెంట్‌గా చీరలు కట్టుకోవడం సాధన చేసింది. ఓ రోజు ఫ్రంట్ పల్లుతో దర్శనమిస్తే.. మరో రోజు గుజరాతీ కట్టులో కనిపించేది.. ఇంకో రోజు కేరళ కుట్టీలా చీర చుట్టుకునేది. ఇలా రోజుకో చీరావతారంలో కనిపించి అత్తింటి వాళ్లను, వారి బంధువుల మనసులు గెలుచుకోవడమే కాదు, వారికీ చీరలు కట్టేది. 6 గజాల చీరలే కాదు, బామ్మల జమానా నాటి 9 గజాల చీరలతో కూడా ప్రయోగాలు చేసేది. తనలో ఉన్న క్వాలిటీని గ్రహించిన డాలీ.. చీర కట్టడాన్నే ప్రొఫెషన్‌గా మలచుకుని శారీ డ్రేపర్ అవతారం ఎత్తింది. చీరతో కనికట్టు.. శారీ డ్రేపర్‌గా మారాక డాలీ దూకుడు పెంచిం ది. దేశంలోని అన్ని సంప్రదాయాలను ఫాలో అవుతూ.. వాటన్నింటినీ చీరకట్టులో చూపిం చేది. బెంగాలీ, రాజస్థానీ చీరకట్టును మిక్స్ చేసి చూపింది. చిన్న చిన్న ఫంక్షన్స్‌లో చీరలు చుట్టిన డాలీ తర్వాతి కాలంలో, సెలబ్రిటీల ఇళ్లలో ఈవెంట్లకు శారీ డ్రేపర్‌గా తనేంటో ప్రూవ్ చేసుకుంది. యుక్తాముఖి, దియా మీర్జా, తనుశ్రీ దత్తా, కంగనా రనౌత్ వీళ్లందరినీ చీరకట్టి సింగారించింది. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ పెళ్లికి ఉపాసనకు చీర చుట్టింది ఈవిడే. హిప్ హాప్, టైట్ ఫిట్, ఫిష్ స్టయిల్, హాఫ్ ముంతాజ్ ఇలా శారీ వేరింగ్ ట్రెండ్స్‌ను పరిచయం చేసింది. ఒళ్లున్న వారిని లావుగా కనిపించకుండా, పొట్టి వారిని.. ఆ లోపం కనిపించకుండా చీరకట్టుతో కనికట్టు చేస్తుంది. రికార్డులు చుట్టి.. శారీ డ్రేపింగ్‌లో ఎప్పటికప్పుడూ కొత్తదనం చూపిస్తున్న డాలీ అందులో రికార్డులు కూడా సొంతం చేసుకుంది. 80 డిఫరెంట్ స్టయిల్స్‌లో చీరలు చుట్టి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఒక్కో చీరను 19 సెకండ్లలో చుట్టి వహ్వా అనిపించుకుంది. తర్వాత ఒక్కో చీరను 18.5 సెకండ్లలో కడుతూ 125 డిఫరెంట్ స్టయిల్స్‌ను చూపించి తన రికార్డును తనే చుట్టేసింది. తాజాగా 225 చీరకట్టుల ప్రయోగానికి సన్నద్ధం అవుతోంది. ‘తరతరాల నుంచి వస్తున్నా చీరలు ఎప్పటికప్పుడూ నయా ట్రెండ్గానే కనిపిస్తాయి. అది చీర గొప్పదనమే. అందులో వస్తున్న కొత్త కొత్త స్టయిల్స్ శారీని నిత్య నూతనంగా ఉంచుతున్నాయి’ అని చెబుతున్న డాలీ శనివారం తాజ్‌బంజారాలో శారీ డ్రేపింగ్ వర్క్‌షాప్ నిర్వహించింది.