ఈల కాదది.. స్వరలీల
ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వాయువులో లీనమై సరిగమలను పలికిస్తాయి. మురళిని తలపించే ఆ స్వరఝరి ఆయన ఈలపాట. నిజానికి ఈల కాదది, శ్రోతలను మైమరపించే స్వరలీల. ఆయన అసలు పేరు కొమరవోలు శివప్రసాద్ అయినా, ‘ఈలపాట’ శివప్రసాద్‌గానే ప్రసిద్ధి పొందారు. చిన్ననాటి నుంచే సంగీతంపై మక్కువ పెంచుకున్న శివప్రసాద్, పంతొమ్మిదో ఏట శాస్త్రీయ సంగీతాభ్యాసం ప్రారంభించారు. కఠిన సాధనతో సప్తస్వరాలను ఈలతోనే మంద్ర, మధ్యమ, తారస్థాయిల్లో పలికించే పాటవాన్ని సొంతం చేసుకున్నారు.
కర్ణాటక, హిందుస్థానీ శాస్త్రీయ రాగాలను ఈలపాటలో అవలీలగా పలికించగలిగే శివప్రసాద్ నాలుగు దశాబ్దాలుగా వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి, ‘విజిల్ విజార్డ్’ (ఈలపాట మాంత్రికుడు)గా ప్రశంసలు పొందారు. శివప్రసాద్‌ను సంగీత దిగ్గజం బాలమురళి ‘గళమురళి’గా అభివర్ణిస్తే, సినారె ‘శ్వాసమురళి’గా ప్రశంసించారు. పద్నాలుగేళ్లుగా ఏటా న్యూ ఇయర్ సందర్భంగా క్రమం తప్పకుండా కచేరీ నిర్వహిస్తున్న శివప్రసాద్, గురువారం రవీంద్రభారతిలో కచేరీ చేశారు. ఈ సందర్భంగా ‘సిటీప్లస్’తో కొద్దిసేపు ముచ్చటించారు.
ఇక్కడే డిగ్రీ చదువుకున్నాను..
హైదరాబాద్‌తో నా బంధం ఈనాటిది కాదు. నేను 1979లో ఇక్కడకు వచ్చాను. ఇక్కడి రామచంద్ర కాలేజీలోనే డిగ్రీ చదువుకున్నాను. కాలేజీ రోజుల్లోనే ఇక్కడి కళాకారులతో పరిచయం ఏర్పడింది. ఈ నగరం నన్ను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని, ఆదరించింది. ఈ భాగ్యనగరమే నన్ను ‘గళమురళి’ స్థాయికి తీసుకు వెళ్లింది.
ఆ ముగ్గురు మహానుభావులు..
సంగీత దిగ్గజాలు బాలమురళీకృష్ణ, బిస్మిల్లాఖాన్, రేడియో విద్వాంసుడు డాక్టర్ ఎం.ఎస్.శ్రీనివాస్.. ఈ ముగ్గురు మహానుభావులు నన్ను ఆదరించి, ప్రోత్సహించి, నా ఉన్నతికి దోహదపడ్డారు. హైదరాబాద్‌లోనే ఈ ముగ్గురు గురువుల పరిచయం లభించడం నా అదృష్టం. బిస్మిల్లాఖాన్ ఇక్కడకు వచ్చినప్పుడు నాంపల్లిలోని సాదాసీదా హోటల్‌లో దిగేవారు. తన వెంట నన్ను ఆయన స్వస్థలం వారణాసి సహా పలు ప్రాంతాలకు తీసుకు వెళ్లారు. నా ప్రస్థానంలో అప్పటి సాంస్కృతిక శాఖ అధికారులు కె.వి.రమణాచారి, కిషన్‌రావులు చాలా తోడ్పాటు అందించారు.
యువతకు కళలు అవసరం..
నేటి యువత అనేక ఒత్తిళ్లతో యాంత్రిక జీవితంలో మగ్గిపోతున్నారు. ఒత్తిడిని దూరం చేసేందుకు కొందరు యోగ, ధ్యానం వైపు మళ్లుతున్నారు. యోగాకు సంగీతాన్ని జోడించి ఇటీవల నేను ఈలపాట సీడీ తీసుకు వచ్చాను. ధ్యానం చేసుకునే వారికి సంగీతం ప్రశాంతతను ఇస్తుంది. ప్రస్తుతం నా వద్ద స్థానిక విద్యార్థులతో పాటు విదేశీ విద్యార్థులు కూడా ఈలపాట నేర్చుకుంటున్నారు. ఒత్తిళ్లను అధిగమించేందుకు కళలు చాలా ఉపకరిస్తాయి. లలిత కళలను సాధన చేయడం యువతకు ఎంతైనా అవసరం.
- కోన సుధాకర్‌రెడ్డి