యుద్ధము ముగియలేదు ప్రభూ!; ఇప్పుడే ఆరంభమైనది!! | War began | Sakshi
Sakshi News home page

యుద్ధము ముగియలేదు ప్రభూ!; ఇప్పుడే ఆరంభమైనది!!

Published Thu, Apr 16 2015 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 12:20 AM

ఉషా యస్ డానీ

ఉషా యస్ డానీ

 సందర్భం
  చంద్రబాబు తొలివిడత పాలన అనగానే రైతులకు కాల్దారి కాల్పులు, వామపక్షాలకు బషీర్‌బాగ్ కాల్పులు, విప్లవకారులకు కొయ్యూరు ఎన్‌కౌంటర్ గుర్తుకు వస్తాయి. వారి మలివిడత పాలనలో పోలీసు కాల్పులు శేషాచలంతో మొదలయ్యాయి.
 
  వానపాముని చూపించి అన కొండ అనిపించడానికీ, ఎలుక ను చూపించి డైనోసార్ అని పించడానికీ, కూలీల్ని చూపిం చి అంతర్జాతీయ స్మగ్లర్లు అనిపించడానికీ, ఒక వాస్తవా న్నీ అబద్ధం చేయడానికీ, ఒక అబద్ధాన్ని నిజం అనిపించడా నికీ సమస్త అధికారగణాలన్నీ ఇప్పుడు ఏకం అవుతున్నాయి. అందరికీ తెలుసు వాళ్లు చెట్లు నరికే కూలీలని. అందరికీ తెలుసు స్మగ్లర్లు ఎండా కాలం అడవిలో గోచి చుట్టుకుని, గొడ్డళ్లుపట్టి, చెమట కక్కుకుంటూ చెట్లు నరికే శ్రమజీవులు కారనీ. వాళ్లు కాళ్లకు చెప్పులు, ఒంటి మీద చొక్కాలు లేని కడు పేదరి కంలో ఉండరనీ. అందరికీ తెలుసు ఎర్రచందనం స్మగ్లర్లు చెన్నైలోనో, బెంగళూరులోనో నక్షత్రాల హోటళ్ల లో విలాసాలు చేస్తుంటారని. వాళ్లు దొరికితే మారిషస్ లోనో, రాజమండ్రి సెంట్రల్ జైల్లోనో రాజభోగాలు అనుభవిస్తూ ఉంటారని.

 ఎర్రచందనం వృక్షాలు ప్రపంచంలో నల్లమల అడవులు విస్తరించిన నాలుగు జిల్లాలకే ప్రత్యేకం అయి నా వాటి ఉపయోగాల గురించి పదేళ్ల క్రితం వరకు మన రాష్ట్రంలో ఎవరికీ తెలీదు. ఎర్రచందనానికి సంబంధించి ఇటీవల బయటపడిన రెండు ప్రధాన ఉపయోగాల్లో మొదటిది దీని పొడిని అణువిద్యుత్ కేంద్రాల్లో వినియో గిస్తున్నారనేది. రెండో ప్రయోజనం అంతకన్నా ఆసక్తిక రమైనది. ఎర్రచందనం పొడికి లైంగిక పటుత్వాన్ని పెంచేగుణం ఉందనేది. దీనికి శాస్త్రీయ ప్రతిపత్తి ఉందో లేదోగానీ, జపాన్‌లో మాత్రం ఈ నమ్మకం బలంగా ఉంది. లైంగిక ఆసక్తి అతితక్కువగల దేశంగా జపాన్‌ను పేర్కొంటూ ‘ద గార్డియన్’, ‘వాషింగ్టన్’ పోస్ట్ పత్రికలు రెండేళ్ల క్రితం రెండు సంచలన కథనాలు ప్రచురిం చాయి. ఎర్రచందనం కోసం జపాన్ చూపుతున్న ఆసక్తిని గమనిస్తే ఈ కథనాలు నిజమే అనిపిస్తాయి. స్మగ్లర్ల ద్వారా దొంగమార్గంలో కొన్నా, ప్రభుత్వం ద్వారా రాజమార్గంలో కొన్నా ఎర్రచందనం ప్రధాన దిగుమతి దారుడు మాత్రం జపానే.

 ఇప్పుడు ఎర్రచందనం నిల్వలకు మరో ప్రాధాన్యం వచ్చింది. రాష్ట్రంలో హైదరాబాద్‌ను మించిన రాజధాని నగరాన్ని కట్టాలని చంద్రబాబు కన్న కలల మీద నరేంద్రమోదీ చల్లటి మంచునీళ్లు చల్లారు. చంద్రబాబు ఇప్పుడు రాజధాని ఆశలన్నీ ఎర్రచందనం మీదే పెట్టుకు న్నారు! జపాన్, చైనాలకు ఎర్రచందనాన్నీ అమ్మి రాజ ధాని నిర్మాణానికి నిధుల్ని సమీకరించుకునే పనిలో వారున్నారు. ఏపీ రాజధాని నిర్మాణంలో తమకూ అవ కాశం ఇవ్వాలని జపాన్ కూడా సింగపూర్‌తో పోటీపడు తోంది. అలా నల్లమల టూ జపాన్, జపాన్ టూ అమరా వతి అంటూ ఒక రక్తచందనపు దారి ఏర్పడింది. గిరాకీ పెరగడంతో, ఏపీ రాజధాని నిర్మాణం ఎర్రచందనం కూలీల చావుకొచ్చింది. అమరావతిలో భూమిపూజకు ముందే శేషాచలంలో ‘నరబలి’ జరిగిపోయింది!.

 ‘‘వాళ్లు ఎర్రచందనం దొంగలు కాకుంటే గడ్డి కోసుకోవటానికి ఏమైనా తమిళనాడు నుంచి శేషాచలం అడవులకు వచ్చారా?’’ అని అటవీశాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎగతాళి చేశారు. వాళ్లు కూలీ డబ్బుల కోసం ఎర్రచందనం చెట్లు నరకడానికే వస్తారు. అనుమ తి లేకుండా అడవిలో ఏ చెట్టును నరికినా నేరమే. ఎర్రచందనం చెట్టును నరికినా నేరమే. ఆ విషయం ఆ కూలీలకు కూడా తెలుసు. అయినా, బ్రోకర్లు చూపించే ఆశను కాదనలేని పేదరికం వాళ్లది. నేరంలో వాళ్లు నిస్సందేహంగా పాత్రధారులు. అయితే ఆ నేరానికి వాళ్లు సూత్రధారులు మాత్రం కాదు. ప్రధాన లబ్దిదా రులు అంతకన్నా కాదు. సూత్రధారులు, ప్రధాన లబ్ధిదా రులు నిజానికీ అధికారవర్గం నీడలోనే ఉంటారు. లేదా అధికారవర్గమే ప్రధాన లబ్ధిదారులు, సూత్రధారుల నీడల్లో ఉంటుంది. నిజానికి శేషాచలం అడవుల్లో పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఆ 20 మంది అలా నేరం చేయడానికి వచ్చినవాళ్లు కూడా కాదు. బస్సులో ప్రయా ణిస్తున్న వాళ్లను పోలీసులు దారిలో ఆపి ఎత్తుకుపోతుం డగా చూసినవాళ్లున్నారు.  అంటే నేరం చేసినందుకుకాక నేరం చేయబోతున్నారనే అనుమానంతోనే వాళ్లను పోలీసులు చంపేశారు అనుకోవాలి.

 గీత దాటిన పేదవాళ్లను అక్కడికక్కడే అధికారి కంగా చంపవచ్చు అనే మధ్యయుగాల శిక్షాస్మృతిని రాష్ట్ర ప్రభుత్వం అనధికారికంగా ప్రవేశపెట్టింది. శేషాచలం ఎన్‌కౌంటర్ ‘‘అంతం కాదు ఆరంభమే’’ అని అటవీ శాఖ మంత్రి అంటున్నారు. నిజానికి చంద్రబాబు తొలివిడత పాలన అనగానే రైతులకు కాల్దారి కాల్పులు, వామపక్షాలకు బషీర్‌బాగ్ కాల్పులు, విప్లవకారులకు కొయ్యూరు ఎన్‌కౌంటర్ గుర్తుకు వస్తాయి. వారి మలివిడత పాలనలో పోలీసు కాల్పులు శేషాచలంతో మొదలయ్యాయి. కాల్దారీలో ఇద్దరు రైతులు చనిపోతే, శేషాచలంలో చెట్లు నరికే కూలీలు 20 మంది చనిపోయారు.  మలివిడత ఆరంభమే ఈ స్థాయిలో ఉంటే ముగింపు ఏస్థాయిలో ఉంటుందో ఊహించడానికే భయంగా ఉంది. పోలీసు కాల్పులు, ఎదురుకాల్పులు ప్రభుత్వ కార్యక్రమంగా మారినప్పుడు ప్రజలు కూడా వాళ్ల కార్యక్రమాన్ని రూపొందించుకుంటారు. యుద్ధము ముగియలేదు; ఇప్పుడే ఆరంభము అయినది!!

 (రచయిత సీనియర్ పాత్రికేయుడు)
 మొబైల్ : 9010757776

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement