గిరిగీతలు నగరికి
హత్తుకున్న ధన్యులు! వేష, భాష, నడక, నడతల్లోనే కాదు కళల్లోనూ కృత్రిమత్వానికి బహుదూరం! చిత్రరచనలోనూ వాళ్ల కుంచె ప్రకృతినే ప్రస్తుతిస్తుంది. అధునాతన హంగులు అద్దుకోని ఆ రంగులు గిరి దాటి నగరికి చేరుతున్నాయి. ఆ సహజ కళను నాగరిక ప్రపంచానికి పరిచయం చేయాలనే కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఏటా ‘ఆదిచిత్ర’ పేరుతో గిరిజన చిత్రకళాప్రదర్శనను ఏర్పాటు చేస్తోంది. ఈసారి దీనికి తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యమిస్తోంది. మాసబ్‌ట్యాంక్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలోని నెహ్రూ మ్యూజియం వేదికగా ఈ నెల 15న ప్రారంభం కానున్న ఈ ప్రదర్శన 21 వరకూ కొనసాగనుంది.
ప్రత్యేకమైన కళ
గిరిజన చిత్రాలు ప్రత్యేకమైనవి. నిజానికి వీళ్ల చిత్రకళకు వాళ్ల గుడిసెల గోడలే క్యాన్వాసులు. వాళ్లు కొలిచే దేవుళ్లు, దైనందిన జీవితం, అది సాఫీగా సాగడానికి ప్రకృతిని వాళ్లు కోరే దీవెనలే.. ఆ కళకు వస్తువులు! జీవం ఉట్టిపడే ప్రతిగీతకు ప్రకృతి ప్రసాదించిన రంగులే అదనపు హంగులు సమకూరుస్తాయి. ఈ అందాలన్నీ ఈ చిత్రప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. ఈ ప్రదర్శనలో తెలంగాణకు చెందిన గోండులు, పర్‌ధానులు, పిథోరా, కోయ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సవర్లు, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రత్వా, భిలాల, నాయక్, భిల్ తెగల గిరిజన కళాకారులు పాల్గొననున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ‘నాయకపోడ’ గిరిజనులు తమ నృత్యంతో అలరించనున్నారు.
టైఫెడ్.. ట్రైబల్ కో-ఆపరేటివ్
మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (కేంద్ర గిరిజనశాఖ అనుబంధ సంస్థ) గిరిజన ఉత్పత్తులు, హస్తకళలను ప్రమోట్ చేయడానికి.. వాటికి మార్కెటింగ్ కల్పించడానికి ఏర్పడిన సంస్థ. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని మళ్లీ గిరిజన సంక్షేమానికే వినియోగిస్తారు. ఇక్కడ ‘ఆదిచిత్ర’ను నిర్వహిస్తున్నది ఈ టైఫెడే. ఈ చిత్ర కళాప్రదర్శనలో పాల్గొంటున్న వారంతా ఆదివాసీలే.