రాజ్యసభలో తెలంగాణపై గందరగోళం
తెలంగాణ బిల్లు అంశం గురువారం నాడు రాజ్యసభలో గందరగోళానికి కారణమైంది. రాజ్యసభ నాలుగోసారి వాయిదా పడటానికి ముందు తెలంగాణ బిల్లు ఎక్కడంటూ సుజనా చౌదరి అడిగారు. దాంతో బిల్లు గురించి టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అడుగుతున్నారంటూ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని రాజ్యసభలో బీజేపీ ఆందోళన చేసింది. ఈ గందరగోళం మధ్య రాజ్యసభ అరగంట వాయిదాపడింది. వియ్ వాంట్ తెలంగాణ బిల్లు అంటూ సుజనాచౌదరి నినాదాలు చేశారు.
ఈలోపు.. కాంగ్రెస్-బీజేపీ మధ్య సమాలోచనలు కొలిక్కి రాకపోవడంతో చాలాసేపు రాజ్యసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టలేదు. దీంతో తెలంగాణ బిల్లు ఎక్కడని బీజేపీ సభ్యులు ప్రశ్నించారు. తనను అడుగుతారేంటి, ప్రభుత్వాన్ని అడగండని...బీజేపీ సభ్యులకు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సూచించారు. తర్వాత ఎట్టకేలకు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఆ సమయంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు షిండేకు అడ్డుగా వెళ్లేందుకు ప్రయత్నించగా, అచ్చం లోక్సభలో జరిగినట్లే, ఇతర రాష్ట్రాలకు చెందిన కొంతమంది సభ్యులు వారిని వెనక్కి తోసేశారు. ఇక రాజ్యసభలో కూడా తెలుగుదేశం పార్టీ తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని మరోసారి చాటుకుంది. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని గుండు సుధారాణి బ్యానర్ పట్టుకుని నిలబడగా, సుజనా చౌదరి తదితరులు మాత్రం వుయ్ వాంట్ యునైడెట్ ఆంధ్రప్రదేశ్ అంటూ డిప్యూటీ ఛైర్మన్తో పదే పదే వాదిస్తూ వచ్చారు. మరోవైపు ఇటీవలే రాజ్యసభ సభ్యత్వం మళ్లీ పొందిన కేవీపీ రామచంద్రరావు కూడా సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్లకార్డు పట్టుకుని వెల్లో నిలబడ్డారు. ఇక కేంద్ర మంత్రి చిరంజీవి ఎప్పటిలాగే తన స్థానంలోనే నిలబడి నిరసన వ్యక్తం చేశారు.