మహారాజసం
దేశంలో ఎన్నో రాచరికపు భవంతులు ఉన్నా... హైదరాబాద్‌లో కొలువుదీరిన ప్యాలెస్‌ల హంగు, ఆర్భాటాలు ఎంతో ప్రత్యేకం. మాటల్లో చెప్పే కంటే చౌమొహల్లా ప్యాలెస్ చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. నాటి ఘన చరిత్రకు సాక్ష్యాలుగా, కళాకారుల అద్భుత పనితనానికి నిదర్శనంగా, ఎందరో పర్యాటకుల మనసు దోస్తున్న ఈ ప్యాలెస్‌ను చూసొద్దాం రండి...
చార్మినార్... లాడ్‌బజార్ దాటాక ఓ ఫర్లాంగ్ దూరంలో యూరోపియన్ శైలిలో నిర్మించిన నాలుగు ప్యాలెస్‌ల సముదాయం కనిపిస్తుంది. అదే చౌమొహల్లా. మక్కా మసీదుకు వెనకాల సుమారు 2.9 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో దీన్ని నిర్మించారు.
నాలుగు అత్యున్నత, అందమైన భవన సముదాయాల ప్రాంగణంగా, నిజాం ప్రభువుల నివాస గృహంగా చౌమొహల్లా ప్రసిద్ధికెక్కింది. రెండో నిజాం కాలంలో తొలుత ఈ ప్రాంతంలో ఖిల్వత్ ప్యాలెస్ నిర్మించారు. ‘ఖిల్వత్’ అంటే ఏకాంత ప్రదేశం అని అర్థం. చౌమొహల్లాలోని నాలుగు ప్యాలెస్‌ల నిర్మాణం ఐదో నిజాం అఫ్జల్ ఉద్ దౌలా బహదూర్ పాలనాకాలం (1857-69)లో జరిగిందని చరిత్రకారుల అభిప్రాయం.
1590-91 మధ్య కాలంలో హైదరాబాద్‌ను స్థాపించిన మహ్మద్ కులీ కుతుబ్‌షాషీ సామ్రాజ్యంలో, ‘చార్మినార్’ కేంద్ర బిందువుగా ఐదో కులీ కుతుబ్ భాగ్యనగరం, చుట్టు పక్కల పలు అపురూపమైన కట్టడాలను నిర్మించారు. అయితే 1687లో మొఘలు చక్రవర్తుల సైన్యం ఔరంగజేబు నేతృత్వంలో ఒక్క చార్మినార్, ఆ పరిసరాలలో గల మసీదులను మినహాయించి అన్నింటినీ నేలమట్టం చేసింది.
కుతుబ్‌షాహీల పాలన తరువాత దక్కన్ ప్రాంతాన్ని చేజిక్కించుకున్న అసఫ్‌జాహీల పాలన సుమారు ఒకటిన్నర శతాబ్దం పైగా అప్రతిహతంగా కొనసాగింది. అసఫ్‌జాహీల పాలనాకాలంలో నాటి పూర్వ వైభవాన్ని చాటి చెప్పేలా ఆశ్చర్యం కలిగించే పలు భవన సముదాయాల నిర్మాణం జరిగింది.
ఆ రకంగా అసఫ్‌జాహీలు తొలినాళ్లలో చేపట్టిన నిర్మాణాల్లో ‘ఖిల్వత్ ప్యాలెస్’ చెప్పుకోతగ్గది. ఐదో నిజాం అఫ్జల్ ఉద్ దౌలా బహదూర్ పాలనాకాలంలో ఖిల్వత్ ప్యాలెస్ ప్రాంగణంలో అనేక అపురూప కట్టడాల నిర్మాణం చేపట్టారు. టెహ్రాన్‌లోని షా ప్యాలెస్‌ను పోలిన ఆర్కిటెక్చర్‌తో చౌమొహల్లాలో ఐదో నిజాం అఫ్తాబ్ మహల్, మహ్తాబ్ మహల్, తహ్‌నియత్ మహల్, అఫ్జల్ మహల్‌ల నిర్మాణం చేపట్టారు. టెహ్రాన్‌లోని ప్యాలెస్ కంటే ఎన్నో రెట్లు మిన్నగా నిజాం ప్రభువు ఈ ప్యాలెస్‌లను నిర్మించాడని చరిత్రకారులు చెబుతారు. కాగా,
1912 ప్రాంతంలో ఏడో నిజాం చౌమొహల్లాకు తగిన మరమ్మతులు చేయించి ప్యాలెస్‌ను మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. చౌమొహల్లాలోని ప్రధాన ప్రవేశ ద్వారానికి అతిపెద్ద గడియారాన్ని 1915లో ఏడో నిజాం ఏర్పాటు చేశారు. ఇందులోని విశాల ప్రాంగణంలో పచ్చిక బయళ్లు, నీటి కొలను, అందులో అతిపెద్ద పాలరాతి ఫౌంటెయిన్ ఉన్నాయి. ఫౌంటెయిన్‌లో నుంచి నీళ్లు విరజిమ్ముతుంటే... నిండు పున్నమి రోజుల్లో, ‘అరేబియన్ నైట్స్’ కథల్లో వర్ణించినట్టు ఉంటుందని కళాభిమానులు చెబుతారు. ఈ ఫౌంటెయిన్‌కు ఉత్తరాన విశాలమైన దర్బార్ హాలు ఎత్తయిన పీఠంపై కనిపిస్తుంది.
దర్బారు హాలులో నిజాం కొలువుదీరి ఉంటే, ఆ దారిన వచ్చే సందర్శకులంతా ఆయన కంట్లో పడేలా నిజాం తన సింహాసనం ఏర్పాటు చేసుకున్నాడు. దర్బారు హాలులో నేలపై పరిచిన పాలరాతిలో మన నీడ కనిపిస్తుంది. అంతేకాదు... తల ఎత్తి చూస్తే హాలు సీలింగ్ ఆకాశాన్ని తాకుతుందా... అన్నట్టు అనుభూతి. అందమైన లతలు, పూలంకరణలతో అరవై అడుగుల ఎత్తున సీలింగ్, ఆ సీలింగ్ నుంచి వేలాడుతూ లెక్కకు మిక్కిలిగా ఉన్న భారీ బెల్జియం క్రిస్టల్ శాండిలియర్స్ అందాలు... తప్పక చూసి తీరాల్సిందే!
ఆనాటి రాచరికపు హోదాకు తీపి గుర్తుగా శాండిలియర్‌లు నేటికీ చెక్కు చెదరక కనిపిస్తున్నాయి. ఇవి చాలా వరకు నిజాంకు బహుమతిగా వచ్చాయని, మరికొన్ని 1799 ప్రాంతంలో జరిగిన యుద్ధంలో భాగంగా ఆయనకు చెందాల్సిన వాటాగా టైగర్ ఆఫ్ మైసూర్ టిప్పు సుల్తాన్ బహూకరించారని చెబుతారు. ఆ రోజుల్లో కరెంటు సౌకర్యం లేదు. కరెంటు లేని రోజుల్లో శాండిలియర్‌లను ఏం చేసుకోవాలి అనే సందేహం రావడం సహజం. వీటిల్లో పొగరాని కొవ్వొత్తులను వాడారు.
మసి పట్టని ఆ కొవ్వొత్తులను లండన్ నుంచి దిగుమతి చేసుకొనేవారట. ప్రస్తుతం ఆ నాటి కొవ్వొత్తులతో భద్రంగా ఉన్న అందమైన శాండిలియర్స్‌ను చూస్తుంటే అబ్బురమనిపిస్తుంది. తన ఆస్థానానికి వచ్చే విదేశీ ప్రముఖులకు ఆహ్వానం, స్టేట్ రిసెప్షన్లు ఇక్కడే ఇచ్చేవారు. 1905లో కింగ్ జార్జ్-5, క్వీన్ మేరీలు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు నిజాం వారికి సాదరంగా చౌమొహల్లా ప్యాలెస్‌లోనే స్వాగతం పలికారు.
వందల ఏళ్లు పైబడి చరిత్ర ఉన్న ఈ ప్యాలెస్ నేడు నిజాం ట్రస్టు నిర్వహణలో ఉంది. చాలా కాలం... అంటే 2004 వరకు చౌమొహల్లాను సందర్శించాలనుకునేవారికి అందని ద్రాక్షగానే ఉండేది. కానీ, ప్రస్తుతం సామాన్యులు కూడా రాజభవనంలోకి వెళ్లి ఆ నాటి వైభవాన్ని కళ్లారా చూసే అవకాశం ఉంది. నాటి కళాకారుల అద్భుతమైన పనితనాన్ని పరిశీలించవచ్చు.
ప్రవేశ రుసుము రూ.40. ప్రతి శుక్రవారం సెలవు. వివరాలకు ఫోన్:040-24522032. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇటీవల కాలంలో తరచూ సాయంత్రం పూట అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక సందర్భాల్లో ప్యాలెస్‌లోని ఆరుబయట పచ్చిక బయళ్లలో సమావేశాల నిర్వహణకు అవకాశం కల్పిస్తున్నారు.