అంతా మన మంచికే!
వైద్యులు ఏది చెప్పినా మన మంచికే. కాకపోతే వారు వైద్యశాస్త్రం చదివి ఉంటారు. శాస్త్రం ఎప్పుడైనా నిష్కర్షగా, కర్కశంగా చెబుతుందన్న విషయం పింగళివారు మాయాబజారు ద్వారా ఎప్పుడో చెప్పించారు. దాన్ని మనం సౌమ్యంగా, సున్నితంగా స్వీకరించాలని కూడా తన పాత్రల ద్వారా బోధించారు. కాబట్టి డాక్టర్ల మాటా, ఫీజూ, వారితో వ్యవహారం మనకు కాస్త నిష్కర్షగా, కర్కశంగా అనిపించవచ్చు. కానీ మనం దాన్ని పాజిటివ్ దృక్పథంతో మెత్తగా, మృదువుగా తీసుకోవాలి.
అయితే బాగా చదువుకున్న వారికి కించిత్ పండిత గర్వం ఉంటుంది. పండితులైన వారికీ సరస్వతీ కటాక్షం నిండుగా ఉంటుంది. దాంతో లక్ష్మీదేవి కటాక్షం నిండుకొని ఉంటుంది. అత్తాకోడళ్లకెప్పుడూ పడదు కాబట్టి ఆటోమేటిగ్గా లక్ష్మీదేవికీ, పండితులవారికి బొత్తిగా సరిపడకుండా ఉంటుంది. అలాంటి బాగా చదువుకున్న ఒకాయనకు ఒకసారి జబ్బు చేసి వైద్యుడి దగ్గరికి వెళ్లాడు. సదరు వైద్యజ్ఞులు మన పండితులవారి దగ్గర డాక్టరు కన్సల్టేషను కోసమని, టెస్టుల కోసమనీ విపరీతంగా ధనం గుంజి ఉంటారు.
అసలే కవి, దానికి తోడు కన్సల్టేషనిత్యాది ఖర్చులతో ఎగస్ట్రాగా మంట. దాంతో సహజంగానే సంస్కృత పండితులైన మన కవిగారికి విపరీతమైన కోపం వచ్చింది. అంతే... ఫీజులవీ తడిసి మోపెడైనందుకు చిర్రెత్తుకొచ్చింది. దాంతో వావీవరసా మరచిపోయారు. ‘వైద్యో నారాయణో హరిః’ అని కదా నానుడి. వైద్యుడి నారాయణుడంతటి వాడన్న విషయాన్ని తనకు గల మంట వల్ల వక్రీకరించి కవిత్వంలో అందునా సంస్కృతంలో శాపనార్థాలు పెట్టారు.
వైద్యరాజ నమస్తుభ్యం / యమరాజ సహోదర
యమన్తు హరతి ప్రాణాన్ / వైద్యః ప్రాణాన్ ధనానిచ!
అనగా ‘యముడికి సోదరుడైన ఓ వైద్య రాజా నీకు నమస్కారం. యముడి కంటే నువ్వే గొప్ప. ఎందు కంటే... పాపం... యముడికి ప్రాణాలు తీయడం మాత్రమే వచ్చు. నీకు దాంతో పాటు జేబులో డబ్బులు తీయడం కూడా వచ్చు’ అంటూ ఆడిపోసుకున్నాడు. ఇంతలో తోటి పండితుడైన వారెవరైనా ‘యముడి సోదరుడు శని కదా?’ అని సందేహం లేవనెత్తగా... అవన్నీ ఆలోచించకుండానే కవిత్వం చెప్పానంటావా? శనిదేవుడిలాగే వైద్యభగవానుడూ తగులుకుంటే ఓ పట్టాన వదలడు అందుకే కవిత్వంలో నా ఎక్స్‌ప్రెషన్ ఎగ్జాక్ట్‌లీ సరైనదే అంటూ సర్టిఫికెట్ కూడా ఇచ్చుకున్నాడు.
కానీ... సదరు పండితుల వారిలా మనం డాక్టర్ల చర్యలను తప్పుపట్టకూడదు. పాజిటివ్ దృష్టితో చూడాలి. వారేం చేసినా మన కోసమే, మన మంచి కోసమే చేస్తారు. ఉదాహరణకు మనకు మటనూ, చికెనూ ఇష్టమనుకోండి. వారు అవేవీ తినవద్దంటారు. మటను కిలో రూ. 500 పైమాటే. అదే కూరగాయలనుకోండి... రోజుకు రూ.20 ఖర్చు చేసినా 25 రోజులు గడిచిపోతాయి.
అంటే ఒక్క రోజు విలాసంగా ఖర్చు చేసే బదులు అదే సొమ్ముతో దాదాపు నెల రోజుల కూరల సమకూరేలా చూస్తున్నారు. ఒకవేళ మనకు జబ్బు చే సిందనుకోండి... ఆ కిలో మాంసం డబ్బును ఆయనకు కన్సల్టేషన్‌గా కట్టడానికి సౌకర్యంగా ఉంటుంది. అలాగే మనకు మోటారు సైకిలూ, కారూ గట్రా ఉన్నా నడక ప్రాక్టీసు చేయమంటారు.
ఎందుకంటే... రేపు పొరబాటునో, గ్రహపాటునో మనకు ఏ ఆపరేషనో జరిగిందనుకోండి... మన కారునో, బైకునో అమ్మేసి, ఆ సొమ్మును సర్జరీకి కట్టేస్తాం. ఈ లోపు నడక బాగా అలవాటైపోయిందనుకోండి... ఇక హాయిగా, శ్రమలేకుండా నడవచ్చు. సొమ్ముకోసం కారూ, బైకూ అమ్ముకున్నామన్న దిగులుండదు. పెట్రోలు ధర పెరిగిందన్న బాధ ఉండదు.
ఇక ఎంత నడిస్తే అంత ఆరోగ్యం ఎగస్ట్రా లాభం. ఇలా వారేం చెప్పినా ఆ మాటల వెనక సొంతలాభం కన్నా, ఒక మహితోక్తీ, మతలబూ ఉంటాయని గ్రహించాలి. పింగళి వారు చెప్పినట్లుగా శాస్త్రం తాలుకు కర్కశత్వం వెనక తర్కమేమిటో సంగ్రహించాలి. రసపట్టులో తర్కం కూడదేమోగానీ... జబ్బు కారణంగా వచ్చిన నీరసపట్టులో తర్కం సహేతుకమే.
యాసీన్