జస్టిస్ తమాంగ్ నేటి అవసరం | Justice Tamang needs of today | Sakshi
Sakshi News home page

జస్టిస్ తమాంగ్ నేటి అవసరం

Published Wed, Apr 15 2015 1:31 AM | Last Updated on Sun, Sep 3 2017 12:18 AM

జింబో

జింబో

 సందర్భం
 
 సెక్షన్ 176 1(ఎ)ని తలచుకున్నప్పుడల్లా న్యాయమూర్తి తమాంగ్ గుర్తుకొస్తారు. ఆయన సాహసం, ధైర్యం ఆశ్చర్యాన్ని గొల్పుతాయి. అతను మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌గా పనిచేసింది అహ్మదాబాద్‌లో. కాని ఆ రాష్ట్రానికి చెందిన వారు కాదు.
 
 ‘అర్థాలు మారిపోతాయి/ కాలక్రమంలో అర్థాలు మారి పోతాయి!/ నిఘంటువులు మార్చుకోక తప్పదు’ అన్నాడు ఓ తెలుగుకవి, ‘హాజిర్ హై’ అన్న కవితా సంపుటిలో. లాకప్‌డెత్‌లు, ఎన్‌కౌంటర్లను చూసి ఆ విధంగా అన్నాడు. ఇది 1986 ప్రాంతంలో రాసి న కవిత. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులలో ఎలాంటి మార్పూ లేదు.

 ‘మనుష్యులందరిలోనూ ఉన్నది ఒక్కటే రక్తమ న్నట్లు పోలీసులు చెప్పే కథల్లోనూ ఒకే రకమైన సృజనా త్మకత ఉంటుంది’ అంటుంది ఓ కథలో ఓ పాత్ర. ఆ కథలు ఎన్‌కౌంటర్ గురించి కావచ్చు, సరెండర్ గురిం చి కావచ్చు. ఆ కథలని ప్రజలు విశ్వసించినా, విశ్వ సించకున్నా పోలీసులకి ఎలాంటి బాధా లేదు. ఎందు కంటే ఎలాంటి జవాబుదారీతనం లేదు కాబట్టి.

 ఏదైనా అసహజ మరణం సంభవించినప్పుడు ఆ సమాచారం పోలీస్ అధికారికి తెలిసినప్పుడు ఆ మరణానికి గల కారణాలను ఆ అధికారి తెలుసుకోవలసి ఉంటుంది. ఆ మరణం ఆత్మహత్య వల్ల సంభవించి ఉండవచ్చు. ఏదైనా ప్రమాదం కావచ్చు. ఇలాంటి మర ణాల గురించి కారణాలు తెలుసుకోవడానికి పోలీస్ అధికారి రెండు రకాలైన చర్యలు చేపడతాడు. మొద టిది శవ పంచనామా. రెండు పోస్ట్‌మార్టమ్ పరీక్ష.

 అసహజ మరణ సమాచారం అందిన వెంటనే ఆ సమాచారాన్ని సంబంధిత ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌కు తెలియచేసి శవం ఉన్న ప్రదేశానికి వెళ్లి విచారించవలసిన బాధ్యత పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అధికారిపై ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉన్న ఇద్దరు గౌరవప్రదమైన వ్యక్తుల సమక్షంలో మరణానికి గల కారణాలను విచా రించి నివేదికను ఆ పోలీసు అధికారి తయారు చేయ వలసి ఉంటుంది.

 శవ పంచనామాలతో పాటు ఆ మరణానికి దారి తీసిన పరిస్థితులను గురించి కొన్ని సందర్భాలలో ఎగ్జి క్యూటివ్ మెజిస్ట్రేట్‌లు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 176 ప్రకారం విచారణ జరపాలి. ఈ నిబంధనకి 2005లో కొన్ని సవరణలు తెచ్చి సెక్షన్ 176  (1)ఎ ని కొత్తగా చేర్చారు. ఈ సవరణలు 23-06.2006 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ కొత్త నిబంధన ప్రకారం పోలీసుల అధీనంలో ఎవరైనా మరణించినా, కనిపించ కుండా పోయినా లేదా స్త్రీ మానభంగానికి గురైనప్పుడు పోలీసుల విచారణకి, దర్యాప్తుకి ఎగ్జిక్యూటివ్ మెజి స్ట్రేట్ విచారణకు అదనంగా సంబంధిత జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆ నేరానికి గల కారణాలను తెలుసుకోవ డానికి విధిగా విచారణ జరపవలసి ఉంటుంది. ఆ కేసు పరిస్థితులను బట్టి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సాక్ష్యాలను నమోదు చేయాలి. మరణించిన వ్యక్తుల బంధు వుల తల్లిదండ్రుల సమక్షంలో ఈ సాక్ష్యాలు నమోదు చేయాలి.

 సెక్షన్ 176 1(ఎ)ని తలచుకున్నప్పుడల్లా న్యాయ మూర్తి తమాంగ్ గుర్తుకొస్తారు. ఆయన సాహసం, ధైర్యం ఆశ్చర్యాన్ని గొల్పుతాయి. అతను మెట్రోపాలి టన్ మెజిస్ట్రేట్‌గా పనిచేసింది అహ్మదాబాద్‌లో. కాని ఆ రాష్ట్రానికి చెందిన వారు కాదు. గూర్ఖా వర్గానికి చెం దిన వ్యక్తి. ఇశ్రాత్ జహాన్‌తో పాటు నలుగురు వ్యక్తులు అహ్మదాబాద్ సమీపంలో ఎన్‌కౌంటర్‌లో చనిపోయా రు. అవి హత్యలని మానవ హక్కుల సంఘాలు ఘోషించాయి. వాటిపై విచారించి నివేదికను సమర్పిం చమని అహ్మదాబాద్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తమాంగ్‌ని ఆదేశించారు. శవ పరీక్ష నివేదికలను, ఫోరె న్సిక్, ప్రథమ సమాచార నివేదికలను పరిశీలించాడు. ఎన్నో సాక్ష్యాలు నమోదు చేశాడు. 243 పేజీల నివేది కని స్వదస్తూరితో రాసి, 7 సెప్టెంబర్, 2009న సమ ర్పించాడు. ఆ నలుగురు చనిపోయింది బూటకపు ఎన్‌కౌంటర్‌లోనని, ఆ ఎన్‌కౌంటర్‌కి 21 మంది పోలీస్ అధికారులు బాధ్యులని, ఐపీఎస్ అధికారి వంజర కూడా అందులో ఉన్నాడని నిర్ధారించాడు. న్యాయవ్య వస్థలో కిందిస్థానంలో ఉన్న ఒక మెజిస్ట్రేట్ ఆ రకంగా విచారణ జరపడం, ఇరవై అయిదు రోజుల్లో నివేదికను సమర్పించడం ఒక సంచలనం.

 అయితే సెక్షన్ 176 నిబంధన 23.06.2006 నుంచి అమలులోకి వచ్చింది. ఇది 2004లో జరిగిన సంఘటన. కాబట్టి తమాంగ్ నివేదికకు న్యాయబద్ధత లేదని సుప్రీంకోర్టు 12.08.2010 రోజున స్టేట్ ఆఫ్ గుజరాత్ - ఇతరులు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండి యా కేసులో స్పష్టం చేసింది. సెక్షన్ 176 1(ఎ) ప్రకా రం ఇలాంటి సందర్భాలలో విచారణ జరపవచ్చని అది నిజనిర్ధారణ విచారణ లాంటిదని కూడా స్పష్టం చేసిం ది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. అసా ధారణమైన పరిస్థితులు ఉండి సహేతుకమైన కారణాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ నివేదికతో రాష్ట్ర ప్రభుత్వాలు విభేదించవచ్చు. అయితే ఆ నిర్ణయాన్ని హైకోర్టులు రాజ్యాంగంలోని అధికరణ 226 ప్రకారం సమీక్షించి తగు ఉత్తర్వులు జారీ చేయవచ్చు.

 ఎన్‌కౌంటర్ల గురించి అనుమానాలు కలిగినప్పుడు న్యాయవిచారణను కోరుతున్నారు. అయితే సెక్షన్ 176 1(ఎ) ప్రకారం విచారణ జరపాలని సంబంధిత వ్యక్తులు డిమాండ్ చేయడంలేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో ఈ నిబంధన ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. తెలుగు రాష్ట్రాలలోనే కాదు భార తదేశంలోని చాలా రాష్ట్రాలలో న్యాయమూర్తి తమాంగ్ లాంటి మెజిస్ట్రేట్‌ల అవసరం ఎంతో ఉంది. క్రియా శీలక సుప్రీంకోర్టు హైకోర్టుతో పాటు క్రియాశీలక సబా ర్డినేట్ కోర్టుల ఆవశ్యకత ఈ దేశానికి మరెంతో ఉంది.

 తెలంగాణ రాష్ట్రంలో మానవహక్కుల సంఘం లేదు. దాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఏర్పాటు చేయడం ఎంత ముఖ్యమో అందులో క్రియా శీలక చైర్మన్‌ని, సభ్యులని ఎంపిక చేయడం ఇంకా ఎంతో అవసరం.
 తెలుగు ప్రజలకి రాష్ట్రాలు కొత్తవే గాని ఎన్ కౌంటర్‌ల కథనాలు మరీ పాతవి.

 (వ్యాసకర్త న్యాయనిపుణులు-ఫోన్: 27610182)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement