దీపావళి తరువాతే ముహూర్తం!
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరి మద్దతు తీసుకోవాలన్న అంశంపై బీజేపీ ఇంకా ఊగిసలాడుతోంది. శాసనసభ ఎన్నికలలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రాజకీయం ఉయ్యాలా జంపాలలా ఊగుతోంది. బీజేపి ఇక్కడ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బయట నుంచి మద్దతు ఇవ్వడానికి ఎన్సీపి ముందుకు వచ్చింది. అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపి ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. చిరకాలం నుంచి మిత్రపక్షంగా ఉన్న శివసేన మద్దతు తీసుకోవాలా? ఎన్సీపి మద్దతు తీసుకోవాలా? అనే అంశం తేల్చుకోలేకపోతోంది. దాంతో ప్రభుత్వం ఏర్పాటుకు ఆలస్యం జరుగుతోంది.
ఫలితాలు వెలువడిన తరువాత మద్దతు ఇవ్వడానికి శివసేన ముందుకురాలేదు. వాళ్లే తమ దగ్గరకు రావాలన్నట్లు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే భీష్మించుకు కూర్చున్నారు. అంతేకాకుండా, మహారాష్ట్ర అభివృద్ధికి పాటుపడే ఎవరితోనైనా కలుస్తామని ప్రకటించడం బీజేపికి ఇబ్బందిగా పరిణమించింది. మరోవైపు ఎన్సీపి అడగకుండానే మద్దతు ఇస్తామని ప్రకటించింది.
బీజేపి శివసేనకు షాక్ ఇచ్చే విధంగా ఎన్సీపి, ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. శివసేనను మద్దతు అడుగకూడదని బీజేపి నిర్ణయించుకుంది. ఆ పార్టీ మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పావులు కదుపుతోంది. ఈ నేపధ్యంలో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు దీపావళి తరువాతే ముహూర్తం నిర్ణయిస్తారని తెలుస్తోంది.
**