
లక్కీ కుమారి
గిరిజా కుమారి.. స్క్రీన్‌పై నాజూకుగా కనిపించే ఈ అమ్మాయి మాంచి ఫుడీ! సిటీలోని మాస్ థియేటర్స్‌లో సినిమా చూడటంలో కిక్కు ఉందంటోన్న ఈ క్యూట్‌గాళ్... యాంకర్ కాకపోయి ఉంటే.. లెక్చరర్ అయి ఉండేదాన్నని చెబుతోంది! లక్కీ లక్ష్మిలా ప్రేక్షకులను పలకరిస్తున్న కుమారి అలియాస్ సీరియల్ సీతా మాలక్ష్మి పరిచయం..
..:: శిరీష చల్లపల్లి
నేను పుట్టింది విజయవాడలో. నైన్త్ వరకు అక్కడే చదివాను. డాడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. సిటీకి బదిలీ కావడంతో టెన్త్‌కి ఇక్కడికి వచ్చేశాం. అమ్మ హోం మేకర్. నేను డిగ్రీ చదివేటప్పుడు ఏదో ప్రోగ్రాం ఆడిషన్స్‌కి ఓ ఛానల్ వాళ్లు వచ్చారు. అక్కడ యాక్టివ్‌గా ఉండి, అనర్గళంగా మాట్లాడుతున్న నన్ను చూసి యాంకరింగ్ చేయమని అడిగారు. తరువాత మా పేరెంట్స్‌తో మాట్లాడి జెమిని టీవీలో ఓ లైవ్‌షోకి సెలక్ట్ చేశారు. వెంటనే చకచకా నాలుగు ప్రోగ్రామ్స్‌కి యాంకరింగ్ అవకాశం వచ్చింది. వితిన్ వన్ వీక్‌లో నా స్టార్ తిరిగిపోయింది.
బుల్లి తెరకే పరిమితం...
లైవ్ షోస్, సీరియల్స్, రియాలిటీ షోస్... ఇలా రకరకాల ప్రోగ్రామ్స్‌కి, సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్‌కి యాంకరింగ్ ఆఫర్స్ వచ్చాయి. మా టీవీలో ‘సీరియల్ సీతా మాలక్ష్మి’ ప్రోగ్రామ్ యాంకరింగ్‌కి అవకాశం వచ్చింది. అందులో నేను రోజుకో సీరియల్‌లోని పాత్ర పోషిస్తూ ఆ సీరియల్ గురించి మాట్లాడాలి. ఆ ప్రోగ్రామ్‌తో నా దశ తిరిగింది. అప్పటినుంచి నన్ను బయట ఎవరైనా చూస్తే కుమారి అనరు. సీరియల్ సీతా మాలక్ష్మి అనే పిలుస్తారు. సీరియల్స్, సినిమాల్లో అవకాశాలొచ్చాయి. సినిమాలకు వెళ్లలేదు. బుల్లితెరకే పరిమితమయ్యాను. ప్రస్తుతం ఏబీఎన్‌లో ‘లక్కీ లక్ష్మి.. లవ్లీ శారీ’ ప్రోగ్రాం చేస్తున్నా.
వాగుడుకాయను కాదు..
హైదరాబాద్‌తో అటాచ్‌మెంట్ ఎక్కువ నాకు. ముఖ్యంగా సిటీలో థియేటర్స్ అంటే బాగా ఇష్టం. ఎంత పరపతి ఉన్నా... ఒక పెద్ద సినిమా హీరో రిలీజ్ అయ్యిందంటే... మాస్ థియేటర్‌కి వెళ్లి ఫస్ట్ షో చూసి ఈలలు వేస్తూ, పేపర్లు చించి ఎగరేసి, గోల చేయడాన్ని తెగ ఎంజాయ్ చేస్తాను. ఆఫ్కోర్స్ నేనూ అంతే! అయితే స్క్రీన్ మీద కనిపించినంత వాగుడుకాయనేంకాదు. నేనో పెద్ద ఫుడీని. బాగా తింటాను. మా ఊరి వంటకు యాంకరింగ్ చేస్తూ... నచ్చిన వంటలను లాగించేస్తాను.
బాగా నచ్చితే ఇంటికెళ్లి ప్రయోగాలు కూడా చేస్తాను. వాటికి మన హైదరాబాదీ ఫ్లేవర్స్ యాడ్ చేసి ఫ్యూజన్ వంటకాలు వండుకుని తినేస్తాను. షాపింగ్ అంటే... అన్ని షాపింగ్ ప్లేసెస్ ఇష్టమే. ఒక డ్రెస్ కొన్న షాప్‌లో మళ్లీ కొనను. అయితే బట్టలపై ఎక్కువ ఎక్స్‌పెండ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. రీజనబుల్‌గా ఉన్నవే కొనడానికి ఇష్టపడతాను. ఒకవేళ నేను యాంకర్‌గా స్క్రీన్ మీద కనపడకపోయి ఉంటే... లెక్చరర్ అయి ఉండేదాన్నేమో.