మహబూబ్ కళాశాల | mahaboob college | Sakshi
Sakshi News home page

మహబూబ్ కళాశాల

Published Wed, Mar 25 2015 11:58 PM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM

మహబూబ్ కళాశాల - Sakshi

మహబూబ్ కళాశాల

ఎందరో ప్రముఖులు, మేధావులను దేశానికి అందించిన విద్యా సంస్థ మహబూబ్ కళాశాల. రాష్ర్టపతి రోడ్డు, సరోజనీదేవి రోడ్లను కలుపుతూ, సుమారు ఏడున్నర ఎకరాల సువిశాల విస్తీర్ణంలో కొలువుదీరిన ఈ కళాశాల... 150 ఏళ్లు పైబడిన వారసత్వపు కట్టడంగా అలరారుతోంది.
 
నిజాం ప్రభువుల కాలంలో ఆంగ్లేయులు సికింద్రాబాద్ ప్రాంతంలో ఉంటూ పలు విద్యాసంస్థల ఏర్పాటుతో పాటు ఈ ప్రాంతంలో విద్యా రంగ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఆనాడు అధిక శాతం యువత ఉర్దూ, పార్శీ భాషలు అయిష్టంగానైనా అభ్యసించాల్సి వచ్చేది. బాలికలకు విద్యాగంధం సోకడం బహు దుర్లభంగా ఉండేది. అలాంటి రోజుల్లో బ్రిటిష్ వారు యువతకు, ముఖ్యంగా బాలికల విద్యను ఎంతగానో ప్రోత్సహించారు. అలాగే నాటి సమాజంలో అత్యంత ఆధునిక విద్యా సౌకర్యాలు కల్పించారు. బ్రిటిష్ సైనికుల పిల్లల కోసం సెయింట్‌ఆన్స్ పాఠశాల, సెయింట్‌ఆన్స్ కాన్వెంటు ఏర్పాటు చేశారు. అయితే, రెజిమెంటల్ బజార్, జేమ్స్ స్ట్రీట్, కళాసిగూడ ప్రాంతాల్లో ఆంగ్లేయేతరులు అధిక శాతం నివసించేవారు.

వీరికి తగిన విద్యా సంస్థలు, విద్యావకాశాలు ఉండేవి కావు. కంటోన్మెంట్‌కు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్‌గా ఉన్న పి.సోమసుందరం ముదలియార్, బ్రిటిష్ అధికారుల సహాయం తీసుకుని, 1862లో ఆంగ్లో వెర్నాక్యులర్ స్కూలును సికింద్రాబాద్‌లో ప్రారంభించారు. ఈ స్కూలులో ఇంగ్లిష్, తెలుగు, తమిళ భాషలు బోధించేవారు. నామమాత్రపు ఫీజులు వసూలు చేస్తుండటంతో నిధులు కొరత ఉండేది. అయితే స్థానికుల సహాయంతో స్కూలు నిర్వహణ విజయవంతంగా కొనసాగింది. ఆ దరిమలా ఆరో నిజాం ప్రభువు మీర్ మహబూబ్ అలీఖాన్ కావల్సిన నిధులు సమకూర్చడంతో పాటు ఏటా పాఠశాల నిర్వహణకు గ్రాంటు మంజూరు చేశారు.

దీంతో నిజాం ప్రభువు పేరిట పాఠశాల పేరును మహబూబియా పాఠశాలగా మార్చారు. క్రమేపీ ఈ పాఠశాల కళాశాల స్థాయికి ఎదిగింది. ఈ విద్యా సంస్థ స్థాపించి ఒకటిన్నర శతాబ్థం పూర్తయింది. ఈ కళాశాలలో ప్రముఖ సంఘ సేవకులు రఘుపతి వెంకటరత్నం నాయుడు, మాడపాటి హనుమంతరావు తదితరులు ప్రిన్సిపాల్స్‌గా పనిచేశారు. స్వామి వివేకానంద అమెరికాలోని చికాగో సర్వమత సమ్మేళనానికి వెళ్లేముందు, స్థానిక ప్రజలనుద్దేశించి మహబూబ్ కళాశాల ప్రాంగణం నుంచే (1893- ఫిబ్రవరి 13) ప్రసంగించారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, రవీంద్రనాథ్ ఠాగూర్... ఇలా ఎందరో ఈ కళాశాలను సందర్శించారు. స్థానికులనుద్దేశించి ప్రసంగించారు. నేడు మహబూబ్ కళాశాల అత్యంత ఆధునిక ఉన్నత విద్యావకాశాలు స్థానికులెందరికో అందజేస్తోంది.
 మల్లాది కృష్ణానంద్, malladisukku@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement