రజనీ కొత్త చిత్రంలో అనుష్క
దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన అనుష్క నటించనుంది. ఈ చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించనున్నారు. రవికుమార్ దర్శకత్వంలో జగ్గుబాయ్, రాణా అనే రెండు చిత్రాల్లో రజనీ నటించవలసి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల ఆ రెండు చిత్రాలలో ఆయన నటించలేదు. అయినప్పటికీ కోచ్చడయాన్ చిత్రానికి కథను రవికుమారే అందించారు.
పడయప్పా బాణిలో సవాలుతో కూడుకున్న ఒక చిత్రాన్ని నిర్మించాలంటూ రజనీ అభిమానులు ఆయన్ను ఎప్పటి నుంచో కోరుతున్నారు. దానికి తగిన సమయం వచ్చేసింది. రజనీకాంత్ సరసన జంటగా నటించేదుకు అనుష్క ఆనందంగా అంగీకరించారు. కాల్‌షీట్లు కోరిన వెంటనే రజనీతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం అనుష్క నటిస్తున్న రాణి రుద్రమ దేవి, బాహుబలి చిత్రాలు ముగింపు దశలో ఉన్నాయి. ఆ తరువాత ఆమె రజనీతో నటిస్తారు. ఈ కొత్త చిత్రం షూటింగ్ మే నెల తొలివారంలో ప్రారంభించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి మాస్ టైటిల్ పెట్టేందుకు రజనీతో రవికుమార్ చర్చలు జరుపుతున్నారు.
ఇదిలా ఉండగా, రజనీకాంత్, దీపికా పడుకొనే నటించిన కోచ్చడయాన్ చిత్రాన్ని ఏప్రిల్ 11వ తేదీ విడుదల చేసేందుకు నిర్ణయించారు. అయితే లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ చిత్రం విడుదలను వాయిదావేశారు. ఎన్నికల తర్వాత విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే దీని గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.