సమైక్య పోరుకు వంద రోజులు
మహోగ్ర సమైక్యాంధ్ర ఉద్యమం మొదలయి నేటికి 100 రోజులు. తెలుగు జాతిని ముక్కలు చేయాలన్న కుట్రకు వ్యతిరేకంగా జరుగుతున్న సమైక్య పోరాటం వంద రోజులుగా నిర్విరామంగా జరుగుతోంది. యావత్ సీమాంధ్ర ఉద్యమాలతో హోరెత్తింది. తెలుగు జాతిని విడదీయొద్దంటూ నినదించింది. అన్ని వర్గాల వారు ఉద్యమంలోకి ఉరికారు. రైతులు, రైతు కూలీలు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, చిన్నారులు సహా సమస్త సీమాంధ్ర ప్రజానీకం విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. రాజకీయ నాయకుల జోక్యం లేకుండా ప్రజలే ముందుండి వంద రోజులుగా పోరాటాన్ని నడుపుతున్నారు. ఓట్లు, సీట్లు కోసం అడ్డగోలు రాష్ట్రాన్ని విభజించవద్దంటూ ఉద్యమిస్తున్నారు.
వంద రోజులుగా ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతున్నా దున్నపోతు మీద వర్షం చందంగా కేంద్రం ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరవయింది. సమైక్య ఉద్యమకారులు తమ జీవితాలను పణంగా పెట్టి ఉద్యమిస్తున్నా పాలకులకు పట్టకపోవడం శోచనీయం. జనమంతా రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తున్నా ఏలికలు ఏమాత్రం స్పందించకపోవడం దారుణం. విభజనపై చర్చోపచర్చలు సాగిస్తున్న కేంద్రం తమ మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలన్న సీమాంధ్రుల డిమాండ్ అరణ్య రోదనయింది. అయితే ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ పోరాటం సాగుతుందని సమైక్యవాదులు అంటున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు కానీయబోమని స్పష్టం చేస్తున్నారు. తెలుగు జాతిని కలిసి ఉంచేందుకు ఎంతవరకైనా పోరాడతామని ప్రతిన బూనారు.