ప్రేమతో.. గులాబి | happy valentines day | Sakshi
Sakshi News home page

ప్రేమతో.. గులాబి

Published Sat, Feb 7 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM

ప్రేమతో.. గులాబి

ప్రేమతో.. గులాబి

ప్రేయసి చూపు గుండెల్లో గులాబీ ముల్లులా గుచ్చుకుంటుంది. ప్రేయసి నవ్వు.. గులాబీ గుబాళింపులా ఆహ్లాదంగా ఉంటుంది. ప్రేయసి అందం.. గులాబీ సోయగంలా మైమరిపిస్తుంది. ప్రేయసి స్పర్శ.. గులాబీ రేకులా సుతిమెత్తగా అనిపిస్తుంది. ప్రియురాలికి సంబంధించిన ప్రతి విషయంలోనూ గులాబీ ఎందుకు జొరబడుతుంది ?! ఎందుకంటే... ప్రేమ ఉన్నచోట గులాబీ ఉంటుంది. అది కూడా ఎర్రగులాబీ !! నగరంలోని నవయువ హృదయాలను ప్రేమమయం చేస్తున్న గులాబీల సందడికి మళ్లీ రెక్కలొచ్చాయి.
..:: సమీర నేలపూడి
 
వాలంటైన్స్‌డే వచ్చిందంటే చాలు, ఎర్ర గులాబీ ప్రేమను మోసుకెళ్లే పల్లకీగా మారుతుంది. ప్రేమికుడి హృదయాన్ని తీసుకెళ్లి ప్రేయసి చేతుల్లో భద్రంగా పెట్టే బాధ్యతను నెత్తినేసుకుంటుంది. ఇరు హృదయాల మధ్య రాయబారం నడుపుతుంది. చెలి చెక్కిళ్లలోని అరుణిమను నిలువెల్లా పరుచుకున్న ఆ పుష్పం.. ప్రేమికులకు ప్రత్యేకం. అందుకే ఎర్రగులాబీకి ప్రేమ సామ్రాజ్యంలో సుస్థిరమైన స్థానముంది. అది ప్రేమకు చిహ్నంగా నిలిచిపోయింది. చరిత్ర పుటల్లోకెక్కింది. ‘రోజ్ డే’ పేరిట తనకంటూ ‘వాలంటైన్ వీక్’లో తొలి రోజును తన పేర క్యాలెండర్లో పదిలపరచుకుంది.
 
ప్రేమ కథే నేపథ్యం...

తెలుపు, పసుపు, గులాబీ, నారింజ.. ఇలా రంగురంగుల గులాబీలు ఎన్నున్నా.. ఎర్ర గులాబీకి ఉండే హోదానే వేరు. ఈ పుష్పరాజం కొన్ని శతాబ్దాలుగా ప్రేమికుల ప్రియనేస్తంగా వెలుగుతోంది. నిజానికి ఎర్ర గులాబీకి ప్రేమ గుబాళింపు అద్దిన ఘనత... అందాలరాశి క్లియోపాత్రాది అంటారు చరిత్రకారులు. ఆంటోనీ మీద మనసు పడిన క్లియోపాత్రా, అతనిని చేరుకోవడం కోసం ఎర్రగులాబీలతో ఓ కార్పెట్‌ను తయారు చేయిస్తుంది. దానిలో తనను చుట్టి ఆంటోనీ దగ్గరకు తీసుకెళ్లమని చెలికత్తెలతో చెబుతుంది. వాళ్లు కార్పెట్‌ను తీసుకెళ్లి ఆంటోనీ ముందు పరిచినప్పుడు... ఎర్రగులాబీల మధ్య నుంచి దొర్లి ఆంటోనీ పాదాల వద్దకు చేరుతుంది. ఆ గులాబీలతో పోటీ పడే ఆమె కోమలత్వాన్ని, ముగ్ధ మనోహర రూపాన్నీ చూసి మైమరచిపోయిన ఆంటోనీ.. ఆమెకు తన హృదయంలో శాశ్వత స్థానాన్ని కల్పించాడు. నాటి నుంచీ ప్రేమతోను ప్రేమికులతోను ఎర్రగులాబీకి ముడిపడిందని చెబుతుంటారు. నేటికీ ప్రేమికుల చేతుల్లో ప్రేమకు గుర్తుగా ఇవి కనిపిస్తూ ఉండటమే అందుకు సాక్ష్యం.
 
రోజా రోజు..

తమ మనసులోని ప్రేమను వ్యక్తపరిచేందుకు సిద్ధమైన ప్రతి ఒక్కరూ మొదట వెతికేది ఎర్రగులాబీ కోసమే. ఇంత ప్రాముఖ్యం ఉంది కనుకనే.. రోజ్ డే అంటూ ఓ రోజును ఏర్పరిచారు. ఏటా ఫిబ్రవరి 7న రోజ్ డే జరుపుకుంటున్నారు. ఈ రోజు నుంచి.. ఫిబ్రవరి 14 (ప్రేమికుల రోజు) ముగిసే వరకు సిటీలో ఎర్రగులాబీల మీద లక్షల్లో వ్యాపారం జరుగుతుందంటే రెడ్ రోజెస్‌కు ప్రేమికులు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వాలెంటైన్స్‌డేకు కొన్ని రోజులు ముందుగానే ప్రతి రోజూ గులాబీలతో పలకరించడం వంటి రోజ్ హాబీస్ ఉన్న సిటీ యువత ప్రేయసి కోసం రోజుకో రోజాని పంపుతున్నారు. విడిపూలు అయితేనేమి, గుత్తుల రూపంలో అయితేనేమి.. ఎర్రగులాబీలు ప్రేమికుల చేతుల్లో ఒదిగిపోయి, వారు ప్రేమించిన వాళ్ల చేతుల్లోకి శరవేగంగా చేరిపోతున్నాయి. యుగాలు గడచినా, తరాలు మారినా.. తాము లేకపోతే ప్రేమ లేదని, ప్రేమికుల రోజే లేదని గర్వంగా చాటుతున్నాయి.
 
వారం రోజులు..

ఎన్ని రకాల గులాబీలు ఉన్నా ఎర్ర గులాబీ ప్రత్యేకతే వేరు. బెంగళూరు, పూణె ప్రాంతాల నుంచి తీసుకొస్తాం. వాలంటైన్ డే దగ్గర పడుతుందంటే రోజ్‌ల అమ్మకాలు బాగా పెరుగుతాయి. కొన్ని రోజుల ముందు నుంచే ఆర్డర్స్ వస్తుంటాయి. ఈ వారం రోజులు పండుగనే చెప్పాలి. ప్రేమికుల రోజు వెళ్లిపోయిన తర్వాత అమ్మకాలు షరామామూలే.
 - రమేశ్, పూల వ్యాపారి, మెహదీపట్నం
 
మీరు ఇచ్చే గులాబీల సంఖ్య... మీరు
చెప్పాలనుకున్న విషయాన్ని అవతలి వారికి తేలికగా చేరవేస్తుంది. ఎన్ని గులాబీలు ఇస్తే మనం ఏం చెబుతున్నట్టో ఓ లెక్క ఉందంటూ సిటీలోని పుష్పాలంకరణ నిపుణులు సరికొత్త సుమసూత్రాలు చెబుతున్నారు. వీటిని తెలుసుకునేందుకు సిటీ యువత ఆసక్తి చూపుతున్నారు.
 
వాటిలో కొన్ని...
1 గులాబీ ఇస్తే - తొలిచూపులోనే నిన్ను ప్రేమించాను
2 గులాబీలు - మనిద్దరి ఆలోచనలూ ఒకటే
3 గులాబీలు - నేను నిన్ను ప్రేమిస్తున్నాను
7 గులాబీలు - నీ ప్రేమలో పిచ్చివాణ్నవుతున్నాను
9 గులాబీలు - జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉందాం
10 గులాబీలు - నువ్వు నా సొంతం
12 గులాబీలు - నీకు జీవితాంతం తోడుంటాను
21 గులాబీలు - నేను నీకు కట్టుబడి ఉంటాను
100 గులాబీలు - నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టను
108 గులాబీలు - నన్ను పెళ్లి చేసుకుంటావా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement