కొద్ది రోజుల కోసం కొత్త ప్రభుత్వం ఎందుకు?
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద చిక్కే వచ్చిపడింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎటూ తేల్చుకోలేక పోతోంది. కొత్త సర్కార్‌ను ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాలంటూ సీమాంధ్ర మంత్రులు ఏకంగా ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీనే కోరారు. అయితే కొద్ది రోజుల కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రతిష్ట దెబ్బతింటుందేమే అని అధిష్టానం ఆందోళన. సమీకరణాలు అనుకూలించకపోతే రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. కిరణ్ చేసి వారం దాటినా ఇంకా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం తమ హై కమాండ్ వైఫల్యమే అని కాంగ్రెస్ సీనియర్లే అంగీకరిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్ హై కమాండ్ ఎటూ తేల్చుకోలేక పోతోంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగలేనని, తనని తప్పించండంటూ సిఎం కిరణ్ గవర్నర్‌కు లేఖ రాయడంతో అధిష్టానంపై ఒత్తిడి ఎక్కవైంది. ఈ విషయంలో అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉందని అర్ధమవుంతోంది. మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూలు వెలువడనున్న నేపధ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలా? ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా ? అనే విషయం కాంగ్రెస్ కోర్ కమిటీ, వర్కింగ్ కమిటీ , కేంద్ర మంత్రి మండలి సమావేశాల్లో సమీక్షించినప్పటికీ ఒక నిర్ణయానికి మాత్రం రాలేకపోయారు.
సిఎం రాజీనామా చేసిన నేపధ్యంలో అధ్యక్ష పరిపాల విధించడం ఒక్కడే మార్గమని గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇచ్చారు. అయితే ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర మంత్రులు ఒత్తిడి చేయడం వల్లహై కమాండ్ నిర్ణయం తీసుకోలేక పోయింది. సిఎం కిరణ్ రాజీనామా చేయగానే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పడిపోయిందంటే దేశ వ్యాప్తంగా పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని రాష్ట్ర మంత్రుల ఆందోళన. కాంగ్రెస్ ఇమేజ్ కాపాడుకోవాలంటే రాష్ట్రపతి పాలన విధించకుండా ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు చేయాలనేది వారి వాదన. కొత్త ప్రభుత్వం ఏర్పడితే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను ఉపసంహరించుకునే అవకాశం ఉందన్నది వారి అభిప్రాయం. టిఆర్‌ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎటూ మద్దతిస్తారని, అందువల్ల ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మంచిదని వారి వాదన.
పార్లమెంట్‌తో పాటే ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే ఆస్కారమున్నందున, మే నెలాఖరు వరకు పదవిలో ఉండేలా సమైక్య రాష్ట్రానికే కొత్త సిఎం రావచ్చనేది వారి అంచనా. విభజన నేపథ్యంలో ప్రజల్లోకివెళ్లాలంటే పదవులు ఉండాల్సిందేనని సీమాంధ్ర మంత్రుల చెబుతున్నారు. సిఎం పదవికి ఎస్సి కేటగిరీలో డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహా, కాపు కేటగిరిలో కేంద్ర మంత్రి చిరంజీవి పేర్లను కూడా పరిశీలించారని తెలుస్తోంది. సీమాంధ్ర మంత్రులు చిరంజీవికి ముఖ్యమంత్రి పదవిస్తే తమ ప్రాంతంలో పార్టీ క్యాడర్‌కు కాస్త ధైర్యంగా ఉంటుందని చెబుతున్నారు. ఒక దశలో చిరంజీవి పేరు ఖరారైనట్లు కూడా తెలుస్తోంది.
ఎన్నికల షెడ్యూలు వెలువడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి విధాన పరమైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. అలాంటపుడు సర్కార్ ఏర్పాటుతో కాంగ్రెస్‌కు వచ్చే ప్రయోజనమేంటని సోనియా హై కమాండ్ పెద్దలను ప్రశ్నించినట్టు సమాచారం. రాష్ట్రపతి పాలనకే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో గవర్నర్ పాలనా? ప్రభుత్వ ఏర్పాటా? అనే నిర్ణయం తీసుకోవాల్సింది ఒక్క సోనియా గాంధీ మాత్రమే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ విషయం మరో రెండు రోజుల్లో తేలిపోతుందని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆశిస్తున్నారు.
s.nagarjuna@sakshi.com