దివాన్ దేవిడీ
దివాన్ దేవిడీ అంటే ప్రధాని అధికార నివాసం అని తెలుగులో సమానార్థంగా చెప్పుకోవచ్చు. అసఫ్‌జాహీ ప్రభువుల ఆస్థానంలో పనిచేసిన పలువురి ప్రధాన మంత్రుల అధికార నివాసం ‘దివాన్ దేవిడీ’. చార్మినార్‌కు వెళ్తుంటే ముందుగా వచ్చే మదీనా హోటల్‌కు ఒక పక్కగా ఉండేది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో చిన్నా, చితక అంగళ్లు కనపడుతున్నాయి. అయితే ఆ ప్రాంతంలో దివాన్ దేవ్‌డీకి గుర్తుగా అవశేషాలున్నాయి. దేవిడీకి తూర్పు-ఉత్తర దిశలో రెండు పెద్ద సింహద్వారాలున్నాయి. ఈ అధికార నివాసంలో ఆయినా ఖాన్, లఖడ్ కోటా, చీనాఖాన్, నిజాం భాగ్, నూర్ మహల్... ఇలా అందమైన, అపురూపమైన, అద్భుతమైన కట్టడాలు అదృశ్యమయ్యాయి.
నిజాం నవాబుల ఆస్థానంలో గొప్ప ప్రతిభా సంపన్నులుగా కీర్తినందుకున్న ప్రధాన మంత్రులు సాలార్‌జంగ్-1, 2, 3 దివాన్ దేవిడీ నుంచి తమ అధికార హోదాలో సేవలందించారు. కళాసాంసృ్కతిక, ఆర్థిక, రాజకీయ రంగాలల్లో కీలక పాత్ర పోషించారు. మీర్‌తురబ్ అలీఖాన్, సాలార్‌జంగ్-1, 3, లు సేకరించిన విశిష్ట కళాఖండాలను దివాన్ దేవిడీలోనే ప్రప్రథమంగా ప్రదర్శించారు. 1968 ప్రాంతంలో మూసీనది తీరంలో సాలార్‌జంగ్ మ్యూజియం నిర్మాణం జరిగింది. అప్పటిదాకా దివాన్ దేవిడీలోనే సాలార్‌జంగ్‌లు సేకరించిన అపురూపాలు ప్రజలకు అందుబాటులో ఉండేవి. సాలార్‌జంగ్ మ్యూజియంను కొత్త పరిపాలనా వ్యవహారాలకు, కళాసాంసృ్కతిక వైభవానికి ఈ మ్యూజియంను కొత్త భవనాలకు తరలించారు.
నాటి రాజకీయాలకు, నిజాం ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలకు కళాసాంస్కృతిక వైభవానికి దివాన్ దేవిడీలో అసఫ్‌జాహీల పాలనకంటే ముందుగానే 1724లో మొఘల్ చక్రవర్తి తరఫున వైస్రాయ్ (సుబేదార్) హోదాలో నియమించిన ముబారీస్‌ఖాన్ ఈ భవనాన్ని తన అధికార నివాసంగా ఉపయోగించారని చరిత్రకారులు చెబుతారు. ఆ తర్వాత అసఫ్‌జాహీల ప్రధాన మంత్రిగా పని చేసిన నవాబ్ మీర్ ఆలం, నవాబ్ మునీర్-ఉల్-ముల్క్ దివాన్ దేవిడీలో నివాసమున్నారు. అయితే... రాజనీతిజ్ఞుడుగా కీర్తి గడించిన నిజాం ఆస్థాన ప్రధాని సాలార్‌జంగ్-1 మీర్ తురభ్‌అలీఖాన్ పరిపాలనా కాలంలో ‘దివాన్ దేవిడీ’ ప్రతిభ మరింతగా ప్రకాశించిందని చెప్పొచ్చు. సాలార్‌జంగ్-1, 1853 నుంచి 1883 వరకు ప్రధానిగా పనిచేశారు. సాలార్‌జంగ్-1 పరిపాలనా కాలంలోనే దివాన్ దేవిడీ పలు విధాల అభివృద్ధి చెందింది. బర్మా టేకుతో చేసిన ‘లక్కడ్‌కోట’ భవన సముదాయం, నిలువువెత్తు అద్దాలు, షాండిలియర్లున్న ‘ఐనా ఖానాహాలు‘ దివాన్ దేవిడీలో ప్రధాన ఆకర్షణ. ‘ప్యార్ కియాతో డర్‌నా క్యా’ వంటి కొన్ని హిందీ చిత్రాలు ఇందులోనే చిత్రీకరించారు.
సాలార్‌జంగ్-3...
సుమారు 1400 చ.కి.మీ. విస్తీర్ణంలోని ఎస్టేట్‌లో రెండు లక్షల మంది పనిచేసేవారట. ఆనాడే వారి వార్షికాదాయం రూ.15 లక్షలు పైబడి ఉందేది. సాలార్‌జంగ్-1 మరణానంతరం ఆయన కుమారుడు సాలార్‌జంగ్-2 మీర్ లాయిక్ అలీఖాన్ (1884-87) తన 23 సంవత్సరాల వయస్సులో నిజాం ఆస్థాన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, కేవలం 27 ఏళ్ల వయసులోనే ఆయన మరణించాడు. అప్పటికి అతని ఏకైక కుమారుడు నెలల పసిగుడ్డు. అతనికి మీర్ యూసుఫ్ అలీఖాన్‌గా పేరు పెట్టారు. మీర్ యూసుఫ్ అలీఖాన్ పాలనా పోషణల బాధ్యతను ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ చేపట్టాడు. కళాభిమానిగా, మేధావిగా మీర్ యూసుఫ్ అలీఖాన్ కీర్తి పొందాడు. మీర్ యూసుఫ్ అలీఖాన్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ పాలనా కాలంలో సాలార్‌జంగ్-3గా నియమితులయ్యాడు.
కేవలం రెండేళ్లు (1912-1914) నిజాం ఆస్థాన ప్రధానిగా చేసిన సాలార్‌జంగ్-3 తన పదవి వదలి దేశ, విదేశీ పర్యటనకు వెళ్లాడు. విలువైన కళాకృతులు సేకరించాడు. బ్రహ్మచారిగా ఉన్న ఆయన కళలు, సాహిత్యం అభివృద్ధికి ఎనలేని సేవ చేశాడు. వ్యక్తిగత హోదాలో సేకరించిన వస్తువుల ప్రదర్శన కేటగిరీలో సాలార్‌జంగ్ మ్యూజియం నేటికీ ప్రపంచ స్థాయిలోనే మొదటిదని చరిత్రకారుల అభిప్రాయం. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న దివాన్ దేవిడీ నేడు ఎలాంటి ఆలనాపాలనా లేకుండా పోవడం దురదృష్టకరం.
- మల్లాది కృష్ణానంద్
malladisukku@gmail.com