
మృతుడు మంజునాథ్ (ఫైల్)
దొడ్డబళ్లాపురం: అప్పటి వరకూ దీపావళి పండు గ సంబరాలతో కళకళలాడిన ఆ ఇంట్లో ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. ఇంటి యజమాని మృతి ఆ ఇంటి ఇల్లాలి కలలను ఛిన్నాభిన్నం చేశాయి. టపాసుల సరాన్ని అంటించిన వ్యక్తి నిప్పురవ్వల నుండి తప్పించుకునే ప్రయత్నంలో రైలు పట్టాలపైకి పరిగెత్తగా, అదే సమయంలో వస్తున్న రైలు ఢీకొని ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన దొడ్డబళ్లాపురం రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మంజునాథ్ (38) మృతి చెందిన వ్యక్తి.
ఎలా జరిగిందంటే
బాశెట్టిహళ్లి పారిశ్రామికవాడ పరిధిలోని విజయనగర్ కాలనీలో నివసించే మంజునాథ్ సమీపంలోని ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. రాయచూరుకు చెందిన మంజునాథ్ భార్య విజయరంజనితో కలిసి నివసిస్తున్నాడు. వివాహం జరిగిన పదేళ్లకు గర్భం దాల్చిన భార్య ఇప్పుడు ఆరునెలల గర్భవతి అని తెలిసింది. మంగళవారం రాత్రి దీపావళి సందర్భంగా మంజునాథ్ టపాసులు కాల్చే క్రమంలో టపాసుల సరం అంటించాడు. నిప్పురవ్వల ఎగరడంతో తప్పించుకోవాలని పక్కనే ఉన్న రైలుపట్టాలపైకి పరిగెత్తాడు. అదే సమయంలో బెంగళూరు నుండి వస్తున్న కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా ఢీకొంది. దీంతో మంజునాథ్ అక్కడికక్కడే మృతిచెందాడు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్న విజయరంజని కళ్ల ముందే భర్త మరణించడంతో కన్నీరుమున్నీరైంది. సమాచారం అందుకున్న దొడ్డ రైల్వేపోలీసులు సంఘటనాస్థలాన్ని సందర్శించారు.కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment