హెరిటేజ్ హైదరాబాద్
గవర్నర్ ప్రెస్ సెక్రటరీ మల్లాది కృష్ణానంద్‌ను పర్యాటక అవార్డు వరించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బేగంపేటలోని పర్యాటక భవనంలో పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు చేతుల మీదుగా శనివారం ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణానంద్ ‘సిటీప్లస్’తో మాట్లాడారు. ఏటా వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి పర్యాటక శాఖ అవార్డులిచ్చి ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ‘హెరిటేజ్ హైదరాబాద్’ అనే ఆంగ్ల పుస్తకానికి గాను ఎక్సలెన్స్ ఇన్ రైటింగ్/పబ్లికేషన్ (ఇంగ్లిష్) విభాగం కింద ఆయనకు ఈ అవార్డు దక్కింది.
ఇందులో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని చారిత్రక, వారసత్వ సంపదను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ పుస్తకంలో నయాఖిల్లాలోని అరుదైన చెట్టు, సంతోష్‌నగర్‌లోని పైగా టూంబ్స్, మలక్‌పేట దగ్గర్లోని రేమండ్స్ సమాధి వంటి ఎన్నో చారిత్రక, వారసత్వ సంపదకు సంబంధించిన సమగ్ర వివరాలను పొందుపరిచారు. ఈ ఏడాది జనవరిలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ చేతుల మీదుగా విడుదలైన ఈ పుస్తకం రెండు నెలల్లోనే రీ ప్రింట్‌కు వెళ్లింది కూడా. ప్రస్తుతం విశాలాంధ్ర, నవోదయ వంటి పుస్తక కేంద్రాల్లో లభ్యమవుతోంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ కేవీ రమణాచారి, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీపీ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.