సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వంటి పెను సవాళ్లను దేశం ఎదుర్కొంటున్న సమయంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుపై మీడియా సంయమనం పాటించాలని ప్రముఖ రచయిత చేతన్ భగత్ అన్నారు. సుశాంత్ పట్ల తనకు ఎంతో అభిమానం ఉందని, తన కెరీర్‌కు సుశాంత్ సాయం చేశాడని ఆయన చెప్పారు. సుశాంత్‌పై తనకు ప్రేమ లేదని ఎవరూ అనుకోవద్దని అదే సమయంలో దేశం పట్ల మనం జాగరూకతతో వ్యవహరించాలని వ్యాఖ్యానించారు. సుశాంత్ మృతి కేసును చర్చిస్తూ నెలల తరబడి మనం దాన్ని ప్రైమ్ టైమ్ అంశంగా చేయలేమని అన్నారు. ‘సుశాంత్ కేసును మనం కోరుకున్నట్టే ఇప్పుడు అత్యున్నత దర్యాప్తు సంస్థ విచారిస్తోంది..దీనిపై ప్రజలు తలో రకంగా మాట్లాడుతున్నారు..ఇలాంటి వాటితో సాధించేదేమీ లేద’ని చేతన్ ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ అన్నారు. ప్రతి దేశం ఆర్థిక వ్యవస్ధలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు పనిచేస్తున్నాయని, మనం కూడా సమస్యలపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు.
సుశాంత్ ఆత్మహత్య అందరికీ వినోదం పంచేలా ఉందని అన్నారు. సుశాంత్ విషాదాంతం చుట్టూ హత్యారోపణలు..ఆత్మహత్య కథనాలు, కుట్ర కోణాలు ఇలాంటివెన్నో ఆసక్తి రేపుతున్నా ఇది కథ కాదని, వాస్తవ ఘటన అని దీనిపై ఆధారాలతోనే వాస్తవాలు నిగ్గుతేలతాయని అన్నారు. ఛానెళ్లలో చర్చించే వారిని ఉద్దేశిచి ‘మీరు సీబీఐ విచారణ సవ్యంగా జరిగేలా చూడాలని లేదా సీబీఐ అవసరం లేదని కోరాలని అంతేకానీ రాత్రికి రాత్రి టీవీ చర్చల్లో కేసును మీరు పరిష్కరించలేరని ఆయన సెటైర్లు విసిరారు. ఇలాంటి విషయాలపై నుంచి మనం ఆర్థిక వ్యవస్థ, కరోనా వ్యాక్సిన్ వంటి కీలకాంశాలపై దృష్టి సారించాలని అన్నారు. ఇక కోవిడ్-19 తరుణంలో నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపైనా ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్టతరమైన పరీక్షలు విద్యార్ధులను ఆదుర్ధాకు గురిచేస్తాయని కోవిడ్ ఆందోళనలతో ఇది మరింత అధికమవుతుందని వ్యాఖ్యానించారు. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌లతో పలు ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవని పరీక్షకు కొద్దినిమిషాల జాప్యం జరిగినా విద్యార్ధుల స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు. చదవండి : సీబీఐ విచారణ సంతోషంగా ఉంది: రియా
Comments
Please login to add a commentAdd a comment