బంగారంపై ఆంక్షలు, సుంకం తగ్గించే యోచన | Restrictions and tax on Gold plans to reduce | Sakshi
Sakshi News home page

బంగారంపై ఆంక్షలు, సుంకం తగ్గించే యోచన

Published Sat, Mar 8 2014 4:09 PM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM

బంగారంపై ఆంక్షలు, సుంకం తగ్గించే యోచన

బంగారంపై ఆంక్షలు, సుంకం తగ్గించే యోచన

దేశంలో దొంగ బంగారం అంతకంతకూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రతి రోజూ దేశంలోని  ఏదో ఒక విమానాశ్రయంలో అక్రమంగా తీసుకువస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకుంటున్నారు. ఒక్క శంషాబాద్లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత ఏడాది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు 62 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు.  గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫిబ్రవరి నెలలో పదికిపైగా బంగారం పట్టివేత కేసులు ఇక్కడ నమోదయ్యాయి. కస్టమ్స్ అధికారులు సుమారు పది కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.  ఎలక్ట్రో ప్లేట్ల రూపంలో, పాప్‌కార్న్ యంత్రం, షూ సాక్సుల్లో, లో దుస్తుల్లో, లగేజీ బ్యాగులకు డిజైనింగ్ తీగల మాదిరిగా, చివరకు కండోమ్స్లో కూడా....ఇలా పలు విధాలుగా ప్రయాణికులు విదేశాల నుంచి బంగారాన్ని తీసుకొచ్చి అడ్డంగా దొరికిపోతున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు రెండున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.  కోచి విమానాశ్రయంలో లిక్విడ్ గోల్డ్ (ద్రవ రూపంలో బంగారం)ను కండోమ్లో అక్రమంగా రవాణా చేస్తుండగా కస్టమ్స్  అధికారులు పట్టుకున్నారు.   నెడుంబస్సెరీ ఎయిర్ పోర్ట్లో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్లో ఓ ప్రయాణికుడ్ని తనిఖీ చేయగా కండోమ్స్లో అక్రమంగా రవాణా చేస్తున్న 5.345 కిలోల లిక్విడ్ గోల్డ్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  

 శంషాబాద్ విమానాశ్రయంలో ఈ నెలలో  సింగపూర్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి రెండు కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు.  థాయ్లాండ్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు షూలో దాచిన బంగారాన్ని అధికారుల స్వాధీనం చేసుకున్నారు.  బంగారంపై ఆంక్షలు పెరగటంతో శంషాబాద్ విమానాశ్రయం అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. ఈ విధంగా దేశవ్యాప్తంగా బంగారం అక్రమ రవాణా రోజురోజుకు పెరిగిపోతోంది.

ఈ పరిస్థితుల్లో బంగారం దిగుమతులపై ఆంక్షలు తొలగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పూర్తిగా కాకపోయినా కొంత మేర దిగుమతి సుంకాన్ని తగ్గించాలన్న ఆలోచనలో ఉంది. ప్రస్తుతం ఈ సుంకం 10 శాతంగా  ఉంది. దీనిని సగానికి తగ్గిస్తే బంగారం ధర 5 శాతం దాకా తగ్గుతుంది. అంటే 10 గ్రాముల ధర 1500 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది.  అలాగే దిగుమతి చేసుకున్న బంగారంలో 20 శాతం తిరిగి ఎగుమతి చేయాలన్న నిబంధన ఎత్తివేస్తే దాని వల్ల కూడా ధర స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. ఈరోజు ఢిల్లీలో బంగారం 24 క్యారెట్ల పది గ్రాముల ధర 30,350 రూపాయలు ఉంది.  కిలో వెండి ధర 46,692 రూపాయలు ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement