గ్రీన్ వారియర్.. మహిళా జర్నలిస్ట్‌ | Woman journalist Prabhat writes Investigating reporting news | Sakshi
Sakshi News home page

గ్రీన్ వారియర్

Published Thu, Jul 24 2014 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM

గ్రీన్ వారియర్.. మహిళా జర్నలిస్ట్‌

గ్రీన్ వారియర్.. మహిళా జర్నలిస్ట్‌

బహార్.. జగం తెలుసుకోవాల్సిన ఈ జర్నలిస్ట్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా.. వాళ్ల అమ్మ ప్రభాదత్ గురించి తెలుసుకోవాలి. హిందుస్థాన్ టైమ్స్‌లో ఇన్వెస్టిగేషన్ రిపోర్టింగ్‌తో సాహసాలు రాసింది.  ఇండియా, పాకిస్థాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎడిటర్ పర్మిషన్ కోసం ఎదురుచూడకుండా అద్భుతమైన కథనాలతో యుద్ధాన్ని కవర్ చేసిన మొదటి మహిళా జర్నలిస్ట్‌గా చరిత్రలో నిలిచింది. తల్లి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బర్ఖాదత్ కూడా కార్గిల్ యుద్ధానికి లైవ్ రిపోర్టింగ్ ఇచ్చింది. ఆమె చెల్లెలే.. బహార్.  ఖైరతాబాద్‌లోని స్టాఫ్‌కాలేజ్‌లో ఓ వర్క్‌షాప్‌లో పాల్గొనడానికి వచ్చిన బహార్‌దత్ గురించి ..
 
 బహార్ దత్ పూర్వీకులు దేశ విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి ఢిల్లీ వచ్చి స్థిరపడిన సింధీలు. ఆమె తాత గోపాల్‌కిషన్‌దత్ స్వాతంత్య్ర సమరయోధుడు..అటు తర్వాత రాజకీయ నేత. తల్లి, అక్కా జగమెరిగిన జర్నలిస్టులు. ఆ ఇంట పుట్టిన బహార్ మరో కోణాన్ని ఆవిష్కరించాలనుకుంది. పచ్చదనం అన్నా.. దాని పరిరక్షణ అన్నా ఆమెకు ఇష్టం. అందుకే వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ అనే సంస్థలో చేరింది. సంచార జాతుల్లో ఒకరైన పాములు పట్టే వాళ్లకు పునరావాసం కల్పించే పని పెట్టుకుంది. అడవులు అంతరించిపోతున్నాయి. టైగర్ జోన్స్ హైవేలుగా మారుతున్నాయి. పర్యావరణం మీద ప్రజలకు అవగాహన కల్పించాలంటే జర్నలిజమే కరెక్ట్ అని.. కలం పట్టింది. ఇదంతా 2005 నాటి ముచ్చట.
 
 సీఎన్‌ఎన్ ఐబీఎన్‌తో..
 జర్నలిజంలోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న బహార్.. తాను ఫలానా ప్రభాదత్ కూతురనో, బర్ఖాదత్ చెల్లెలిననో చెప్పుకోలేదు. పేరు చివరన కూడా దత్ చేర్చలేదు. సీఎన్‌ఎన్ ఐబీఎన్‌లో ఎన్విరాన్‌మెంట్ రిపోర్టర్‌గా అవకాశం వచ్చింది. అపాయింట్‌మెంట్ ఆర్డర్ తీసుకున్న బహార్.. తిన్నగా చానల్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్‌దేశాయ్ దగ్గరకు వెళ్లి ‘పొలిటికల్ యాంగిల్‌లో ఎన్విరాన్‌మెంట్ రిపోర్టింగ్ చేస్తాను’ అని చెప్పింది.
 
 తొలి అడుగే సంచలనం
 వృత్తిలో చేరగానే అమె మొదట గురిపెట్టింది అప్పటి ఉత్తరప్రదేశ్ సీఎం ములాయం సింగ్ యాదవ్ మీదే. పచ్చటి అడవిని ఎయిర్ పోర్ట్‌గా మారుస్తున్న వైనాన్ని  నిలదీసింది. ఆ స్టోరీ టెలికాస్ట్ అయిన మూడు రోజులకే ఎయిర్‌పోర్ట్ నిర్మాణం ఆగిపోయింది. అలా జర్నలిజంలో తొలి అడుగు విజయంతో మొదలుపెట్టింది. ‘అప్పుడందరూ ములాయంతో పెట్టుకుంటావా అని బెదిరించారు. అయినా నేనేం భయపడలేదు. రెండో స్టోరి గిర్ అడవులకు సంబంధించి! అదీ కలకలంరేపింది. తర్వాత శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట పవర్ ప్లాంట్ మీదా కథనమిచ్చాను.
 
 దాన్ని ఎక్కడ ఇగ్నోర్ చేస్తారేమోనని అది లోకల్ స్టోరీ కాదు నేషనల్ స్టోరీ అని మా ఎడిటర్‌తో డెరైక్ట్‌గా చెప్పాను. గోవాలోని ఓ మైనింగ్ కంపెనీ మీద చేసిన స్టోరీ చేస్తున్నప్పుడైతే నా మీద దాడి కూడా జరిగింది. కొందరు గూండాలు వచ్చి మా  కెమెరాను లాక్కున్నారు. ఖాళీ టేప్‌లు ఇచ్చి అక్కడి నుంచి తప్పించుకున్నాం.  నా ఎనిమిదేళ్ల జర్నలిజం చేసింది పది స్టోరీలే. వేటికవే సంచలనాలు’ అని బహార్ తన వృత్తిగతం చెప్పుకొచ్చింది. ఇన్‌ఫ్లుయెన్స్ నాపై పడకుండా చూసుకుంటాను. ఇండిపెండెంట్‌గా ఆలోచిస్తేనే రాణించగలం. ప్రస్తుతం నేను రాసిన ‘గ్రీన్ వార్స్’ అనే పుస్తకం ప్రమోటింగ్‌లో ఉన్నాను’ అంటూ తన జర్నో జర్నీ గురించి చెప్పింది బహార్.
 - సరస్వతి రమ
 ఫొటో: సృజన్ పున్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement