రేసు గుర్రం | Race horse turns as jockey | Sakshi
Sakshi News home page

రేసు గుర్రం

Published Tue, Jul 8 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

రేసు గుర్రం

రేసు గుర్రం

రెక్కల గుర్రంపై యువరాజు.. ఒకప్పటి ఫిమేల్ ఫాంటసీ. యుద్ధాలలో గుర్రాలపై దూసుకొచ్చే వీరులు.. జానపద కథల్లో తరచూ తారసపడే పాత్రలు. కాలం మారడంతో గుర్రాల మీది యువరాజులు పోయి, జాకీలు వచ్చారు. గుర్రాలను రణరంగం బదులు రేసుకోర్సుల్లో పరుగులు తీయిస్తున్నారు.
 
 నవాబుల కాలం నాటి మలక్‌పేట మార్కెట్‌లో నుంచి తిన్నగా ఒకటిన్నర కిలోమీటరు దూరం వెళితే.. రాచరికపు ఆనవాళ్లు కనిపించడమే కాదు, గుర్రాల డెక్కల చప్పుడూ వినిపిస్తుంది. తేరిపార చూస్తే ‘హైదరాబాద్ రేస్‌కోర్స్’ అనే బోర్డుంటుంది. లోపలకు వెళ్లి చూస్తే.. పద్నాలుగు, పదిహేనేళ్ల కుర్రాళ్లు గుర్రాలకు సేవ చేస్తూ కనిపిస్తారు. బాలకార్మికులేమీ కాదు గానీ, వారే రేపటి జాకీలు. వారిని హార్స్ జాకీలుగా తీర్చిదిద్దే అప్రెంటిస్ జాకీ ట్రయినింగ్ స్కూల్ అది.
 
 హైదరాబాదీలదే హవా
 దేశంలో ప్రస్తుతం 250 మంది జాకీలు ఉన్నారు. వారిలో దాదాపు 50 మంది  హైదరాబాదీలే. వారిలోనూ చాలామంది అప్రెంటిస్ జాకీ ట్రైనింగ్ స్కూల్ పూర్వవిద్యార్థులే.
 
 స్కూల్‌లో ఏం చేస్తారు..?
 ఉదయం 5.30 గంటల నుంచి శిక్షణ మొదలవుతుంది. గుర్రాలను శుభ్రం చేసి, దాణాపెట్టి.. దాని బాగోగులు చూసుకోవాలి. తర్వాత రేసింగ్ ప్రాక్టీస్, రేసింగ్ నిబంధనలపై తరగతులుంటాయి. తర్వాత మళ్లీ ప్రాక్టీస్. వారంలో ఆరురోజులు ఇదే షెడ్యూల్. వీటిపై రిటెన్, ప్రాక్టికల్ పరీక్షలుంటాయి. ప్రిన్సిపాల్ వీరేందర్ ఖాజా, వైస్ ప్రిన్సిపాల్ బజరంగ్ సింగ్‌లు స్కూలు వ్యవహారాలు చూసుకుంటారు.
 
 దేశంలో ఏకైక స్కూల్

 హార్స్ జాకీల కోసం ప్రత్యేకంగా ఏర్పడిన స్కూల్ మన దేశంలో ఇదొక్కటే. 1986లో ప్రారంభమైన ఈ స్కూల్ నుంచి వందలాది మంది జాకీలు తయారయ్యారు. విద్యార్థులకు భోజన, వసతులు ఉచితం. హైదరాబాద్ రేస్ క్లబ్ వాటన్నింటినీ చూసుకుంటుంది. ఈ స్కూల్‌లో మూడేళ్ల కోర్సుకు.. రాత, శరీర దారుఢ్య పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. మూడేళ్లకోసారి మాత్రమే ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇస్తారు.
 
 జాకీలే కీలకం

 పందెం రాయుళ్లే కాదు, ప్రేక్షకులు సైతం గుర్రాలపైనే దృష్టి పెడతారు. సంరక్షణ కోసం నెత్తిపై పెట్టుకున్న హెల్మెట్‌లో జాకీ ముఖం కవరైపోతుంది. గుర్రాన్ని నడిపించే జాకీని ఎవరూ గుర్తించరు. ఎంతో కష్టమైనా, అండర్‌రేటెడ్ జాబ్ హార్స్ జాకీలది. ఒకప్పుడు ఆదరణ తక్కువగా ఉన్నా, ఇప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ యువతరం ముందుకొస్తుండటంతో హార్స్ జాకీయింగ్‌పై క్రేజ్ పెరుగుతోంది.
 
 రెండున్నర శతాబ్దాల చరిత్ర
 దేశంలో గుర్రపు పందాలకు రెండున్నర శతాబ్దాల చరిత్ర. ప్రస్తుతం భారత్‌లో అరడజను రేస్ టర్ఫ్‌లున్నాయి. ఏడాది పొడవునా ఏదో ఒక టర్ఫ్‌లో పందేలు జరుగుతూనే ఉంటాయి. జాకీకి గుర్రాన్ని ముందుకు ఉరికించడమే కాదు, దానిని అదుపుచేయడమూ తెలిసుండాలి. గుర్రం, జాకీల్లో ఏ ఒకరు తడబడినా పరిస్థితి తారుమారవుతుంది. ‘అశ్వహృదయం’ అర్థమైతే తప్ప జాకీలుగా రాణించలేరు. మనం పదేపదే మాట్లాడుతుంటే.. మన భాష, భావం గుర్రాలకు అర్థమవుతుందని చాలామంది జాకీలు నమ్ముతారు. రేసుల్లో కూడా వెయిట్ లిఫ్టింగ్ మాదిరిగానే జాకీల బరువునే కొలమానంగా పోటీలు నిర్వహిస్తారు.
 
 40 నుంచి 70 కేజీల వరకు వివిధ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. జాకీలకు ప్రత్యేకంగా ఉద్యోగాలేవీ ఉండవు. పందేలలో గుర్రాలను పెట్టే యజమానులే జాకీలను హైర్ చేసుకుంటారు. గుర్రాన్ని బట్టి వారికి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కాంట్రాక్టు ఉంటుంది. అంతేకాదు, గెలిచిన గుర్రానికి అందే ప్రైజ్ మనీలో ఏడున్నర శాతం జాకీకే చెందుతుంది. గెలిచిన రేసులను బట్టి జాకీలకు పాపులారిటీ పెరుగుతుంది. పీసీ చవాన్, శ్రీనాథ్, సూరజ్ నర్రెడులు మన దేశంలో ఫేమస్ జాకీలు. గుండెధైర్యం, ఏకాగ్రత, శారీరక దారుఢ్యం ఉంటే ఎవరైనా జాకీలుగా రాణించవచ్చు.  
 
 గుర్రాల మధ్యే పెరిగా..

 మాది బీహార్ అయినా, మా నాన్న ఇక్కడే పనిచేస్తారు. చిన్నప్పటి నుంచి గుర్రాల మధ్యే పెరగడంతో జాకీయింగ్‌పై ఆసక్తి పెరిగింది. పెద్ద జాకీగా ఎదిగి బాగా డబ్బు సంపాదించడమే నా లక్ష్యం.
 -రోహిత్ కుమార్, బీహార్
 
 పీసీ చవాన్ ఆదర్శం

 మాది ఊటీ. సమ్మర్ రేసులన్నీ ఊటీ రేస్ కోర్సులో జరుగుతాయి. రేసులు చూసి ఆసక్తి పెరిగింది. మొదట్లో ఎత్తయిన గుర్రాలను చూసి కాస్త భయమేసినా, తర్వాత కాన్ఫిడెన్స్ ఉంటే చాలని అర్థమైంది. జాకీ పీసీ చవాన్ నాకు ఆదర్శం. ఎప్పటికైనా ఆయనలా టాప్ రేంజ్‌కి ఎదగాలన్నదే నా కోరిక.
 - రాహుల్ హుటి, ఊటీ
 
 టాప్ జాకీ కావడమే లక్ష్యం

 నాకు తల్లిదండ్రులు లేరు. మా అంకుల్ వద్ద పెరిగాను. ముంబై రేస్ కోర్స్ దగ్గర ఉండేవాళ్లం. రోజూ రేసులు చూసి చూసి ఆసక్తి పెరిగింది. హైదరాబాద్‌లో ఈ స్కూల్ ఉందని తెలిసి, ఇక్కడ చేరాను. దేశంలోనే టాప్ జాకీని కావడమే
 నా లక్ష్యం.
 - రఫీక్ షేక్, ముంబై
 - జాయ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement