పట్టుమహిషులు
పట్టు గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమైనా, ఫ్యాషన్ ప్రపంచంలో పట్టుకు ప్రాధన్యం కల్పించడమైనా సరే.. ‘పట్టు’దలతోనే సాధ్యం అంటున్నారు ఈ మహిళలు. ‘శ్రీమతి సిల్క్‌మార్క్-2014’లో ర్యాంప్‌పై ఇటీవల మిలమిలలాడిన ఈ మిసెస్‌లు పట్టువస్త్రాలకు మళ్లీ మంచిరోజులు రావాలనే ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. భిన్న నేపథ్యాలకు చెందిన వారైనా ‘పట్టు’దల వీరిని ఒకే వేదికపైకి తెచ్చింది. పట్టు వస్త్రాలపై ఈ ‘పట్టు’మహిషుల మనోగతం వారి మాటల్లోనే...
పట్టుపై అవగాహన పెరగాలి..
పట్టు గురించి విద్యార్థుల్లోనే కాదు, ప్రజల్లోనూ అవగాహన పెరగాలి. పట్టు ప్రాధాన్యమేమిటో మహిళలకే బాగా తెలుసు. పట్టుపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు నా వంతు బాధ్యతగా ఈ ర్యాంప్‌వాక్‌లో పాల్గొన్నా. గత ఏడాది ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు పేరు నమోదు చేసుకున్నా, కానీ హాజరు కాలేకపోయాను. అప్పుడు ఇచ్చిన వివరాలను గుర్తుంచుకుని మరీ నిర్వాహకులు సమాచారం ఇవ్వడంతో ఈసారి పాల్గొనగలిగాను.
- స్వప్నప్రసాద్, టీచర్, వసంతనగర్, కూకట్‌పల్లి
పట్టు గొప్పదనం అర్థమైంది..
మాది రాజస్థాన్. రాజస్థాన్ సంప్రదాయ వస్త్రధారణలో చీరలకు ప్రాధాన్యం ఉండదు. ఇక్కడికొచ్చాక పట్టు గొప్పదనం అర్థమైంది. టీవీలో స్క్రోలింగ్ చూసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. కాలేజీ డేస్ ఇలాంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేదాన్ని. పెళ్లి తర్వాత హైదరాబాద్ వచ్చేశాక ఆ లైఫ్ మిస్సయ్యానన్న దిగులు ఉండేది. పెళ్లయిన వారు సైతం తమ టాలెంట్‌ను నిరూపించుకునేందుకు హైదరాబాద్‌లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండటం చాలా బాగుంది.
- శ్వేతాచౌదరి, పార్ట్‌టైమ్ ట్యూటర్, కొండాపూర్
పట్టుచీరలంటే చాలా ఇష్టం..
మా ఆయన అభిషేక్ హైకోర్టు అడ్వొకేట్. అమ్మాయి శ్రావ్య ఇంటర్ చదువుతోంది. నేను బడ్స్ అండ్ ఫ్లవర్స్ స్కూల్‌లో పనిచేస్తున్నాను. చివరి నిమిషంలో ఈ కార్యక్రమం గురించి తెలియడంతో స్కూలు నుంచి నేరుగా కార్యక్రమానికి వచ్చేశాను. మన
సంప్రదాయ వేడుకల్లో, పండుగల్లో పట్టువస్త్రాలకు చాలా ప్రాధాన్యం ఉంది. నాకు పట్టుచీరలంటే ఇష్టం.నా దగ్గర పట్టుచీరల కలెక్షన్ చాలానే ఉంది.
- సత్యవాణి, టీచర్, కమలాపురి కాలనీ
అవగాహన కార్యక్రమం ప్రశంసనీయం..
మా ఆయన ఫ్రాంక్లిన్ కంపెనీలో ట్రెజరర్. పెళ్లయి మూడున్నరేళ్లు అయింది. పెళ్లయ్యాక ఒక్కసారిగా బాధ్యతలన్నీ మీదపడతాయి. ఒతిళ్లు పెరుగుతాయి. అలాంటి ఒత్తిళ్ల నుంచి మహిళలకు రిఫ్రెష్‌మెంట్ కావాలి. అందులో అవేర్‌నెస్ కూడా ఉంటే మానసిక తృప్తి కూడా ఉంటుంది. టీవీలో స్క్రోలింగ్ చూసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. పట్టుపై అవగాహన కోసం ఈ కార్యక్రమం చేపట్టడం ప్రశంసనీయం.
- శ్రుతిలక్ష్మి, ‘రేడియో అర్చన’లో ఆపరేషన్స్ ఆఫీసర్, రామంతపూర్
మా ఆయన ప్రోత్సాహంతో వచ్చాను..
మా ఆయన హరీష్, డెలాయిట్‌లో ప్రాజెక్ట్ మేనేజర్. పద్నాలుగేళ్లుగా
హైదరాబాద్‌లో ఉంటున్నా. చిన్నప్పటి నుంచి చదువు కంటే ఎక్స్‌ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. స్కూల్, కాలేజీల్లో చదువుకునేటప్పుడు ప్రతి ఈవెంట్‌లోనూ పార్టిసిపేట్ చేసేదాన్ని. నా ఇంటరెస్ట్ చూసి మా ఆయన నన్ను ప్రోత్సహిస్తుంటారు. పట్టుచీరలపై అవగాహన కల్పించే అవకాశం ఉండటంతో ఈ కార్యక్రమానికి వచ్చాను.
- జయ ఇంటూరి, గృహిణి
పెళ్లయిన వారికీ వేదికలు ఉండటం విశేషం..
పెళ్లయి నాలుగు నెలలే అయింది. మా ఆయన నరసింహారెడ్డి, మార్కెటింగ్ ఇంజనీర్. టీవీలో స్క్రోలింగ్ చూసి వచ్చాను. పెళ్లయ్యాక ఇదో కొత్త జ్ఞాపకం. మా ఆయన ఎంకరేజ్ చేసి, ఈ కార్యక్రమానికి తీసుకువచ్చారు. ఇలాంటి వేదికలు పెళ్లయిన వాళ్లకు సైతం అందుబాటులో ఉండటం విశేషం.
- అనసూయారెడ్డి, చేవెళ్ల