రెడీ టూ ట్రయథ్లాన్
నగరంలో హైదరాబాద్ ట్రయథ్లాన్ సందడి మొదలైంది. మొన్న మడ్ రన్ నిర్వహించిన గ్రేట్ హైదరాబాద్ అడ్వంచర్ క్లబ్ (జీహెచ్‌ఎసీ) ఇప్పుడు మరో మెగా ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 12న నగరంలోని గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్, దంతంపల్లి ఐసీఎఫ్‌ఏఐ(ఇక్‌ఫై) దీనికి వేదికగా వూరనుంది. వరుసగా ఐదో ఏడాది జరుగుతున్న ఈ ఈవెంట్‌లో ఈసారి స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్‌తో పాటు కొత్తగా 3/4 ఐరన్, పవర్ డువథ్లాన్ కూడా వచ్చి చేరారుు. ఇందులో సుమారు 2,500 మంది పాల్గొంటారని అంచనా. ‘సాధారణ పౌరుల్లో ట్రయథ్లాన్ గురించి అవగాహన కల్పిస్తున్నాం. ఈ ఈవెంట్ వల్ల పోటీదారుల శారీరక, మానసిక ఫిట్‌నెస్ మెరుగుపడుతుంది. ఆరోగ్యకర జీవనం కోసం కుటుంబాలు పాల్గొనేందుకు ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఈవెంట్‌లాగా దీన్ని నిర్వహిస్తున్నాం’ అని జీహెచ్‌ఎసీ కో-ఆర్గనైజర్ సురేశ్ చెబుతున్నారు.
ఐదేళ్ల పైబడినవారికి...
ఐదేళ్లపైబడిన వారు పాల్గొనవచ్చు. 18 ఏళ్లలోపు పిల్లలు తల్లిదండ్రులు సంతకం చేసిన పేరెంటల్ కాన్సెంట్ ఫారమ్‌ను సమర్పించాలి. సైక్లింగ్‌లో పాల్గొనాలనుకునేవాళ్లు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని సైకిల్ బుక్ చేసుకోవచ్చు. కొన్ని ఈవెంట్‌లకు ఉన్న ప్రత్యేక అర్హతలు అవసరం. ఇందుకోసం వెబ్‌సైట్ చూడవచ్చు. ఔత్సాహికులు hyderabadtriathlon.com వెబ్‌సైట్‌లో ఎంట్రీలు నమోదు చేసుకోవచ్చు.
పోటీలు ఇలా...
3/4 ఐరన్ ఈవెంట్‌ను స్విమ్మింగ్‌లో 2.9 కిలోమీటర్లు, సైక్లింగ్‌లో 135 కిలోమీటర్లు, రన్నింగ్‌లో 31 కిలోమీటర్లు, 1/2 ఐరన్‌ను 1.9 కిలో మీటర్లుగా, స్విమ్మింగ్, సైక్లింగ్ 90 కిలో మీటర్లు, రన్నింగ్
21.1 కి.మీలుగా, ఒలింపిక్ ఈవెంట్‌ను స్విమ్మింగ్‌లో 1.5 కిమీలు, సైక్లింగ్‌లో 40 కిమీలు, రన్నింగ్‌లో
10 కిలో మీటర్లు నిర్వహిస్తున్నారు. స్ప్రింట్
ట్రయథ్లాన్‌లో సైక్లింగ్ 20 కిలోమీటర్లు,
రన్నింగ్ 5 కిలోమీటర్లు, స్విమ్మింగ్ 750
మీటర్లు, నోవైస్ ట్రయథ్లాన్‌లో సైక్లింగ్ 8
కిలోమీటర్లు, రన్నింగ్ రెండు కిలోమీటర్లు,
స్విమ్మింగ్ 300 మీటర్లుగా ఆర్గనైజ్ చేస్తున్నారు.
ఈత రాని వారికి...
ఈత రానివారి కోసం పవర్ డూవథ్లాన్, ఒలింపిక్ డూవథ్లాన్, స్ప్రింట్ డూవథ్లాన్, నోవైస్ డూవథ్లాన్ పోటీలుంటాయి. పవర్ డూవథ్లాన్‌లో పాల్గొనాలంటే ఒక్క హాఫ్ మారథాన్‌నైనా విజయవంతంగా పూర్తిచేసి ఉండాలి. మిగతా ఈవెంట్లలో ఎవరైనా
పాల్గొనచ్చు. ఫినిషర్లకు మెడల్, సర్టిఫికెట్‌లను జీహెచ్‌ఏసీ ప్రదానం చేస్తుంది.
- వాంకె శ్రీనివాస్