
అష్మిత్ రెడ్డి, పవన్ రెడ్డిలతో జెసి ప్రభాకర రెడ్డి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జెసి దివాకర రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకునే ఆలోచనలో ఉన్నారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని ఆయన ఎప్పటి నుంచో చెబుతున్నారు. దానికి తోడు ఇటీవల కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ, పార్టీపైన చేసి వ్యాక్యలతో ఆయన పార్టీకి దూరం కావలసిన పరిస్థితి ఏర్పడింది. తాను కాంగ్రెస్‌లో ఉండాలనుకుంటున్నా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాత్రం తనను పార్టీ నుంచి వెళ్లిపోవాలని పదే పదే అంటున్నారని దివాకర రెడ్డి చెప్పారు. అయితే తనకు పార్టీ నుంచి ఇంత వరకు ఎలాంటి షోకాజ్ నోటీసు అందలేదన్నారు. తమ కుమారుడు, సోదరుడు ఏ పార్టీలో చేరతారనేది వాళ్లిష్టమని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిస్థితులలో ఆయన సోదరుడు జెపి ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాక్యలను బట్టి జేసీ కుటుంబం పార్టీని వీడటం కాయంగా కనిపిస్తోంది. అంతే కాకుండా ఆ కుటుంబం నుంచి యువతరం రాజకీయ రంగప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉంది. జెసి సోదరులు ఇద్దరూ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని తమ ఇద్దరి కుమారులను రాజకీయాలలోకి దింపాలన్న ఆలోచనతో ఉన్నారు.
జేసీ దివాకర రెడ్డి చేసిన వ్యాక్యలపై ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చే అంశంపై పీసీసీ క్రమశిక్షణ సంఘం స్పందించింది. ఏఐసిసి సభ్యుడు అయినప్పటికీ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం పీసీసీకి ఉందని కమిటీ చైర్మన్ కంతేటి సత్యనారాయణ రాజు స్పష్టం చేశారు. అయితే జెసికి షోకాజ్ నోటీస్ మాత్రం ఇవ్వలేదని చెప్పారు. అయనకు నోటీస్ ఇచ్చే అంశం పరిశీలనలో ఉందని, ఆ ప్రక్రియం కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే కమిటీ ఓ దఫా సమావేశమైందని తెలిపారు. అయితే ఆ వివరాలు మీడియాకు వెల్లడించలేనని కంతేటి చెప్పారు.
ఈ నేపధ్యంలో జెసి ప్రభాకర రెడ్డి జూబ్లీహిల్స్‌లో ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు యువనాయకత్వం వైపు మొగ్గుచూపుతున్నందున త్వరలోనే తమ పిల్లలు రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు. దివాకర రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి, తన కుమారుడు అష్మిత్ రెడ్డిలను పక్కన కూర్చోబెట్టుకొని మరీ ఆయన ఈ విషయం ప్రకటించారు. తాము వివిధ పార్టీల నేతలను కలుస్తున్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలను ఆయన కొట్టివేశారు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడాలని తమపై ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే శ్రేయోభిలాషులు, కార్యకర్తల అభిష్టం మేరకు తాము ఏ పార్టీలో చేరేది త్వరలోనే నిర్ణయిస్థామని చెప్పారు. ఇక తమ పిల్లలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారన్నారు. తమ కుటుంబం సమైక్యాంద్రకే కట్టుబడి ఉన్నట్లు ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే, రాష్ట్రంలో సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నది ఒక్క వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని జేసీ దివాకర రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఆ పార్టీ వారు సమైక్యవాదనను చాలా బలంగానే వినిపిస్తున్నారని చెప్పారు. ఈ మాటలను బట్టి జెసి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడటం ఖాయమైన నేపధ్యంలో జెసి సోదరులతోపాటు జూనియర్ జెసి సోదరులు ఏ పార్టీలో చేరతారనేది ఇంకా స్పష్టంకాలేదు.
s.nagarjuna@sakshi.com