నేడు వరల్డ్ మెన్స్ డే
చక్కదనాల చుక్కడు.. వంపుసొంపుల వయ్యారుడు.. ఈ వర్ణన వింటుంటే ఇంకా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టేవాళ్లున్నారా? అయితే వాళ్లకు సిటీ మగాళ్ల తీరుతెన్నులపై అవగాహన రాలేదన్నమాట. ఆకాశంలో సగమేలే అని బుజ్జగిస్తూ అంతా ఆక్రమించే దిశగా మహిళ దూసుకొస్తుంటే.. మేమేం తక్కువ తినలేదంటూ మహిళలకే ప్రత్యేకమైన అనేకానేక విషయాల్లో మగవాళ్లు చొచ్చుకుపోతున్నారు. అందులో బ్యూటీ కాన్షియస్‌నెస్ ఒకటి.
సిసలైన భర్త..
కోడలు ఆఫీస్‌కి వెళ్లడానికి హడావిడి పడుతుండడం చూసి కొడుకుతో అంటాడు తండ్రి ‘నీకు ప్రమోషన్ వచ్చాక కూడా కోడలు ఆఫీస్‌కి వెళ్లి కష్టపడడం అవసరమా’ అని. ‘నాన్నా.. డబ్బు కోసం కాదు తన ఆనందం కోసం వర్క్ చేస్తుంది’ అని భార్యను సమర్థిస్తాడు భర్త. ఇదంతా గదిలోంచి వింటున్న కోడలు పెళ్లికి ముందు తను పంపిన ఈ మెయిల్‌లో పెళ్లి తర్వాత కూడా నేను వర్క్ చేస్తాను అని తెలిపిన తన అభిప్రాయానికి భర్త ఇస్తున్న విలువ, గౌరవం చూసి చలించిపోతుంది.
దీనికి ప్రముఖ రచయిత చేతన్‌భగత్ పర్‌ఫెక్ట్ మోడల్. చేతన్‌భగత్ భార్య అనూష అహ్మదాబాద్ ఐఐఎమ్ పట్టభద్రురాలు. బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉంది. బయట పనితోపాటు ఇంటిపనినీ బ్యాలెన్స్ చేసుకునే వీలు, సమయమూ లేని ఉద్యోగం ఆమెది. రచనా వ్యాసంగం మీద మక్కువతో జాబ్ వదిలేసిన చేతన్‌భగత్.. భార్య చూసుకోలేని ఇంటి బాధ్యతను తీసుకున్నాడు. అర్థం చేసుకునే అనుబంధానికి ఇంతకు మించిన నిర్వచనం ఏదీ?