శృతిమించి ఫొటోలు పెడితే..
పొగడ్తలకు పడని వారు ఉండరు. అందులోనూ అమ్మాయిలు తమ అందం గురించి పొడిగించుకోవటం అంటే ఇష్టం. తాము అందంగా ఉన్నామనే ప్రశంసలు పొందడానికి టీనేజ్ అమ్మాయిలు తరచూ ఫేస్‌బుక్‌లో ఫొటోలు పెడుతుంటారు. అయితే సోషల్ వెబ్‌సైట్లలో అందమైన, సెక్సీ ఫొటోలను పోస్టుచేస్తున్న అమ్మాయిల్లో అంతగా పోటీతత్వం లేదనే అభిప్రాయం సహచర యువతుల్లో ఉందని తాజా పరిశోధనలో తేలింది.
శారీరకంగా, సామాజికంగా అంతగా ఆకర్షణీయంగా లేనివారే తరచూ ఫొటోలు పెడుతుంటారని, అలాంటి అమ్మాయిల్లో పోటీపడి పనిచేసే తత్వం తక్కువని అభిప్రాయం ఏర్పడుతున్నదని ఆ పరిశోధన తేల్చింది. ఫేస్‌బుక్ కల్పిత ఖాతాలను ఏర్పాటు చేసి.. వాటిపై అధ్యయనం చేయడం ద్వారా పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు.
‘సోషల్ మీడియాలోని ఫొటోల పట్ల తక్కువ భావన ఉన్నదన్నది సుస్పష్టం’ అని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, పరిశోధకుడు ఎలిజబెత్ డానియెల్స్ తెలిపారు. ‘తమను తాము అందంగా, సెక్సీగా చూపించాలన్న తాపత్రయం టీనేజ్ అమ్మాయిల్లో, యువతుల్లో అధికంగా ఉంటుంది. అయితే సెక్సీ ఫొటోలు పెట్టడం వల్ల సానుకూలత కన్నా ప్రతికూల పరిణామాలే ఎక్కువగా ఉన్నాయి’ అని తెలిపారు. అమ్మాయిలు శృతిమించి ఫొటోలు పెడితే.. అబ్బాయిలు, యువకులు వారిపట్ల క్రమంగా ఆకర్షణ కోల్పోయే అవకాశముందని చెప్పారు.