Doctors column
-
మామోగ్రఫీ మరవొద్దు
డా.కె.ప్రవీణ్‌కుమార్ దాదిరెడ్డి బ్రెస్ట్ ఆంకోప్లాస్టిక్ సర్జన్,కాంటినెంటల్ హాస్పిటల్ డాక్టర్స్ కాలమ్ రొమ్ము కేన్సర్ మహమ్మారి మహిళల పాలిట శాపంగా పరిణమించింది. ఎందుకు, ఎప్పుడు వస్తుందో కారణాలు తెలియడం లేదు. ఒకప్పుడు నలభై ఐదేళ్లు దాటితేగానీ మహిళల్లో రొమ్ము కేన్సర్ పెద్దగా కనిపించేది కాదు. ఇప్పుడు ముప్ఫై దాటితే చాలు వస్తోంది. మన దేశంలో ఏటా రెండు లక్షల మంది మహిళలు రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నారు. రాష్ట్రంలోనూ రొమ్ము కేన్సర్ బాధితుల సంఖ్య ఏటికేటికీ పెరుగుతోంది. ముఖ్యంగా రొమ్ము కేన్సర్ బాధితులు నగరాల్లో ఎక్కువగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ రొమ్ము కేన్సర్ బారిన పడకుండా ఉండేందుకు కొద్దిపాటి అవగాహన ఉంటే చాలని అంటున్నారు ప్రముఖ బ్రెస్ట్ ఆంకోప్లాస్టిక్ సర్జన్ డా.కె.ప్రవీణ్‌కుమార్ దాదిరెడ్డి. ముప్పయ్ ఏళ్ల వయసు దాటితే చిన్న చిన్న మెలకువలు పాటిస్తే ఈ వ్యాధి బారి నుంచి బయటపడవచ్చునని, ప్రాథమిక దశలో గుర్తించినా దాన్ని పూర్తిగా నిర్మూలించుకోవచ్చునని అంటున్నారు. కారణాలు తెలియకపోయినా బ్రెస్ట్ కేన్సర్ ఎందుకు వస్తుందన్నదానికి ప్రధానంగా కారణాలు లేకపోవచ్చుగానీ, ఎక్కువగా వస్తుందన్నది మాత్రం తేటతెల్లమైంది. దీనికి గల కారణాలు పరిశీలిస్తే... - కుటుంబ చరిత్ర కారణంగా వచ్చే అవకాశాలున్నాయి. - పొగతాగడం, మద్యం సేవించే మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశం. - చిన్నవయసులోనే పెళ్లిళ్లు, పిల్లలు పుట్టడం వల్ల కూడా ఈ ప్రభావం ఉంటుంది. - లేటు వయసులో అంటే 40-45 ఏళ్ల మధ్యలో బిడ్డలను కనడం వల్లకూడా వచ్చే అవకాశం. - కొవ్వులు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడమూ ఒక కారణం. - పీరియడ్స్‌లో భారీగా మార్పులు చోటు చేసుకోవడం. - ప్రధానంగా ఈస్ట్రొజెన్ కొలెస్ట్రాల్ కారణంగా బ్రెస్ట్ కేన్సర్ వస్తున్నట్టు స్పష్టం. ఏడాదికో 15 నిముషాలు.. - 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళా ఏడాదికోసారి మామోగ్రఫీ టెస్టు చేయించుకోవాలి. - ఈ టెస్టు చేయించుకోవడానికి 15 నిముషాలు పడుతుంది. దీనికి రూ.1,500 ఖర్చవుతుంది. దీనివల్ల రొమ్ము కేన్సర్‌ను గుర్తించే అవకాశం ఉంటుంది. - రేడియేషన్ ప్రభావం తక్కువగా ఉండే డిజిటల్ మామోగ్రఫీ టెస్టులు వచ్చాయి. - చంటిబిడ్డలకు తల్లి ఎక్కువ రోజులు పాలు ఇవ్వడం వల్ల కొంతవరకూ రొమ్ము కేన్సర్‌ను నివారించుకోవచ్చు. - ముప్ఫై ఏళ్లు దాటిన మహిళలు తరచూ రొమ్ములో వచ్చే మార్పులను గమనించాలి. గడ్డలు, చర్మం రంగుమారడం, మచ్చలు వంటి మార్పులు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. - దీనివల్ల ప్రాథమిక దశలోనే రొమ్ము కేన్సర్‌ను గుర్తించే అవకాశం ఉంటుంది. - ప్రాథమిక దశలో ఉన్న రొమ్ము కేన్సర్లను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రెస్ట్‌ను తొలగించకుండా నయం చేసే అవకాశాలున్నాయి. - బీఆర్సీఏ జీన్ టెస్టింగ్ అనే పద్ధతి ఇప్పుడు రొమ్ము కేన్సర్ నివారణలో కీలకమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. - క్రమం తప్పకుండా మామోగ్రఫీ చేయించుకుంటే రొమ్ము కేన్సర్‌ను సులభంగా గుర్తించడం, నివారించుకోవడం సాధ్యమవుతుంది. -
పొగ పగబడుతోంది
డాక్టర్స్ కాలమ్ కొన్ని జబ్బులను సునాయాసంగా జయించవచ్చు. కానీ ఆయాసం నుంచి అంత తేలిగ్గా బయటపడలేం. పొగతాగేవారు దీని బారిన పడుతున్నారు. దీన్ని సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) అంటారు. క్లియర్‌గా చెప్పాలంటే ఊపిరితిత్తుల సమస్య. ఇప్పుడిది మన సిటీలో పిలిస్తే పలుకుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సీఓపీడీ బాధితులు సంఖ్య తగ్గుముఖం పడుతుంటే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పెరుగుతున్నారు. దీనికి కారణం పొగతాగడమే. నగరంలో పెరుగుతున్న కాలుష్యానికి తోడు, పొగతాగేవారికి ఆయాసం అనేది అయాచితంగా వస్తున్న జబ్బుగా చెబుతున్నారు కాంటినెంటల్ హాస్పిటల్‌కు చెందిన పల్మనాలజిస్ట్ డా.నళిని. విచిత్రం ఏమిటంటే సీఓపీడీ సమస్యతో ఆస్పత్రి మార్గం పడుతున్న వారిలో మహిళలు కూడా ఉంటున్నారని ఆమె చెబుతున్నారు. ఎక్కువగా సీఓపీడీ జబ్బు పొగతాగేవారిలోనే వస్తోంది. కొన్నిసార్లు ఊపిరితిత్తులు పూర్తిగా పాడయ్యే వరకూ లక్షణాలు బయట పడకపోవచ్చని, ఈ వ్యాధి ముదిరితే కేన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దగ్గు.. ఆయాసం.. తరుచూ విపరీతంగా దగ్గు రావడం, ఆయాసానికి గురికావడం సీఓపీడీ మొదటి లక్షణం. వ్యాధి ముదిరే కొద్దీ కాళ్ల వాపులు రావడం, సైనసిస్ లక్షణాలు కనిపిస్తాయి. ఈ జబ్బు ముదిరితే శరీరం బరువు తగ్గడం మొదలవుతుంది. దగ్గుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు రక్తం పడుతుంది. సీఓపీడీలో చివరి దశ అంటే కేన్సర్ సోకే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ లాంటి నగరాల్లో 40 ఏళ్లకే సీఓపీడీ బారిన పడుతున్నారు. వేరే మార్గం లేదు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నప్పుడు పొగ మానేయడం తప్ప మార్గం లేదు. ఇప్పటికే సీఓపీడీ జబ్బుకు గురైనవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఈ జబ్బు ఉన్న వారిలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు, ఆకుకూరలు, పప్పు దినుసులు వంటి ఆహారం తీసుకోవాలి. చాలామంది పాసివ్ స్మోకింగ్ అంటే ఇంట్లో ఎవరైనా తాగుతుంటే ఎదుటి వారికి ఈ జబ్బు లక్షణాలు ఎక్కువగా వస్తాయి. చిన్న పిల్లల ఎదుట అసలే పొగతాగకూడదు. వారి ఊపిరితిత్తులు సున్నితంగా ఉంటాయి. డా॥నళిని సీనియర్ పల్మనాలజిస్ట్ కాంటినెంటల్ హాస్పిటల్, హైదరాబాద్ ప్రెజెంటర్: జి.రామచంద్రారెడ్డి -
ఆ లక్షణం కనిపించగానే..
డాక్టర్స్ కాలమ్ గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకోవడం ఎందుకనేది నానుడి. చాలారకాల జబ్బుల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. బిజీలైఫ్‌లో కొట్టుమిట్టాడుతున్న నగరవాసులు ప్రాణం మీదికి వచ్చే వరకూ చాలా జబ్బులను పట్టించుకోవడం లేదు. ఉద్యోగంలో అలసట, పర్సనల్ లైఫ్‌లో చికాకులు ఆరోగ్యంపై శ్రద్ధ లేకుండా చేస్తున్నాయి. కానీ కొన్ని జబ్బుల లక్షణాలు సాదాసీదాగా ఉండొచ్చు. కానీ అవి ముదిరితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కణితులు ( ట్యూమర్స్) ఈ కోవలోకే వస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందే. చాలామంది తలనొప్పే కదా అని ఓ మాత్ర వేసుకుని అప్పటికప్పుడు రిలాక్స్ అవుతారు. ఇలా తరచూ వచ్చే తలనొప్పి వెనుక ట్యూమర్లు ఉండే ప్రమాదం లేకపోలేదని అంటారు కిమ్స్‌లో సీనియర్ న్యూరో సర్జన్ డా॥కుమార్. తరచూ తలనొప్పి, ఫిట్స్ రావడటం, స్పృహ తప్పిపోవడం వంటి సమస్యలు తలెత్తితే.. న్యూరో సర్జన్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. లేదంటే కేన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా శరీరం బయట కనిపించేవే ట్యూమర్లు కావు. ఇవి మెదడులోనూ ఏర్పడవచ్చని తగిన జాగ్రత్తలు తప్పనిసరని ఆయన సూచిస్తున్నారు. లక్షణాలు.. తరచూ విపరీతమైన తలనొప్పి రావొచ్చు. ఎక్కువగా ఫిట్స్ వస్తున్న వారిలోనూ ట్యూమర్స్ రావొచ్చు అప్పుడప్పుడు స్పృహ తప్పి పడిపోవడాన్ని ప్రమాదంగా పరిగణించాలి నోరు వంకర పోవడానికి ఒక్కోసారి ట్యూమర్లు కారణం కావచ్చు. ఏదైనా ఆహారం మింగడానికి ఇబ్బందిగా ఉండటం లక్షణంగా భావించవచ్చు ఉన్నట్టుండి చూపులో తేడా రావడమూ ఒక లక్షణమే నిర్లక్ష్యం వద్దు.. ఎలాంటి ట్యూమర్లనైనా ప్రాథమిక దశలోనే కనిపెట్టే అత్యాధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ట్యూమర్లలో అనప్లాసియాకు చెందినవైతే వేగంగా పెరుగుతూంటాయి. అదే బినైన్ ట్యూమర్లతో అంత పెద్ద సమస్య రాదు. సీటీస్కాన్, ఎంఆర్ఐ, న్యూరో నేవిగేషన్ వంటి పరీక్షలతో ట్యూమర్లను కనిపెట్టవచ్చు. ఎలాంటి ట్యూమర్నైనా ప్రాథమిక దశలోనే కనిపెడితే.. కేన్సర్‌ను నియంత్రించవచ్చు. ట్యూమర్లు రావడానికి వయసుతో పెద్దగా పనిలేదు. ఏ వయసులోని వారికైనా రావొచ్చు. డా॥సుజిత్‌కుమార్ విడియాల సీనియర్ న్యూరోసర్జన్ కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్ ప్రెజెంటర్: జి.రామచంద్రారెడ్డి -
దంతసిరి వర్రీ
డాక్టర్స్ కాలమ్ వయసు మీదపడితే గానీ పంటి సమస్యలు వచ్చేవి కావు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ముప్పయ్ ఏళ్లకే దంత సమస్యలు తలెత్తుతున్నాయి. ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు వెరసి నూటికి డెబ్భయ్ శాతం మంది డెంటల్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నారు. దంత సమస్యలపై నిర్లక్ష్యం వహించడం ఇబ్బందులకు దారితీస్తోంది. హైదరాబాద్ వంటి మహానగరాల్లో కూడా డెంటల్ ప్రాబ్లమ్స్‌పై వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. దీంతో సమస్య తీవ్రమై వైద్యం ఖరీదవుతోంది. ముఖ్యంగా మారిన ఆహారపు అలవాట్లే దంత సమస్యలకు కారణం అవుతోందని ప్రముఖ దంత వైద్యుడు డా॥అంటున్నారు. నగరాల్లో శీతల పానీయాలు ఎక్కువగా తాగడం, ఆల్కహాల్ , సిగరెట్ తాగడం ఎక్కువగా ఉండటంతో ముప్పయ్ ఏళ్లలోనే దంత సమస్యలు పలకరిస్తున్నాయని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే మెట్రోనగరాల్లో దంతసిరి బాధితులు ఎక్కువగా ఉన్నారని ఆయన చెబుతున్నారు. ఇలా సమస్యలు... * చాలామంది శీతల పానీయాలు (సాఫ్ట్ డ్రింక్స్.. కోలాలు) వంటివి ఎక్కువ తీసుకుంటున్నారు. * వీటిలో మోతాదుకు మించి ఉన్న చక్కెర పదార్థాలు పళ్లలో ఉండే బాక్టీరియాను పెంచుతుంది. * నిల్వ ఉన్న ఆహార పదార్థాలు (బేకరీ ఫుడ్స్) ఎక్కువగా తీసుకుంటే దంత సమస్యలకు కారణం అవుతాయి. * పొగతాగటం అలవాటున్న వారిలో ఎక్కువ మంది చిగుళ్ల సమస్యతో బాధపడుతున్నారు. * ఐస్‌క్రీమ్స్, చాక్లెట్లు ఎక్కువగా తీసుకునేవారికి దంత సమస్యలు ఎదురవుతున్నాయి. కాసింత శ్రద్ధ ఉంటే చాలు * దంతసిరిని కాపాడుకోవాలంటే ఆరు నెలలకు ఒకసారి పరీక్షలు విధిగా చేయించుకోవాలి * ఉదయం, రాత్రి భోజనం తర్వాత విధిగా బ్రష్ వేసుకుంటే పళ్ల సందుల్లో ఆహార పదార్థాలు తొలగి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. * తరచూ కీరా, క్యారెట్‌తో పాటు ఆపిల్, నారింజ వంటి పళ్లు తీసుకోవడం పళ్లకు వ్యాయామమే కాకుండా, దంతాలకు ఇవి బలాన్నిస్తాయి * ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడం వల్ల దంతాల పటుత్వం పెరుగుతుంది. * అతి శీతలమైన నీటిని తీసుకోవడం మంచిది కాదు. -
అప్రమత్తంగా ఉందాం..!
డాక్టర్స్ కాలమ్ జ్వరాలన్నీ ఒకటే కావు. కొన్ని ప్రమాదకరమైన జ్వరాలూ ఉంటాయి. విదేశాల నుంచి వచ్చే ప్రమాదకర వైరస్లు మొదట ప్రభావం చూపేది మహానగరాలపైనే. గతంలో స్వైన్ ఫ్లూ హైదరాబాద్‌పై పంజా విసిరింది. పశ్చిమాఫ్రికా దేశాల్లో కలకలం సృష్టిస్తున్న ఎబోలా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఆయా దేశాల నుంచి ఎందరో పర్యాటకులు రోజూ హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతున్నారు. సిటీ నుంచి వందల సంఖ్యలో వ్యాపార, ఉద్యోగ రీత్యా ఎందరో రోజూ ఆఫ్రికా దేశాలకు వెళ్లి వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎబోలా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని కాంటినెంటల్ ఆస్పత్రికి చెందిన వైద్యురాలు డా.సౌజన్య చెబుతున్నారు. సాధారణ జ్వరాలకు ఉండే లక్షణాలన్నీ దీనికి కూడా ఉంటాయని, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండటమే అసలైన మందు అని చెబుతున్నారామె. వ్యాధి లక్షణాలు ►మలేరియా, డెంగీ, స్వైన్‌ఫ్లూ జ్వరాల తరహాలోనే ఈ వ్యాధి లక్షణాలుంటాయి. ►నోట్లో ఎక్కువగా లాలాజలం ఊరుతుంది. ►శరీరం మొత్తం విపరీతంగా చెమటలు పడుతుంటాయి. ►శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ►ఛాతీలో విపరీతంగా నొప్పి వస్తుంది. ►కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. ►శరీరంపై అక్కడక్కడా దద్దుర్లు వస్తాయి. ►వాంతులు, విరేచనాల ప్రభావం అధికంగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ►ఇలాంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. ►దీనికి ప్రత్యేకంగా మందులుగానీ, టీకాలు గానీ లేవు. ఇవి ఇంకా పరీక్షా దశను దాటలేదు. ►విమానాశ్రయాల్లో విదేశీ ప్రయాణికులకు వైద్యపరీక్షలు ►పక్కాగా నిర్వహించాలి. ►ఎబోలా రోగులకు వైద్యం అందించడంలో నర్సులదే కీలక పాత్ర. అందుకే హైదరాబాద్ లాంటి నగరాల్లో నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అవసరం. ► కాచిన నీళ్లు తాగడం, చేతులు శుభ్రంగా కడుక్కుని ఆహారాన్ని తీసుకోవడం ప్రాథమిక జాగ్రత్తలు ప్రజంటర్: జి.రామచంద్రారెడ్డి