కేరళ రాష్ట్రంలోని పర్యాటక శాఖకు ప్రత్యేకస్థానం ఉంది. సమష్టిగా పనిచేసి ఏకంగా ప్రపంచ అవార్డులు సొంతం చేసుకుంటుంది. అక్కడి ప్రజలు, ప్రభుత్వ విధానంలో మరింత స్ఫూర్తి నింపుతుంది. ఓ జీవన గమనంలో ఉండేంతటి ఆశయాలూ, సవాళ్లూ, అన్నింటికన్నా మానవీయ కోణాలూ, స్థానిక ప్రజల ఆర్థిక ప్రమాణాలు... వేలాది మంది సమష్టి కృషితో సాధించుకున్న కేరళ పర్యాటకు శాఖ ఆచరణీయం అవుతుంది. ఫలితంగా..రాష్ట్ర బాధ్యతాయుత టూరిజం మిషన్ ఆధ్వర్యంలో 2023 సంవత్సరానికిగాను కేరళ ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డు’ని కైవసం చేసుకుంది.
నాటి భారతదేశం అంతటా అంటరానితనం ఉన్నా..కేరళలో ఆ దురాచారం మరీ ఎక్కువ. ఆ నేపథ్యంలోనే నారాయణగురు అనే ఆధ్యాత్మికవేత్త స్థానికంగా ఎన్నో సంఘసంస్కరణల్ని తీసుకొచ్చాడు. విద్యా సంస్థల్ని నెలకొల్పాడు. ఆయన ప్రభావంతో చైతన్యం పొందిన ఎందరో నేతలు అరవై ఏళ్ళలో అటు రాజకీయంగానూ, ఇటు సాంస్కృతికంగానూ కేరళ పునర్వికాసానికి కారణమయ్యారు. వాళ్ళే కాంగ్రెస్, కమ్యూనిస్ట్, సోషలిస్టు పార్టీల్లో చేరారు. పాలన ఎవరిదైనా సరే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారు. అందరికీ సమాన విద్యావకాశాలతో 1980 నాటికే 91 శాతం అక్షరాస్యతని సాధించారు. ఇవన్నీ బాగానే ఉన్నా..ఆర్థికాభివృద్ధిలో మాత్రం ఆ రాష్ట్రానిది వెనకంజే.
ఓ వైపు ఎత్తైన కొండలూ దట్టమైన అడవులూ, మరోవైపు సముద్రం, మంచినీటి కాలువలు వీటి మధ్య ఖాళీ స్థలం చాలా తక్కువ కాబట్టి కేరళలో భారీ పరిశ్రమల నిర్మాణానికి అవకాశం లేకుండా పోయింది. సుగంధద్రవ్యాల ఎగుమతి, చేపలు పట్టడం, ఆ పరిశ్రమకి కావాల్సిన తాళ్ళు పేనడం..ప్రజల ఉపాధికి ఇవే శరణ్యమయ్యాయి. చదువుకున్న యువతీయువకులు ఇతర దేశాలకు వలస వెళ్ళడం పెరిగింది. 1980 నాటి కేరళ పరిస్థితి ఇది. దాన్ని మార్చి..ఆర్థిక అభివృద్ధిని సాధించాలనుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అందుకు వాళ్ళకి కనిపించిన ఏకైక అవకాశం పర్యటకం.
నాటి నుంచి నేటి వరకు పర్యాటకం పరంగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. స్థానిక ప్రజలకు, ప్రత్యేకంగా మహిళలకు గణనీయమైన ప్రయోజనాలను సమకూరుస్తున్నారు. దానికితోడు ప్రకృతిని, తరాలుగా వస్తున్న వారసత్వ సంపదను పరిరక్షించడంలో సహాయపడుతున్నారు. ఫలితంగా ఎన్నో ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకుంటున్నారు. దాంతోపాటు ఆర్థికంగా పుంజుకుంటున్నారు.
తాజాగా గెలుపొందిన గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డును రెస్పాన్సిబుల్ టూరిజం పార్టనర్‌షిప్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ టూరిజం (ఐసీఆర్‌టీ), బెస్ట్ ఫర్ లోకల్ సోర్సింగ్, ఫుడ్ అండ్ క్రాఫ్ట్ విభాగం సంయుక్తంగా ఏర్పాటు చేశారు. మహిళల నేతృత్వంలోని చిన్న, మధ్య తరహా సంస్థలను పర్యాటక కార్యకలాపాలకు అనుసంధానించారు. స్వదేశీ ఉత్పత్తులనే మార్కెటింగ్ చేశారు. అందుకు రాష్ట్ర మిషన్ సమ్మిళిత పర్యాటక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. దాంతో అత్యంత విలువైన అవార్డును సొంతం చేసుకున్నారు. కేరళ టూరిజం ద్వారా రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలు కింది విధంగా ఉన్నాయి.
- 2019లో ఆదాయం: రూ.45,010.69 కోట్లు(కరోనా ముందు)
- 2020లో ఆదాయం: రూ.11వేలకోట్లు
- 2021లో ఆదాయం: రూ.12285 కోట్లు
- 2022లో ఆదాయం: రూ.35168 కోట్లు
- రాష్ట్ర జీడీపీలో పర్యాటక రంగం: 10 శాతం
- 2019లో రాష్ట్రాన్ని సందర్శించిన పర్యాటకుల సంఖ్య: 1.83 కోట్లు
- 2019లో రాష్ట్రాన్ని సందర్శించిన విదేశీ పర్యాటకులు: 12లక్షల మంది
- 2019లో రాష్ట్ర విదేశీ మారకపు ఆదాయం: సుమారు రూ.10,000 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్ 2030’ ద్వారా మరింత ప్రోత్సహం అందిస్తుంది. ఈ మిషన్ ప్రకారం 2030 వరకు రాష్ట్ర జీడీపీలో టూరిజం వాటాను 12-20 శాతానికి పెంచాలని నిర్ణయించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment