పొగ పగబడుతోంది
డాక్టర్స్ కాలమ్
కొన్ని జబ్బులను సునాయాసంగా జయించవచ్చు. కానీ ఆయాసం నుంచి అంత తేలిగ్గా బయటపడలేం. పొగతాగేవారు దీని బారిన పడుతున్నారు. దీన్ని సీఓపీడీ (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) అంటారు. క్లియర్‌గా చెప్పాలంటే ఊపిరితిత్తుల సమస్య. ఇప్పుడిది మన సిటీలో పిలిస్తే పలుకుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సీఓపీడీ బాధితులు సంఖ్య తగ్గుముఖం పడుతుంటే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పెరుగుతున్నారు. దీనికి కారణం పొగతాగడమే.
నగరంలో పెరుగుతున్న కాలుష్యానికి తోడు, పొగతాగేవారికి ఆయాసం అనేది అయాచితంగా వస్తున్న జబ్బుగా చెబుతున్నారు కాంటినెంటల్ హాస్పిటల్‌కు చెందిన పల్మనాలజిస్ట్ డా.నళిని. విచిత్రం ఏమిటంటే సీఓపీడీ సమస్యతో ఆస్పత్రి మార్గం పడుతున్న వారిలో మహిళలు కూడా ఉంటున్నారని ఆమె చెబుతున్నారు. ఎక్కువగా సీఓపీడీ జబ్బు పొగతాగేవారిలోనే వస్తోంది. కొన్నిసార్లు ఊపిరితిత్తులు పూర్తిగా పాడయ్యే వరకూ లక్షణాలు బయట పడకపోవచ్చని, ఈ వ్యాధి ముదిరితే కేన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
దగ్గు.. ఆయాసం..
తరుచూ విపరీతంగా దగ్గు రావడం, ఆయాసానికి గురికావడం సీఓపీడీ మొదటి లక్షణం.
వ్యాధి ముదిరే కొద్దీ కాళ్ల వాపులు రావడం, సైనసిస్ లక్షణాలు కనిపిస్తాయి.
ఈ జబ్బు ముదిరితే శరీరం బరువు తగ్గడం మొదలవుతుంది.
దగ్గుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు రక్తం పడుతుంది.
సీఓపీడీలో చివరి దశ అంటే కేన్సర్ సోకే అవకాశం ఉంటుంది.
హైదరాబాద్ లాంటి నగరాల్లో 40 ఏళ్లకే సీఓపీడీ బారిన పడుతున్నారు.
వేరే మార్గం లేదు
ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నప్పుడు పొగ మానేయడం తప్ప మార్గం లేదు.
ఇప్పటికే సీఓపీడీ జబ్బుకు గురైనవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.
ఈ జబ్బు ఉన్న వారిలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. ప్రొటీన్‌లు ఎక్కువగా
ఉండే గుడ్లు, ఆకుకూరలు, పప్పు దినుసులు వంటి ఆహారం తీసుకోవాలి.
చాలామంది పాసివ్ స్మోకింగ్ అంటే ఇంట్లో ఎవరైనా తాగుతుంటే ఎదుటి వారికి
ఈ జబ్బు లక్షణాలు ఎక్కువగా వస్తాయి.
చిన్న పిల్లల ఎదుట అసలే పొగతాగకూడదు. వారి ఊపిరితిత్తులు సున్నితంగా ఉంటాయి.
డా॥నళిని
సీనియర్ పల్మనాలజిస్ట్
కాంటినెంటల్ హాస్పిటల్, హైదరాబాద్
ప్రెజెంటర్: జి.రామచంద్రారెడ్డి