హన్సికతో శింబు మళ్లీ రొమాన్స్! | Simbu and Hansika in Valu | Sakshi
Sakshi News home page

హన్సికతో శింబు మళ్లీ రొమాన్స్!

Published Sun, Aug 3 2014 6:16 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

హన్సిక - శింబు - Sakshi

హన్సిక - శింబు

తమిళ హీరో శింబు తన మాజీ ప్రియురాలు బబ్లీ బ్యూటీ  హన్సికతో మళ్లీ రొమాన్స్ కొనసాగిస్తున్నాడు. ఇదంతా సినిమా కోసమేలేండి. వీరిద్దరూ జంటగా 'వాలు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అసలు ఈ చిత్రం ప్రారంభమైన తరువాతే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని చెబుతారు. 2012లో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఈ మధ్యలో శింబు-హన్సిక ఒకరి ఒకరు దగ్గరవడం. పెళ్లి చేసుకోవాలనుకోవడం. ఇందు కోసం శింబు కొత్త ఇల్లు కూడా కట్టించాలను కోవడం. అంతలోనే వారి ప్రేమాయణం బెడిసి కొట్టడం. హన్సిక కక్షతీర్చుకోవలనుకోవడం.... అన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. ఆ తరువాత శింబుతో నటించడానికి హన్సిక ఇష్టపడలేదు. పాటల చిత్రీకరణకు హాజరుకాలేదు. దాంతో  సినిమా నిర్మాణం ఆగిపోయింది. శింబుతో నటించే ఇతర అవకాశాలను కూడా ఈ బొద్దు బొమ్మ వదులుకుంది. ఒక పక్క వీరి వ్యవహారం ఇలా జరిగితే, ఇక 'వాలు' నిర్మాత పరిస్థితి చూడండి. వారికి సినిమా కష్టాలు మొదలయ్యాయి.

ఈ విషయంలో హీరో శింబు కూడా ఏమి చేయలేకపోయాడు. అసలు గొడవ వచ్చిందే అతనితో కదా.  నిర్మాతలు తమిళ ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు  చేశారు. హన్సికతో అనేక సార్లు చర్చలు జరిపారు. తమ కష్టాలు చెప్పారు. ఎట్టకేలకు ఆ సినిమా పూర్తి చేయడానికి హన్సిక అంగీకరించింది. మిగిలిన సీన్లు పూర్తి చేయడానికి,  మూడు పాటల చిత్రీకరణకు డేట్స్ ఇచ్చింది. నిజజీవితంలో ప్రేమికులైన వీరి రొమాన్స్ వెండితెరపై చూడాలని సినిమా ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు. 'వాలు' అంటే తెలుగులో చిలిపి అని అర్ధం. ఈపేరు వినగానే సినిమాలో ఎలా నటిస్తాడో అర్ధం చేసుకోవచ్చు. రొమాంటిక్ కామెడీగా రూపొందుతున్న వాలు చిత్రం షూటింగ్ మళ్లీ మొదలైంది.

 30 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయ్ చందర్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ స్వరాలు కూరుస్తున్నారు. అడ్డంకులు తొలగి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను  వచ్చే నవంబర్లో విడుదల చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారు. శింబుతో ప్రేమ బెడిసికొట్టినా పాటలలో హన్సిక అదరగొట్టిందని చెబుతున్నారు. ఆ రొమాన్స్ దృశ్యాలు చూడాల్సిందే అంటున్నారు. ఈ సినిమా నిర్మాణం వెనుక ఇంత కథ ఉండటం దీనికి డిమాండ్ పెరిగింది. ఆ విధంగా నిర్మాతలు లాభపడే అవకాశం ఉంది.

- శిసూర్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement