Tourism Award
-
ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు గెలుపొందిన కేరళ టూరిజం
కేరళ రాష్ట్రంలోని పర్యాటక శాఖకు ప్రత్యేకస్థానం ఉంది. సమష్టిగా పనిచేసి ఏకంగా ప్రపంచ అవార్డులు సొంతం చేసుకుంటుంది. అక్కడి ప్రజలు, ప్రభుత్వ విధానంలో మరింత స్ఫూర్తి నింపుతుంది. ఓ జీవన గమనంలో ఉండేంతటి ఆశయాలూ, సవాళ్లూ, అన్నింటికన్నా మానవీయ కోణాలూ, స్థానిక ప్రజల ఆర్థిక ప్రమాణాలు... వేలాది మంది సమష్టి కృషితో సాధించుకున్న కేరళ పర్యాటకు శాఖ ఆచరణీయం అవుతుంది. ఫలితంగా..రాష్ట్ర బాధ్యతాయుత టూరిజం మిషన్ ఆధ్వర్యంలో 2023 సంవత్సరానికిగాను కేరళ ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డు’ని కైవసం చేసుకుంది. నాటి భారతదేశం అంతటా అంటరానితనం ఉన్నా..కేరళలో ఆ దురాచారం మరీ ఎక్కువ. ఆ నేపథ్యంలోనే నారాయణగురు అనే ఆధ్యాత్మికవేత్త స్థానికంగా ఎన్నో సంఘసంస్కరణల్ని తీసుకొచ్చాడు. విద్యా సంస్థల్ని నెలకొల్పాడు. ఆయన ప్రభావంతో చైతన్యం పొందిన ఎందరో నేతలు అరవై ఏళ్ళలో అటు రాజకీయంగానూ, ఇటు సాంస్కృతికంగానూ కేరళ పునర్వికాసానికి కారణమయ్యారు. వాళ్ళే కాంగ్రెస్, కమ్యూనిస్ట్, సోషలిస్టు పార్టీల్లో చేరారు. పాలన ఎవరిదైనా సరే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారు. అందరికీ సమాన విద్యావకాశాలతో 1980 నాటికే 91 శాతం అక్షరాస్యతని సాధించారు. ఇవన్నీ బాగానే ఉన్నా..ఆర్థికాభివృద్ధిలో మాత్రం ఆ రాష్ట్రానిది వెనకంజే. ఓ వైపు ఎత్తైన కొండలూ దట్టమైన అడవులూ, మరోవైపు సముద్రం, మంచినీటి కాలువలు వీటి మధ్య ఖాళీ స్థలం చాలా తక్కువ కాబట్టి కేరళలో భారీ పరిశ్రమల నిర్మాణానికి అవకాశం లేకుండా పోయింది. సుగంధద్రవ్యాల ఎగుమతి, చేపలు పట్టడం, ఆ పరిశ్రమకి కావాల్సిన తాళ్ళు పేనడం..ప్రజల ఉపాధికి ఇవే శరణ్యమయ్యాయి. చదువుకున్న యువతీయువకులు ఇతర దేశాలకు వలస వెళ్ళడం పెరిగింది. 1980 నాటి కేరళ పరిస్థితి ఇది. దాన్ని మార్చి..ఆర్థిక అభివృద్ధిని సాధించాలనుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అందుకు వాళ్ళకి కనిపించిన ఏకైక అవకాశం పర్యటకం. నాటి నుంచి నేటి వరకు పర్యాటకం పరంగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. స్థానిక ప్రజలకు, ప్రత్యేకంగా మహిళలకు గణనీయమైన ప్రయోజనాలను సమకూరుస్తున్నారు. దానికితోడు ప్రకృతిని, తరాలుగా వస్తున్న వారసత్వ సంపదను పరిరక్షించడంలో సహాయపడుతున్నారు. ఫలితంగా ఎన్నో ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకుంటున్నారు. దాంతోపాటు ఆర్థికంగా పుంజుకుంటున్నారు. తాజాగా గెలుపొందిన గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డును రెస్పాన్సిబుల్ టూరిజం పార్టనర్షిప్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ టూరిజం (ఐసీఆర్టీ), బెస్ట్ ఫర్ లోకల్ సోర్సింగ్, ఫుడ్ అండ్ క్రాఫ్ట్ విభాగం సంయుక్తంగా ఏర్పాటు చేశారు. మహిళల నేతృత్వంలోని చిన్న, మధ్య తరహా సంస్థలను పర్యాటక కార్యకలాపాలకు అనుసంధానించారు. స్వదేశీ ఉత్పత్తులనే మార్కెటింగ్ చేశారు. అందుకు రాష్ట్ర మిషన్ సమ్మిళిత పర్యాటక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. దాంతో అత్యంత విలువైన అవార్డును సొంతం చేసుకున్నారు. కేరళ టూరిజం ద్వారా రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలు కింది విధంగా ఉన్నాయి. 2019లో ఆదాయం: రూ.45,010.69 కోట్లు(కరోనా ముందు) 2020లో ఆదాయం: రూ.11వేలకోట్లు 2021లో ఆదాయం: రూ.12285 కోట్లు 2022లో ఆదాయం: రూ.35168 కోట్లు రాష్ట్ర జీడీపీలో పర్యాటక రంగం: 10 శాతం 2019లో రాష్ట్రాన్ని సందర్శించిన పర్యాటకుల సంఖ్య: 1.83 కోట్లు 2019లో రాష్ట్రాన్ని సందర్శించిన విదేశీ పర్యాటకులు: 12లక్షల మంది 2019లో రాష్ట్ర విదేశీ మారకపు ఆదాయం: సుమారు రూ.10,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్ 2030’ ద్వారా మరింత ప్రోత్సహం అందిస్తుంది. ఈ మిషన్ ప్రకారం 2030 వరకు రాష్ట్ర జీడీపీలో టూరిజం వాటాను 12-20 శాతానికి పెంచాలని నిర్ణయించుకున్నారు. -
ఏపీకి పర్యాటక రంగంలో 2 అవార్డులు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగంలో రెండు అవార్డులను సొంతం చేసుకుందని రాష్ట్ర పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ తెలిపారు. టూరిజం ట్రావెల్ అసోసియేషన్ ఈ అవార్డులను ప్రకటించినట్లు పేర్కొన్నారు. బెస్ట్ టూరిజం పాలసీగా ఏపీ పాలసీకి అవార్డు దక్కిందని తెలిపారు. అదేవిధంగా బెస్ట్ టూరిజం ప్లేస్‌గా విశాఖపట్నం అవార్డు పొంతం చేసుకుందని పేర్కొన్నారు. -
రేపు పర్యాటక పురస్కారాల ప్రదానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి కృషిచేస్తున్న ఆ రంగ భాగస్వాములకు పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 27న టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డులను అందించనున్నట్లు పర్యాటక శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. 2021 సంవత్సరానికి సంబంధించి పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటించారు. వివిధ కేటగిరీలకు సంబంధించిది వెస్టిన్ హోటల్, పార్క్‌హయత్, గోల్కొండ రిసార్ట్స్, దస్పల్లా హోటల్, మృగవని రిసార్ట్స్ అండ్ స్పా, బెస్ట్ వెస్ట్రన్ అశోకా లక్డీకాపూల్, పామ్ ఎక్సోటికా రిసార్ట్, వైల్డ్ వాటర్స్, హైటెక్‌సిటీ ఓహ్రీస్ సాహిబ్ బార్బిక్, తారక రెస్టారెంట్ కరీంనగర్, ప్రశాంత్ హోటల్ మహబూబ్‌నగర్, నోవాటెల్, హెచ్ఐసీసీ కాంప్లెక్స్, రామోజీ ఫిల్మ్‌సిటీ.. బెస్ట్ ఫిల్స్‌కు సంబంధించి కె.రంగారావు, అడ్వెంచర్ క్లబ్, కథనాలకు సంబంధించి యాదగిరి, మహేశ్.. బెస్ట్ హరిత హోటళ్లలో తారామతి బారాదరి కల్చరల్ కాంప్లెక్స్, రామప్ప హరిత హోటల్, అలీసాగర్ హరిత లేక్‌వ్యూ రిసార్ట్స్, గరుడ టూరిజం టూర్ ఆపరేటర్లను పురస్కారాలకు ఎంపిక చేశారు. -
ఆంధ్రప్రదేశ్‌కు అవార్డుల పంట
సాక్షి, ఢిల్లీ: జాతీయ స్థాయిలో పర్యాటక రంగానికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు అవార్డుల పంట పండింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సాధించిన అభివృద్ధికి గానూ, ఈ ఏడాదికి ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవార్డు దక్కించుకుంది. ఇక బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ రైల్వేస్టేషన్‌గా విశాఖపట్నం అవార్డును కైవసం చేసుకుంది. అలాగే ఉత్తమ కాఫీటేబుల్ బుక్ కేటగిరీలోనూ ఏపీ ప్రథమ స్థానాన్ని అందుకుంది. తెలంగాణ పర్యాటక శాఖకు ఈ ఏడాది రెండు అవార్డులు దక్కాయి. సాంకేతికతను అత్యుత్తమంగా, వినూత్నంగా వినియోగించుకొనే రాష్ట్రంగా తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. టూరిస్టులకు పర్యాటక ప్రదేశాలకు సంబంధించి విస్తృత సమాచారం అందించడం కోసం పర్యాటక శాఖ రూపొందించిన 'ఐ ఎక్స్ప్లోర్ తెలంగాణ' అనే మొబైల్ యాప్‌కు ఈ అవార్డు దక్కింది. బెస్ట్ మెడికల్ టూరిజం విభాగంలో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి జాతీయ స్థాయి అవార్డు దక్కింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ అవార్డులను అందుకున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా 2017-18 సంవత్సరానికి సంబంధించి జాతీయ టూరిజం అవార్డులను ప్రకటించారు. అడ్వెంచర్ టూరిజం కేటగిరీలో గోవా, మధ్యప్రదేశ్ అవార్డులను పొందాయి. సినిమా ప్రమోషన్లకు ఉత్తమ స్నేహ పూర్వక రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఎంపికైంది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ గతంలో పర్యాటక రంగానికి ఆదరణ తక్కువని, ప్రస్తుతం భారత్‌లో పర్యాటకులకు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతున్నామన్నారు. -
పర్యావరణం, పర్యాటకంలో నం.1
సాక్షి, హైదరాబాద్: చరిత్రాత్మక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ఈ ఏడాది వరుసగా 3 ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్వచ్ఛ రైల్వేస్టేషన్లలో సికింద్రాబాద్ మొదటి స్థానంలో నిలవగా, అలాగే పర్యావరణ పరిరక్షణ, ఇంధన వనరుల సద్వినియోగంలో ప్రతిష్టాత్మక ఇండియన్ గ్రీన్‌బిల్డింగ్స్ సొసైటీ నుంచి ప్లాటినమ్ సర్టిఫికెట్ దక్కింది. తాజాగా జాతీయ పర్యాటక అవార్డును సొంతం చే సుకుంది. ప్రయాణికుల సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ప ర్యాటకులను ఆకట్టుకోవడంలోనూ సికింద్రాబాద్ దేశంలోని అన్ని రైల్వేస్టేషన్ల కంటే ముందంజలో నిలిచింది. నిత్యం సుమారు 210 రైళ్లు, లక్షా 80 వేల మందికి పైగా ప్రయాణికుల రాకపోకలతో దక్షిణమధ్య రైల్వేలో అతి ప్రధానమైన రైల్వేస్టేషన్‌గా నిలిచిన సికింద్రాబాద్.. ఇంధన వనరుల వినియోగంలోనూ గణనీయమైన పురోగతిని సాధించింది. పది ప్లాట్‌ఫామ్‌లు, 15 విశ్రాంతి గదులు, మరో రెండు విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేసిన లిఫ్టులు, ఎస్కలేటర్లు, తాగునీరు, టాయిలెట్లు తదితర సదుపాయాలతో నిత్యం లక్షన్నర మందికి పైగా ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలను అందిస్తున్న ఈ స్టేషన్ పర్యాటక ప్రియమైన స్టేషన్‌గా జాతీయ స్థాయి అవార్డును అందుకుంది. దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులకు ప్రయాణ సదుపాయానికి సికింద్రాబాద్ ఎంతో అనుకూలంగా ఉన్నట్లు జాతీయ పర్యాటక సంస్థ గుర్తించింది. -
రాష్ట్రానికి 8 జాతీయ పర్యాటక అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ : పలు విభాగాల్లో 2015–16 ఏడాదికి గాను రాష్ట్రానికి దక్కిన 8 జాతీయ పర్యాటక అవార్డులను ఢిల్లీలో బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అందజేశారు. పర్యాటక శాఖ కార్యదర్శి వెంకటేశం, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి, వరంగల్ మున్సిపల్ కమిషనర్ శ్రుతి ఓఝా, వరంగల్ మేయర్ నరేందర్ అవార్డులను అందుకున్నారు. అనంతరం వెంకటేశం మాట్లాడుతూ.. దేశంలో పర్యాటకానికి తెలంగాణను గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. -
హెరిటేజ్ హైదరాబాద్
గవర్నర్ ప్రెస్ సెక్రటరీ మల్లాది కృష్ణానంద్‌ను పర్యాటక అవార్డు వరించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా బేగంపేటలోని పర్యాటక భవనంలో పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు చేతుల మీదుగా శనివారం ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణానంద్ ‘సిటీప్లస్’తో మాట్లాడారు. ఏటా వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి పర్యాటక శాఖ అవార్డులిచ్చి ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ‘హెరిటేజ్ హైదరాబాద్’ అనే ఆంగ్ల పుస్తకానికి గాను ఎక్సలెన్స్ ఇన్ రైటింగ్/పబ్లికేషన్ (ఇంగ్లిష్) విభాగం కింద ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఇందులో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని చారిత్రక, వారసత్వ సంపదను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ పుస్తకంలో నయాఖిల్లాలోని అరుదైన చెట్టు, సంతోష్‌నగర్‌లోని పైగా టూంబ్స్, మలక్‌పేట దగ్గర్లోని రేమండ్స్ సమాధి వంటి ఎన్నో చారిత్రక, వారసత్వ సంపదకు సంబంధించిన సమగ్ర వివరాలను పొందుపరిచారు. ఈ ఏడాది జనవరిలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చేతుల మీదుగా విడుదలైన ఈ పుస్తకం రెండు నెలల్లోనే రీ ప్రింట్కు వెళ్లింది కూడా. ప్రస్తుతం విశాలాంధ్ర, నవోదయ వంటి పుస్తక కేంద్రాల్లో లభ్యమవుతోంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ కేవీ రమణాచారి, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీపీ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.