కుచ్ మీఠీ బాత్
వీలైతే నాలుగు మాటలకు.. కుదిరితే కప్పు కాఫీకి మధ్యలో.. ఇచ్చిపుచ్చుకునే ఇదొకటి ఉంది. పరిచయాలు పెంచే అమోఘమైన ప్రేమ గుళిక అది. తొలిచూపులో పుట్టి.. కొంటె చూపులతో కనెక్టై.. ముసిముసి నవ్వుల తో ముడిపడే.. అందమైన ఫీలింగ్‌ను తర్వాతి మెట్టుకు తోసే మహత్తర మార్గం ఏదైనా ఉందంటే అది చాక్లెట్ల రాయబారమే. ప్రేమలో ఎంత కమిట్‌మెంట్ ఉందో చాటడానికి చాక్లెట్లే కొలమానం. ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో చెప్పడానికి ప్రేమపక్షులు వీటినే ఇచ్చిపుచ్చుకుంటుంటాయి. అందుకే వాలెంటైన్స్ వీక్‌లో మూడో రోజు చాక్లెట్లు ప్లేస్ కొట్టేశాయి.
ప్రేమ ఎంతో మధురమో.. ప్రియురాలూ అంతే మధురంగా ఉండాలని.. ప్రేమికుడు చాక్లెట్ ఆఫర్ చేస్తాడు. చాక్లెట్ అంటే చిన్ని చిన్ని ఆశ చాక్లెట్ కాదు.. ఓపిగ్గా తింటే.. ఎంత లేదన్నా మినిమమ్ ఓ గంటైనా పట్టే చాక్లెట్. ప్రేమతో ఇచ్చిన చాక్లెట్ రుచిని ఆస్వాదించిన తర్వాత.. సదరు ప్రేయసి మనసు మాటున దాగున్న మాటల మూటలు.. తీపి కబుర్లుగా మారిపోతాయి. ఈ చాక్లెట్ల పంపకాలు రోజులకు రోజులు అలా సాగిపోతూనే ఉంటాయి. వీరిద్దరి మధ్య అనుబంధం కూడా రోజుకింత దృఢంగా మారిపోతుంది.
3డీ ఇంప్రెస్
200 ఏళ్ల కిందటే ప్రేమికులు చాక్లెట్ల వాయనం మొదలు పెట్టారు. ఈ ట్రెండ్ ముదిరిపాకాన పడ్డాక.. రకరకాల చాక్లెట్లు మార్కెట్‌లోకి వచ్చి చేరుతున్నాయి. చాక్లెట్ల మీద మెసేజ్‌లు చేర్చి మరీ ఒకరికొకరూ ప్రేమగా ఇచ్చుకుంటున్నారు. చాకో తాజ్‌మహల్‌ను తయారు చేసి.. ప్రేయసిని ఇంప్రెస్ చేయడానికి తెగ ఆరాటపడుతున్నారు. ఇలా డిఫరెంట్ థీమ్స్‌తో వస్తున్న చాక్లెట్లు.. ఇద్దరి మధ్య ప్రేమ చప్పున పుట్టేట్టు చేస్తున్నాయి. చాక్లెట్లే కాదు.. ఎదుటివారిని ఇంప్రెస్ చేసేలా ప్రేమను వ్యక్తపరచడానికి చాక్లెట్ బొకేలు కూడా వచ్చేశాయి. ప్రేయసి ఫొటోను, అది పొందుపరిచే ఫ్రేమ్‌ని.. 3డీ ప్రింటింగ్ సహాయంతో చాక్లెట్‌తోనే రూపొందించి.. గిఫ్ట్‌గా ఇచ్చి ఆమె మనసును గెలుచుకుంటున్నారు.
.
.:: శిరీష చల్లపల్లి