
పెదవుల అందం.. అధరహో..
సినీతారలు సహజంగానే సొగసరులు. వారి నగుమోములకు వన్నెనిచ్చేవి పెదవులే. అలాంటి అందాల అధరాలను కోరుకోనిదెవరు? కత్తి పడకుండానే, పెదవులను అందంగా తీర్చిదిద్దే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. అది కూడా కేవలం ఇరవై నిమిషాల వ్యవధిలోనే. చిన్నపాటి సూదిమందుతో ఇంచక్కా పెదవులను అందంగా మార్చేసుకోవచ్చు. పెదవులకు మెరుగులు దిద్దే అధునాతన కాస్మొటిక్ చికిత్సా విధానమైన ‘ఫిల్లర్ ఇంజెక్షన్’ మన దేశంలోనూ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ సహా మన దేశంలోని నగరాల్లో దీనికి నానాటికీ గిరాకీ పెరుగుతోంది. శస్త్రచికిత్స కంటే ఫిల్లర్ ఇంజెక్షన్ చేయించుకోవడమే మేలని చెబుతున్నారు ‘బ్లు’ స్కిన్ అండ్ కాస్మటాలజీ క్లినిక్ నిర్వాహకురాలు డాక్టర్ నిలయని.
ఇలా చేస్తారు..
పెదవుల కింద ఫిల్లర్ ఇంజెక్షన్ చేస్తారు
ఇంజెక్షన్ ప్రభావంతో పెదవులు అందమైన ఆకృతిని సంతరించుకుంటాయి
ముఖంపైనున్న చిన్నచిన్న ముడతలు, గీతలు తేలికగా తొలగిపోతాయి
పద్దెనిమిదేళ్లు నిండిన వారెవరైనా ఈ చికిత్స చేయించుకోవచ్చు
అందం కోసం ..
ముక్కును అందంగా తీర్చిదిద్దుకునేందుకు రినోప్లాస్టీ విధానం ఉంది. ఇందులో నాన్ సర్జికల్ రినోప్లాస్టీ అయితేనే మంచిదని, ఈ చికిత్స ముప్పయి నిమిషాల్లోనే పూర్తవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ముదిమిని అదిమిపెట్టి, చర్మ సౌందర్యాన్ని యవ్వనభరితంగా మార్చేందుకు ఫ్రాక్సెల్ లేజర్ ట్రీట్‌మెంట్ ఉపకరిస్తుంది. బోటాక్స్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా చర్మాన్ని యవ్వనంతో తొణికిసలాడేలా తయారు చేస్తారు. ఐదారు నెలల వ్యవధిలోనే దీని ఫలితం కనిపిస్తుంది.నుదురు, ముక్కు, నోరు, దవడ ఎముక, మెడ భాగాలకు ఈ చికిత్స చేస్తారు. మెరుపుతీగలా సన్నబడటానికి అల్ట్రా లైపోతో కూడిన ఇంజెక్షన్ లైపోలిసిస్ మేలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నాన్‌సర్జికల్ ట్రీట్‌మెంట్ ఫలితాలు మూడు వారాల్లోనే కనిపిస్తాయి. శరీరంలోని అనవసరమైన కొవ్వు మలమూత్రాలు, చెమట ద్వారా బయటకు పోతాయి.
- చల్లపల్లి శిరీష