కౌగిలింతలోని మహత్యం
నేడు హగ్ డే
ఎవరైనా ఎదురు పడినప్పుడు పలకరింపు... కలత చెందిన మనసుకు ఓదార్పు... ప్రేమ వెల్లువలా పొంగినప్పుడు పులకరింపు... వీటిన్నిటినీ ప్రదర్శించడానికి పెద్ద నేర్పు అవసరం లేదు. మనసు మూగబోయినప్పుడు, మాటలు కరువైనప్పుడు కంగారు పడాల్సిన పని అంతకన్నా లేదు. మెల్లగా వెళ్లి మెత్తగా హత్తుకుంటే చాలు... ఆ స్పర్శ మీ మనసులో ఏముందో వారికి చెప్పేస్తుంది. మీ భావాలను వారి మనసుకు పదిలంగా చేరుస్తుంది. అదే కౌగిలింతలోని మహత్యం!
ప్రేమంటే శరీర స్పర్శ కాదు అంటారు. అవును నిజమే. ప్రేమ మనసుకు సంబంధించినది. దానికి స్పర్శతో సంబంధం లేదు. అయితే ప్రేమను వ్యక్త పరిచే ప్రక్రియలో స్పర్శ కూడా భాగమే. అది మాత్రం కాదనలేని వాస్తవం. బాధ కలిగినప్పుడు ఎవరైనా దగ్గరకు తీసుకుని ఓదారిస్తే బాగుణ్ను అనిపిస్తుంది. ఆనందం కలిగినప్పుడు అయినవారిని అల్లుకుపోవాలని అనిపిస్తుంది. తన చేతుల్ని మన చేతుల్లోకి తీసుకుని మాట్లాడటంలో ఆనందం ఉంటుంది. భుజాలపై చేతులు వేసి నడవడంలో సంతోషం ఉంటుంది. ఒక్కో స్పర్శలో ఒక్కో అనుభూతి ఉంటుంది. అన్ని అనుభూతులనూ అందించేందుకు ఓ సుతిమెత్తని కౌగిలింత పనికొస్తుంది.
తనువుల దగ్గరతనం మనసుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. అమ్మ కౌగిట్లో అనురాగం ఉంటుంది. నాన్న కౌగిలిలో ధైర్యం ఉంటుంది. ప్రేమికుని కౌగిలిలో ప్రేమతో కూడిన భరోసా ఉంటుంది. అది అనుభవంలోనే తెలుస్తుంది. ఆ అనుభవం ప్రేమ మీద గౌరవాన్ని పెంచుతుంది. అవతలి వ్యక్తి మన మనిషి అన్న నమ్మకాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ ‘హగ్ డే’ని మీ అనుబంధాన్ని బలపర్చుకోవడానికి ఉపయోగించుకోండి. మీరు ప్రేమించిన వ్యక్తిని దగ్గరకు తీసుకుని, మీరిద్దరూ ఒక్కటేనన్న విషయాన్ని తన మనసులో పాతుకుపోయేలా చేయండి. తనను మీ గుండెలకు హత్తుకుని... చివరి శ్వాస వరకూ ఆ గుండెల్లో ఉండేది తనేనని బాస చేసుకోండి. ఇక మీ ప్రేమయాత్రలో ప్రతి మజిలీ ఓ మధురానుభవంగా మిగిలిపోతుంది చూడండి!
కౌగిలి భాష: ఎవరి మీద చూపించే ప్రేమ అయినా ఒకటే. అయితే ఎవరినైనా కౌగిలించుకునే విధానం మాత్రం ఒకటి కాదు. కౌగిలికి ఓ భాష ఉంది. ఒక్కొక్కరికి కౌగిలించుకోవడానికి ఒక్కొక్క విధానం ఉంది.
మీ పిల్లలనో లేక మీ తల్లిదండ్రులనో కౌగిలించుకునేటప్పుడు.. వారిని దగ్గరకు తీసుకుని, వీపు మీద రెండు చేతులూ వేసి హత్తుకుంటారు.
పలకరింపుగా హత్తుకున్నప్పుడు రెండు చేతులూ భుజాల మీద వేసి, దగ్గరకు తీసుకున్నట్టే తీసుకుని చప్పున వదిలేస్తారు. ఇది క్షణంపాటు ఉంటుందంతే.
కృతజ్ఞత తెలిపే కౌగిలింతకు ఒక చెయ్యే ఉపయోగిస్తారు. చేతిని భుజం చుట్టూ వేసి, దగ్గరకు తీసుకుని చెంపకు చెంపను రాసి వదిలేస్తారు.
ఎవరైనా బాధపడుతున్నప్పుడు ఓదార్పుగా దగ్గరకు తీసుకుంటే... ఒక చెయ్యి వారి భుజమ్మీద, మరో చెయ్యి వారి తలమీద ఉంటుంది. తల నిమిరితే అవతలివారు ఎంత ఓదార్పు పొందుతారో తెలిసిందే కదా!
ప్రేమికుల కౌగిలింతలో... చేతులు నడుము మీద గానీ, మెడ చుట్టూగానీ ఉంటాయి. సాధారణంగా అమ్మాయిలు అబ్బాయి మెడ చుట్టూ వేస్తారు. అబ్బాయిలైతే ఆమె నడుము చుట్టూ చేతులు వేసి బంధిస్తారు.
భార్యాభర్తల కౌగిలింతలో మరింత దగ్గరతనం ఉంటుంది. ఒక చేయి మెడ చుట్టూ, మరొక చేయి నడుము చుట్టూ వేసి, గాలి చొరబడనట్టుగా కౌగిలించుకుంటారు. మన మధ్యకు ఎవరూ రాలేరు అని చెబుతున్నట్టుగా ఉంటుంది ఈ భంగిమ.
- సమీర నేలపూడి
కౌగిలింతకు ఎంత శక్తి ఉందంటే... అది ఎంత బాధనైనా తగ్గిస్తుందని వైద్యులు చెబుతుంటారు. అందుకే 2004లో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి ‘ఫ్రీ హగ్ క్యాంపెయిన్’ని ప్రారంభించాడు. కొందరు వాలెంటీర్లు పబ్లిక్ ప్లేసుల్లో నిలబడతారు. ఓదార్పు కోరుకునేవారు ఎవరైనా వారి దగ్గరకు వెళ్తే హత్తుకుని ఓదారుస్తారు. ఇది విపరీతమైన ప్రజాదరణ పొందింది. నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది.