కాసుల కళకళ.. | The art market in India is not yet to regulate | Sakshi
Sakshi News home page

కాసుల కళకళ..

Published Thu, Nov 6 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

కాసుల కళకళ..

కాసుల కళకళ..

పొదుపులో భాగంగా మదుపు చేయడం ఒక కళ. అయితే, కళలోనే మదుపు చేయడానికి ‘సిటీ’జనులు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. ఇప్పటివరకు కళాఖండాలు హోదాకు చిహ్నంగా, అలంకారప్రాయంగానే ఉంటూవస్తున్నాయి. ఇవి ఇప్పుడిప్పుడే పెట్టుబడి సాధనాలుగా మారుతున్నాయి.ఈ పరిణామం ఔత్సాహిక కళాకారులకు భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తోంది.

..:: ఎస్.సత్యబాబు
 
పికాసో చిత్రం ‘న్యూడ్ గ్రీన్ లీవ్స్ అండ్ బస్ట్’ ఎంతకు అమ్ముడయ్యిందో తెలుసా... 106 మిలియన్ డాలర్లు అంటే అక్షరాలా రూ.475 కోట్లు. ఒక కళాఖండానికి పలికిన అత్యధిక ధర ఇప్పటి వరకు ఇదే. క్రిస్టీస్ వేలంశాల నిర్వహించిన వేలంలో మన భారతీయ కళాకారుడు సయ్యద్‌హైదర్ రజా పెయింటింగ్ ‘ది సౌరాష్ట్ర’కు 3.5 మిలియన్ డాలర్లు అంటే రూ.16 కోట్లు పలికింది. అదే ఇప్పటిదాకా అత్యంత ఖరీదైన ఇండియన్ పెయింటింగ్. అంతర్జాతీయంగా, దేశీయంగా ఆర్ట్‌వర్క్‌లకు అనూహ్యమైన ధరలు పలుకుతుండటంతో సిటీలోని కళాపోషకులు ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగానూ కళాఖండాలను కొనుగోలు చేసే ట్రెండ్ మొదలైంది.

రేపటి రూటే సప‘రేటు’...
1990 ప్రాంతంలో ఎమ్‌ఎఫ్ హుస్సేన్ చిత్రాలు లక్ష రూపాయల వరకు పలికేవి. ఇప్పుడు ఆయన చిత్రాల ధర రూ.50 లక్షలకు పైమాటే. రజా, ఆంజోలీ ఇళా మీనన్, ఫ్రాన్సిస్ న్యూటన్ సౌజా వంటి ప్రసిద్ధ భారతీయ చిత్రకారుల పెయింటింగ్స్ ధరలూ అంతే. సిటీ విషయానికి వస్తే తోట వైకుంఠం, లక్ష్మాగౌడ్, సూర్యప్రకాశ్, సచిన్ జల్తారే వంటి వారి కళాఖండాలను ఎంచుకుంటున్నారు.
 
కొనుగోలు ‘కళ’...
ఇండియాలో ఆర్ట్ మార్కెట్ ఇంకా రెగ్యులేట్ కాలేదనే చెప్పాలి. అమెరికాలో అయితే కొన్న వ్యక్తే తిరిగి గ్యాలరీకి విక్రయించవచ్చు. ఇక్కడ అలాంటి అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఆర్ట్ వర్క్‌పై అవగాహన ద్వారా మాత్రమే కళాఖండాల్లో సరైన పెట్టుబడులు పెట్టగలం.

ఒక ఫేమస్ ఆర్టిస్ట్ పెయింటింగ్‌ను మనం కొంటే అది ఐదారేళ్లలో విలువ కొంత పెంచుకుంటుంది. సరైన రిటర్న్స్ రావాలంటే మాత్రం కనీసం పది నుంచి పన్నెండేళ్లు పడుతుందని ఆర్ట్స్ ట్రస్ట్ నిర్వాహకుడు సేథీ అంటున్నారు. బాగా పేరొందిన ఆర్టిస్ట్‌ల వర్క్స్ మాత్రమే కొనుగోలు చేయాలి. అలాగే ఆయా ఆర్టిస్ట్‌ల డిటైల్డ్ ఆక్షన్ హిస్టరీ తీసుకోవాలి. నిపుణులు చెబుతున్న ప్రకారం..
 
* కాన్వాస్ మీద ఆయిల్ పెయింటింగ్ అనేది వ్యయభరితమైనది. ఆ తర్వాత వ్యయ భరితమైన వాటిలో కాన్వాస్‌పై ఆక్రిలిక్, పేపర్ మీద ఆక్రిలిక్ వస్తాయి. ప్రత్యామ్నాయంగా పేపర్ మీద వాటర్‌కలర్  అయితే తక్కువ ఖరీదు ఉంటాయి. అదే పేపర్ మీద చార్‌కోల్ అయితే మరింత తక్కువ ఖరీదులో లభిస్తాయి.
* పేరున్న ఆర్టిస్ట్‌లవి అయినంత మాత్రాన అన్నీ మాస్టర్‌పీస్‌లే అయి ఉండాలని లేదు. మాస్టర్‌పీస్‌లను ఎంచుకునేటప్పుడు నిపుణుల సలహా తప్పక తీసుకోవాలి.
* ఆర్ట్ అనేది మంచి పెట్టుబడి. అయితే కేవలం పెట్టుబడి సాధనంగానే దాన్ని చూస్తే మనం మంచి పీస్‌ని కొనలేం. కేవలం విక్రయించడం అనే అంశాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోవద్దు. దీర్ఘకాలం తర్వాత అది అమ్మాలనే నిర్ణయం మారవచ్చు కూడా.
* ఆర్టిస్ట్‌లకు రకరకాల ప్రత్యేకతలుంటాయి. వాటిపై అవగాహన పెంచుకోవాలి.ఈ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా వడ్డీ, డివిడెండ్‌లు రావు. తక్కువపెట్టుబడి పెట్టాలనుకున్నవారు పేరొందిన ఆర్టిస్ట్‌లు చేసిన పేపర్‌వర్క్స్‌ను ఎంచుకోవచ్చు.
* ఆర్టిస్ట్ పెన్సిల్‌తో సంతకం చేసి ఉన్న ఒరిజినల్ ప్రింట్స్ అసలైన వాటికి నకలైనా కూడా వాటి విలువ వాటికీ ఉంటుంది.
* మార్కెట్లోకి దూసుకొస్తున్న వర్ధమాన చిత్రకారుల వర్క్స్‌పై ఒక కన్నేసి ఉంచాలి.
* అంతర్జాతీయంగా ఆర్ట్ సైకిల్ తొమ్మిదేళ్లు ఉంటుంది. అన్నాళ్లు వెయిట్ చేయడానికి సిద్ధపడాలి.
* కొనేటప్పుడు అథెంటిసిటీ సర్టిఫికెట్, అథెంటిసిటీ గ్యారంటీ, ప్రొవెనెన్స్ సర్టిఫికెట్ పరిశీలించుకోవాలి.
* మన మొత్తం ఆదాయంలో ఆర్ట్‌పై పెట్టే పెట్టుబడి 5 శాతానికి మించకూడదని ఫైనాన్షియల్ అడ్వయిజర్ కిలారి ప్రవీణ్ సూచిస్తున్నారు.
నగరంలో ఇప్పుడిప్పుడే కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు పెయింటింగ్స్ విషయంలో తగిన సూచనలు సలహాలు అందించడంతో పాటు వాటిని సురక్షితంగా స్టోర్ చేసే మార్గాలనూ సూచిస్తున్నాయి. ప్రత్యక్షంగా సూర్యకాంతి పడని చోట ఆర్ట్‌వర్క్‌ను ఉంచాలి. దీర్ఘకాలం స్టోర్ చేస్తున్నట్టయితే తరచుగా పరిశీలిస్తుండాలి.
* మొదటి సారి కొంటున్నట్టయితే ఒక ఆర్ట్ కన్సల్టెంట్ లేదా ఒక అడ్వయిజర్‌ను సంప్రదించాలి. ఖరీదైన వాటికి కన్సల్టెంట్స్ ఆర్ట్ వర్క్ విలువలో 2 నుంచి 5 శాతం ఫీజును తీసుకుంటున్నారు. చిన్నపాటి పెయింటింగ్స్‌కు 5-15 శాతం దాకా ఉంటుంది.
* పాశ్చాత్య దేశాల్లో ఆర్టిస్ట్ వర్క్స్‌కు వాల్యూని నిర్ణయించే ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. మన దగ్గర మాత్రం ఆర్టిస్ట్‌కు ఉన్న డిమాండ్, పెయింటింగ్ క్వాలిటీ, సైజ్, తయారైన సంవత్సరం.. వంటివి చూసి మాత్రమే విలువ నిర్ణయిస్తున్నారు.
* భారతీయ ఆర్ట్ మార్కెట్ రానున్న పదేళ్లలో మంచి గ్రోత్ సాధిస్తుందని నిపుణుల అంచనా.
* కనీసం ఐదేళ్లు దాన్ని అట్టేపెట్టుకున్నట్లయితే ఏడాదికి 8 నుంచి 10 శాతం రిటర్న్స్ ఇవ్వవచ్చునంటున్నారు. దీర్ఘకాలం వేచి ఉన్నవారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్ట్ పీస్‌లు ప్రత్యక్షంగా కొనడం సాధ్యపడకపోతే ఆర్ట్ ఫండ్స్‌లో కూడా పెట్టవచ్చు. ఆర్ట్‌హౌస్‌లు మ్యూచువల్ ఫండ్స్ అందిస్తున్నాయి.
* ఒకటి మాత్రం నిజం.. కళను కళగానే చూడాలి. పెట్టుబడి సాధనంగా మాత్రమే అనుకుంటే, దాని అసలైన అనుభవాన్ని ఆస్వాదించలేం. కాబట్టి, అది ఎంత రిటర్న్ ఇస్తుంది అనేదానిని బట్టి కాక  మనస్ఫూర్తిగా నచ్చిందే కొనుగోలు చేయాలి.
 
సిటీ ఆర్ట్ మార్కెట్ సత్తా
నాలుగేళ్లలో రెట్టింపు లాభాలను అందించిన వర్క్స్ కూడా సిటీ ఆర్టిస్ట్‌ల నుంచి వచ్చాయి. విదేశీ మార్కెట్ కూడా సిటీ ఆర్ట్‌కు ఊపునిస్తోంది. నగరానికి చెందిన ఒక ఆర్టిస్ట్ వర్క్ ఇటీవల రూ.35 లక్షలకు పైగా ధరకు విక్రయమవ్వడం సిటీ ఆర్ట్ మార్కెట్ సత్తాకు అద్దం పట్టింది. మేం రీసెంట్‌గా ఇన్వెస్ట్‌మెంట్‌కు అద్భుతమైన అవకాశం ఇచ్చే షోని మా తంకానత్ గ్యాలరీలో నిర్వహిస్తున్నాం. ఇవి పెట్టుబడికి రైట్ ఛాయిస్ అనే  ఉద్దేశంతో ఆర్ట్ కలెక్టర్స్ బాగా కొనుగోలు చేస్తున్నారు.

- ఫవాద్, ఆర్టిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement