వి'భజన'రాజీ
రాష్ట్ర విభజన అంశంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాజీపడుతున్నారు. తెలంగాణ ఏర్పాటు అనివార్యమని... ఇక విభజన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించుకోవడమే మంచిదంటూ సూచిస్తున్నారు. సమైక్యాంధ్ర అజెండా నుంచి సీనియర్లు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు.ఇన్నాళ్లూ విభజనను అడ్డుకుంటామన్న సీమాంధ్ర కేంద్రమంత్రులు ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారు. రాష్ట్ర విభజన ఖాయమైందని... ఇక ఎవరూ ఆపలేరని... క్లారిటీ ఇస్తున్నారు.సీమాంధ్రకు కావాల్సిన డిమాండ్లు ఏంటో తేల్చుకుందామని ఉద్యమకారులను బుజ్జగిస్తున్నారు.
కేంద్ర క్యాబినెట్ తెలంగాణ నోట్‌ను ఆమోదించడం.... విభజన అంశంపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం అంశాల వారిగా బాధ్యతలను పంచుకోవడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. ఇక సమైక్య రాష్ట్రం కోసం పోరాడి లాభం లేదని... విభజన వల్ల తలెత్తే సమసల పరిష్కారంపై దృష్టి సారించాలని సలహాలు ఇస్తున్నారు. అయితే కొందరు ఎంపీలు మాత్రం విభజనను అడ్డుకుని తీరుతామని ప్రతిజ్ఞ చేస్తున్నారు.
రాష్ట్ర వి'భజన' అంశంపై సీమాంధ్రకు కేంద్ర మంత్రులంతా అదే రాజీ ధోరణిని ప్రదర్శిస్తున్నారు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, కిషోర్ చంద్రదేవ్, చిరంజీవి, పురంధేశ్వరీ, పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, జేడీ శీలం, కిల్లి కృపారాణితో పాటు కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు కూడా తెలంగాణ ఏర్పాటు అనివార్యమని భావిస్తున్నారు.విభజనపై ఇక ప్రజలను మభ్యపెట్టడం సరికాదంటూనే.... మరోవైపు తమ రాజీనామాలతో రాష్ట్రం సమైక్యంగా ఉంటుందంటే... అందుకు రాజీనామాలు చేసేందుకు సిద్ధం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
తమ సీనియర్లే ఇలా విభజన అంశంపై రాజీపడడంతో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి నెలకొంది.దాంతో ఇన్నాళ్లూ ఒక పార్టీగా ఉన్న కాంగ్రెస్ రెండుగా చీలింది. ఈ విషయంపై కేంద్రమంత్రుల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర విభజన జరగదని... జరగకూడదని సర్వశక్తులు ఒడ్డిన సీమాంధ్ర కేంద్రమంత్రులు,ఎంపీలు ఇక రాష్ట్ర విభజన ఆగబోదన్న నిర్ధారణకు వచ్చారు.
గత 76 రోజులుగా సీమాంధ్రలో ఉద్యమం జరుగుతున్నా అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో సోనియాగాంధీ ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేరని కేంద్రమంత్రులు చెబుతున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి కావాల్సిన డిమాండ్లేంటో అడుగుదామంటూ కేంద్రమంత్రులు కొత్త పల్లవి అందుకున్నారు. మొత్తమ్మీద విభజన ప్రక్రియనే ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులు కొందరు సడెన్‌గా కూల్ కావడంపై పెద్ద చర్చే సాగుతోంది.