హన్సిక
దక్షిణాదిలో వరుస సినిమాలతో హీరోయిన్ హన్సిక బిజిబిజిగా ఉంది. ఆ బొద్దుగుమ్మ క్షణం తీరక లేకుండా రాత్రి, పగలు షూటింగుల్లో పాల్గొంటూ వయసుకు మించి కష్ట పడుతోంది. కోలీవుడ్లో ఆఫర్ల మీద ఆఫర్లతో ఈ బబ్లీ బ్యూటీ దూసుకుపోతోంది. గత మూడేళ్ళ నుంచి ఈ బ్యూటీ ఇలానే కాలం గడుపుతోంది. ఏడాదికి కోలీవుడ్‌లో ఆరు సినిమాలు చేస్తోంది. విజయ్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తూ క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ఈ బ్యూటీ సినిమాలకు అక్కడ మంచి మార్కెట్ కూడా ఉంది. ఈ మధ్యనే మళ్లీ తెలుగుపై దృష్టి మరల్సింది. ఇక్కడ కూడా రెండు సినిమాల్లో నటించింది.
కోలీవుడ్లో వరుసపెట్టి అవకాశాలు రావడంతో హన్సిక తన పారితోషికాన్ని కూడా అమాంతం పెంచేసింది. ఈ మధ్య విడుదలైన అరణ్మణి చిత్రం తర్వాత హన్సిక పారితోషికాన్ని కోటిన్నరకు పెంచినట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ సరసన నటిస్తున్న 'గరుడ' చిత్రానికి హన్సిక కోటిన్నర తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వాణిజ్య ప్రకటనల పారితోషికం కూడా అదే స్థాయిలో పెంచేసినట్లు కోలీవుడ్ టాక్.
అధిక సినిమాలలో నటించే అవకాశం రావడంతో ఎంతో ఓర్పు, ఓపికతో రాత్రి పగలు సెట్స్లో నటిస్తోంది. ఈ విధంగా క్షణం తీరిక, విశ్రాంతి లేకుండా నటిస్తూపోతే గ్లామర్ దెబ్బతింటుంది కదా అని ఈ ముద్దుగుమ్మని అడిగితే, కష్టపడి పని చేస్తే మరింత అందంగా కనిపించే అవకాశం ఉంటుందని ముద్దు ముద్దుగా చెబుతోంది.
ఇది ఇలా ఉంటే ఈ మిల్కీ బ్యూటీకి టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు కొందరు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళంలో 'అరణ్మణి'గా సుందర్.సి దర్శకత్వంలో రూపొందించిన హారర్ కామెడీ సినిమాను తెలుగులో 'చంద్రకళ' పేరుతో విడుదల చేశారు. 'చందమామ' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బేనర్పై తెలుగులోకి అనువదించారు.