మూజువాణీ ఓటుకు కారకులెవరు?
రాజ్యసభలో మూజువాణీ ఓటు తీసుకోడానికి.. తెలంగాణ బిల్లు దాంతోనే ఆమోదం పొందడానికి కారకులెవరు? కేవలం తెలుగుదేశం పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల సభ్యులేనని పరోక్షంగా డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ స్పష్టం చేశారు. బిల్లుపై డివిజన్ కావాలని, ఓటింగ్ నిర్వహించాల్సిందేనని బీజేపీ తరఫున మాట్లాడిన సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి పదే పదే పట్టుబట్టారు. వారితోపాటు తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కూడా బిల్లుపై ఓటింగ్ నిర్వహించి తీరాలన్నారు. చర్చకు అనుమతినిచ్చి, అన్నిరకాల వాదనలు వినిపించేందుకు మార్గం సుగమం చేసిన పీజే కురియన్.. ఓటింగుకు మాత్రం అనుమతించలేదు.
సభ ఏమాత్రం అదుపులో లేదని, వెల్లో ఇంతమంది సభ్యులు ఉండగా ఓటింగ్ నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. వారిని వెనక్కి పంపించే బాధ్యత తనదొక్కడిదే కాదని, ఇతర సభ్యులు కూడా వారిని వెనక్కి రప్పించేందుకు కృషి చేయాలని పదే పదే కోరారు. ఆ సమయంలో సీనియర్ నాయకులు ఎంతగా చెప్పినా, ఇరు ప్రాంతాలకు చెందిన టీడీపీ సభ్యులు.. ముఖ్యంగా సుజనా చౌదరి, గుండు సుధారాణి తదితరులు మాత్రం అక్కడి నుంచి కదల్లేదు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ పదే పదే డిప్యూటీ చైర్మన్తో నేరుగా వాగ్వాదానికి దిగి, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ ఉన్నారు. దాంతో సభ అదుపులో లేదని సాకు చూపించి.. మూజువాణీ ఓటునే రాజ్యసభలో కూడా చేపట్టారు. దీంతో అసలు బిల్లుకు ఎంతమంది అనుకూలంగా ఉన్నారో, మరెంతమంది వ్యతిరేకంగా ఉన్నారో తెలియకుండానే, ఏదో సాధారణ బిల్లులను ఆమోదించినట్లుగా ఇంత పెద్ద రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీల్చేసేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించి పారేశారు. అలా కాకుండా సభ అదుపులో ఉన్నట్లయితే మాత్రం కనీసం రాజ్యసభలోనైనా ఎంతోకొంత న్యాయం జరిగినట్లు ఉండేది.
లోక్సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఏం చర్చ జరిగిందో, ఎలా ఓటింగ్ జరిపారో ఎవరికీ తెలియదు. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయడం వల్ల ఆ పరిస్థితి ఏర్పడింది. కానీ, రాజ్యసభలో మాత్రం అలా కాదు. సభలో ఏం జరుగుతోందన్నది యావద్దేశం చూస్తూనే ఉంది. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసంగా కూర్చున్నారు. మౌనముని మన్మోహన్ సింగ్ ధ్యానముద్రలో ఉన్నట్లుగా కనిపించారు. జైరాం రమేష్ లాంటి వాళ్లు మాత్రం కాస్త ఉద్వేగంగా కనిపించారు. అరుణ్ జైట్లీ లాంటి బీజేపీ సీనియర్ నేతలు చర్చలో పాల్గొని కీలకాంశాలు లేవనెత్తారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం అసలు చర్చలో పాల్గొనలేదు సరికదా.. మూజువాణీ ఓటు రావడానికి కారకులై విభజనకు చేతులారా గొడ్డలి అందించినట్లయింది!!