మౌలిక విద్యకు మూలపురుషుడు
జాతీయ ప్రయోజనాలను కాపాడే కీలక సాధనం విద్య మాత్రమే... విద్య యజమాని... రాజకీయం సేవిక మాత్రమే అని ఘంటాపథంగా చెప్పిన విద్యావేత్త ఆయన. మౌలిక విద్యకు మూలపురుషుడిగా విఖ్యాతి పొందిన డాక్టర్ జాకీర్ హుస్సేన్ మన దేశానికి మూడో రాష్ట్రపతి. రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి ముస్లిం జాకీర్ హుస్సేన్ కావడం విశేషం. జాకీర్ హుస్సేన్ 1897 ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో జన్మించారు. జాకీర్ హుస్సేన్ పదేళ్ల ప్రాయంలోనే ఆయన తండ్రి ఫిదా హుస్సేన్ ఖాన్ అకాల మరణం చెందారు. మరో నాలుగేళ్లకే తల్లి నాజ్నీన్ బేగం కన్నుమూశారు. జాకీర్ హుస్సేన్ బాల్యంలోనే ఆయన కుటుంబం ఉత్తరప్రదేశ్‌కు వలసపోయింది.
హైదరాబాదీ
జాకీర్ హుస్సేన్
ఇటావాలోని ఇస్లామియా హైస్కూల్‌లో జాకీర్ హుస్సేన్ ప్రాథమిక విద్య సాగింది. ఆ తర్వాత అలీగఢ్‌లోని ఆంగ్లో-మహమ్మదన్ ఓరియంటల్ కాలేజీలో (ప్రస్తుతం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ) డిగ్రీ పూర్తి చేశారు. ఉన్నత విద్య కోసం జర్మనీ వెళ్లి, బెర్లిన్ వర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో డాక్టరేట్ చేశారు. విద్యారంగంపై యువకుడిగా ఉన్నప్పటి నుంచే అమితమైన ఆసక్తి, తపన గల జాకీర్ హుస్సేన్, తన 23వ ఏటనే విశ్వవిద్యాలయ స్థాపనకు నడుం బిగించారు. నేషనల్ ముస్లిం వర్సిటీ పేరిట దీనిని తొలుత అలీగఢ్‌లో 1920 ఫిబ్రవరి 29న ప్రారంభించారు. ఐదేళ్ల తర్వాత దీనిని ఢిల్లీలోని కరోల్‌బాగ్ ప్రాంతానికి, మరో పదేళ్లకు అక్కడి నుంచి ఢిల్లీలోనే జామియా నగర్ ప్రాంతానికి తరలించారు. అప్పటి నుంచి ఇది జామియా మిలియా ఇస్లామియాగా మారింది. జామియా మిలియా ఇస్లామియా మూతబడే పరిస్థితుల్లో, దాని పునరుద్ధరణ కోసం జాకీర్ హుస్సేన్ జర్మనీ నుంచి భారత్ వచ్చి, ఆ వర్సిటీ వైస్‌చాన్‌సలర్‌గా బాధ్యతలు చేపట్టారు. రెండు దశాబ్దాలకుపైగా ఆ పదవిలో కొనసాగి, జామియా మిలియా ఇస్లామియా పురోగతికి దోహదపడ్డారు.
నిరంతర సంస్కరణాభిలాషి
స్వాతంత్య్రోద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో జాకీర్ హుస్సేన్ ఆనాటి ఉద్యమ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించేవారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా తన నేతృత్వంలోని జామియా మిలియా ఇస్లామియాలో విలువలతో కూడిన విద్యకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. మరోవైపు తాను చదువుకున్న ఆంగ్లో మహమ్మదన్ ఓరియంటల్ కాలేజీ వ్యవహారాల్లోనూ క్రియాశీలంగా వ్యవహరించేవారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక, అలీగఢ్ ముస్లిం వర్సిటీ వైస్‌చాన్‌సలర్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఎనిమిదేళ్లు ఈ పదవిలో కొనసాగాక 1956లో పదవీ విరమణ చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా అప్పటి ప్రభుత్వం ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. ఏడాది తర్వాత బీహార్ గవర్నర్‌గా నియమించింది. ఐదేళ్లు ఆ పదవిలో కొనసాగాక, 1962లో ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. మరో ఐదేళ్లకు 1967 మే 13న రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా తన తొలి ప్రసంగంలోనే ‘యావత్ భారతదేశమే నా ఇల్లు. దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులు’ అని ప్రకటించి, దేశ ప్రజలను ఆకట్టుకున్నారు. అయితే, పదవి చేపట్టిన రెండేళ్లకే 1969 మే 3న జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. పదవిలో ఉండగా అస్తమించిన తొలి రాష్ట్రపతి ఆయనే.
జాకీర్ సోదరులకూ భాగ్యనగరంతో బంధం
జాకీర్ హుస్సేన్‌కు ఆరుగురు సోదరులు. వారిలో ముజఫర్ హుస్సేన్ హైదరాబాద్‌లోనే న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. అయితే, క్షయవ్యాధితో 28 ఏళ్ల వయసులోనే అకాల మరణం చెందారు. మరో సోదరుడు డాక్టర్ యూసఫ్ హుస్సేన్ ఖాన్ ఉస్మానియా వర్సిటీలో ఉర్దూ ప్రొఫెసర్‌గా చాలాకాలం పనిచేశారు. ఆ తర్వాత అలీగఢ్ ముస్లిం వర్సిటీ ప్రో చాన్‌సలర్‌గా పనిచేశారు. విద్యావేత్త అయిన జాకీర్ హుస్సేన్‌కు సాహిత్యంపై అమితాసక్తి ఉండేది. గాలిబ్ కవితా సంకలనాన్ని వెలుగులోకి తెచ్చిన ఘనత ఆయనదే.