తీపివేడుక
దీపావళి పండుగ అంటే ఠక్కున టపాకాయలు గుర్తుకొస్తాయి ఎవరికైనా.. దీపావళి అంటే సందడి చేసే టపాకాయలే కాదు, నోరూరించే మిఠాయిలు కూడా. టపాకాయల శబ్దాలకు భయపడే చిన్నారులకు, వాటి జోలికి వెళ్లలేని వయోధికులకు పండుగ సందడి అంతా మిఠాయిల్లోనే ఉంటుంది. బిజీ బిజీ నగర జీవితంలో ఇళ్లలో మిఠాయిలు వండుకునే వారెందరు..? ఇళ్లలో మిఠాయిల తయారీ చేపట్టినా, ఒకటి రెండు.. మహా అయితే అరడజను వెరైటీలతో సరిపెట్టేస్తారు. ఇంట్లో ఎలాంటి పని పెట్టుకోకుండానే, స్వీట్స్ టేస్ట్‌ను ఆస్వాదించాలనుకునే వారికి నగరం నలుమూలలా లెక్కలేనన్ని స్వీట్‌షాపులు ఉన్నాయి. దాదాపు అన్ని షాపుల్లోనూ దొరికే వెరైటీలు ఒకే తీరులో ఉంటే ఎలా! ఎంతో కొంత కొత్తగా... మరింత ఆకర్షణీయంగా ఉండాలి కదా. అందుకే నగరవాసుల టేస్ట్‌కు తగ్గట్టు విభిన్నమైన మిఠాయిలను అందిస్తున్నారు నగరంలోని స్వీట్ షాప్‌ల వారు. లోపల స్వీట్ ఎంత మధురంగా ఉంటుందో... దానికి తగ్గట్టుగానే పైన ప్యాకింగ్ కూడా అంతే ఆకర్షణీయంగా చేస్తున్నారు. చూడ్డానికే కాదు... రుచి, శుచి, నాణ్యత కూడా ఉంటేనే గిరాకీ. వాటిపైనా దృష్టి పెడుతున్నారు దుకాణదారులు.
అదనంగా 350 వెరైటీలు..
ఈసారి దీపావళి సందర్భంగా అదనంగా దాదాపు మరో 350 వెరైటీల స్వీట్లను అందుబాటులోకి తెచ్చాం. నగరంలో మా వ్యాపారం అనూహ్యంగా పెరిగింది. అంచనాలకు మించి దాదాపు మూడు రెట్లు అమ్మకాలు పెరిగాయి. ఎక్కువగా స్వీట్ గిఫ్ట్ ప్యాక్‌లు అమ్ముడవుతున్నాయి. ప్యాకింగ్ కోసం మా సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేయాల్సి వస్తోంది.
- రుషిల్, డెరైక్టర్,
దాదూస్ మిఠాయి వాటిక
దివాలీ థీమ్స్
బంధువులు, మిత్రులకు కానుకగా ఇచ్చేందుకు వందలాది రకాల మిఠాయిలు ఇప్పుడు నగరంలో దొరుకుతున్నాయి. దీపావళి థీమ్‌కు తగ్గట్టుగా ప్యాకింగ్‌లు, స్వీట్లు చేస్తున్నారు. ప్రమిదలు, చిచ్చుబుడ్లు, మతాబుల ఆకారాల్లో రూపొందించిన స్వీట్స్‌ను వెండిని తలపించే పళ్లాల్లో పెట్టి విభిన్నంగా ప్రజెంట్ చేస్తున్నారు. స్వచ్ఛమైన నేతి మిఠాయిలు, డ్రైఫ్రూట్ స్వీట్స్, సుగర్ ఫ్రీ స్వీట్స్ నోరూరించే రుచుల్లో సిద్ధం చేసి షాపుల్లో ఉంచారు. సౌతిండియన్, బెంగాలీ, రాజస్థానీ, గుజరాతీ, ఆగ్రా, ఢిల్లీ తదితర ప్రాంతాల స్పెషల్ వెరైటీలన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి.
- శిరీష చల్లపల్లి