గిరికాంతులు
గిరిలో సోయగం అక్కడి పచ్చని ప్రకృతిలోనే కాదు.. గిరికాంతలు వేసుకునే సంప్రదాయ దుస్తుల్లోనూ కనిపిస్తుంది. కొండకోనలు దాటని ఈ వస్త్ర సౌరభం ఇప్పుడు ఎల్లలు దాటుతోంది. సంప్రదాయ వస్త్ర శైలులు, కళలకు సిటీ డిజైనర్లు ‘చే’యూతను అందిస్తుండడంతో పోచంపల్లి, మల్కా దగ్గర్నుంచి.. ఇన్నాళ్లూ ఎవరూ కన్నెత్తి చూడని గిరిజన ప్రాంతపు ట్రైబల్ ఫ్యాషన్ సైతం ఇంటర్నేషనల్ వెన్యూలపై మెరిసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే.. తొలిసారి తెలంగాణ ప్రాంత లంబాడా వస్త్రశైలులను సరిహద్దులు దాటిస్తున్నారో సిటీ డిజైనర్.
..:: ఎస్.సత్యబాబు
కెనడాలో జరిగే వాంకోవర్ ఫ్యాషన్ వీక్‌లో మరోసారి తన కలె క్షన్స్‌ను ప్రదర్శించబోతున్న శ్రవణ్ రామస్వామి.. ఈ సారి ‘ట్రిబ్యూట్ టు ది ట్రైబ్స్ ఆఫ్ ఇండియా’ కాన్సెప్ ్టను ఎంచుకున్నారు. గిరిజనుల జీవనశైలిని ప్రతిబింబించేలా గుజరాత్‌లోని కచ్, తెలంగాణ, కర్ణాటకలలో కనిపించే లంబాడా వస్త్రధారణలను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆదివారం ప్రారంభమైన ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనేందుకు శనివారం కెనెడా బయల్దేరి వెళ్లారు. ఈ నెల 21న తన ‘షో’ ఉంటుందని శ్రవణ్ సిటీప్లస్‌కు చెప్పారు.
కలెక్షన్.. కలర్‌ఫుల్..
ఈ షో కోసం శ్రవణ్ కలర్‌ఫుల్ కలె క్షన్‌ని రూపొందించారు. మిర్రర్స్, థ్రెడ్ ఎంబ్రాయిడరీ, బీడ్ వర్క్‌ల మేళవింపుగా రూపొందిన డిజైన్లు ఇవి. బ్రైట్ రెడ్, ఎల్లో, బ్లాక్, రంగుల్లో కలర్డ్ క్లాత్ బ్యాండ్స్, వైట్ క్రిస్‌క్రాస్ స్టిచ్‌తో కలిపి, నేత శైలికి అనుగుణంగా స్టైల్ ప్యాటర్న్స్, డిజైన్స్ కలిగిన కలె క్షన్. జామెట్రిక్ ప్యాటర్న్స్, డిజైన్స్ వినియోగంతో వీటికి విభిన్నమైన టెక్చర్డ్ ఎఫెక్ట్ వచ్చి, క్రాస్ స్టిచ్ ద్వారా మోటిఫ్స్ హైలైట్ అయ్యాయి. చాలా వరకూ ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్ వినియోగించడం విశేషం. సిల్క్- శాటిన్, హ్యాండ్ స్పన్ కాటన్‌ల డెలికేట్ ఫ్యూజిన్ ఇది. పాత కాలం నాటి భారతీయ వస్త్రశైలికి ఈ చేనేతలు అద్భుతమైన ఆకర్షణలు అద్దాయి. సినీ నటి రెజీనా, మనస్విని సహా మరికొందరు మోడల్స్ శ్రవణ్ లేటెస్ట్ కలె క్షన్‌ను ప్రమోట్ చేస్తున్నారు.
నో వర్డ్స్.. ఓన్లీ వర్క్స్..
ట్రైబల్ ఫ్యాషన్ అంటేనే వైవిధ్యభరితమైన రంగులు, కళలు, చిత్రాల కలయిక. ట్రైబల్ ఎంబ్రాయిడరీ చిత్రమైన కళా రూపాలతో నిండిపోయిన అత్యంత అందమైన టెక్స్‌టైల్ ఆర్ట్. ప్రతి ట్రైబ్‌కి ఒక్కో ఎంబ్రాయిడరీ స్టైల్ ఉంటుంది. ప్రతి కొండప్రాంత సంస్కృతికీ దానికంటూ ప్రత్యేకించిన సిగ్నేచర్ వర్క్స్ ఉన్నాయి. వీటిలో రొమాంటిక్ చిత్రాలు, నృత్య భంగిమలు, నెమళ్ల నృత్యాలు వంటివెన్నో కనిపిస్తుంటాయి. శ్రవణ్ కలెక్షన్స్‌లోనూ వన్యప్రాణుల నుంచి స్ఫూర్తి పొందిన పర్షియన్, మొఘలాయి ఆర్ట్స్ ఆధారిత డిజైన్లు కనువిందు చేస్తున్నాయి.
డెలికేట్ బీడ్ వర్క్ కూడా దీనిలో ఒక గొప్ప విశేషం. కాటన్, సిల్క్ వస్త్రాల మీద ఈ వర్క్స్ చేస్తారు. లంబాడా ఎంబ్రాయిడరీ ప్రధానంగా గ్రీన్, ఐవరీ, ఇండిగో, బ్లాక్, డీప్‌రెడ్, ఎల్లో, వైట్ కలర్స్‌లో సాగుతుంది. ఈ వర్క్ విధానమే ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఒక ఫ్రేమ్ మీద ఫ్యాబ్రిక్‌ను స్ట్రెచ్ చేస్తూ, పొడవాటి సూదిని ఉపయోగించి స్టిచ్చింగ్ చేసే ఆరి వర్క్ ఆధునికులు నేర్చుకోవడం అంత సులభం కాదు. ఇక జామెట్రిక్ ఎంబ్రాయిడరీని ఆవిష్కరించే కచ్‌వర్క్ పూర్తిగా ఇంటర్‌లే సింగ్‌తో ఉంటుంది. అర్మేనియా నుంచి పుట్టిన టెక్నిక్‌గా దీన్ని చెబుతారు. అది అలా అలా గుజరాత్ చేరిందట.
తండాలకు వెళ్లి..
నా లేటెస్ట్ కలెక్షన్స్ కోసం తెలంగాణలోని మారుమూల పల్లెల్లోని లంబాడీ తండాలను సందర్శించి, వారి జీవనశైలుల్ని పరిశీలించాను. ఆ వస్త్రశైలులు అద్భుతంగా అనిపించాయి. తమకు లభిస్తున్న ఆదరణ సంపాదనలతో సంబంధం లేకుండా తరాల తరబడి తమ ఆవిష్కరణలు కొనసాగించడానికి గ్రామాల్లోని వీవర్స్ శ్రమిస్తున్నారు. సంప్రదాయాలకు దూరం జరగకుండానే మార్పులకు తగ్గట్టుగా తమను తాము మలచుకుంటున్నారు. అందుకే వీరికి మద్దతుగా వీవర్స్ వెల్ఫేర్ కోసం ఆలయం సొసైటీ ఏర్పాటు చేశాను.
- శ్రవణ్ రామస్వామి, ఫ్యాషన్ డిజైనర్