సంగ్రామం :అంతా ఈ ముగ్గురి వల్లే!
బలమైన కారణం ఏమీ లేకుండానే మొదటి ప్రపంచ యుద్ధాన్ని రుద్దిన విల్‌హెల్మ్ (జర్మనీ), జార్జి ప్రభువు (ఇంగ్లండ్), నికోలస్(రష్యా) మధ్య రక్తసంబంధం ఉందంటే నమ్మగలమా! కానీ అది వాస్తవం.
మొదటి ప్రపంచ యుద్ధం ప్రస్తావన వస్తే మొట్టమొదట మూడు దేశాలూ, వాటి పాలకుల పేర్లూ గుర్తుకు వస్తాయి. వారే, జర్మనీ నియంత రెండో విల్‌హెల్మ్, ఇంగ్లండ్ పాలకుడు ఐదో జార్జి, రష్యా చక్రవర్తి జార్ రెండో నికోలస్. వీలైనన్ని దేశాలని యుద్ధంలోకి దింపి ‘ప్రపంచ యుద్ధం’ అన్న పేరును సార్థకం చేసిన ఘనత ఈ మూడు దేశాలకే దక్కుతుంది. ఆ తరువాతే టర్కీ, ఇటలీ, అమెరికా, సెర్బియా, ఆస్ట్రియా-హంగెరీ వంటి దేశాల పేర్లు పరిగణనలోనికి వస్తాయి.
ముందుండి సేనలను నడిపించినా... ఇంగ్లండ్, జర్మనీ, రష్యాలకు మొదటి ప్రపంచ యుద్ధ ‘తక్షణ కారణం’తో నేరుగా ఎలాంటి సంబంధమూ లేదు. ఆస్ట్రియా-హంగెరీ రాజ్య వారసుడు ఫ్రాంజ్ ఫెర్డినాండ్‌నీ, ఆయన భార్య సోఫీనీ బోస్నియా రాజధాని సరాయేవోలో సెర్బు జాతీయవాది, బ్లాక్‌హ్యాండ్ ఉగ్రవాద సంస్థ సభ్యుడు గవ్‌రిలో ప్రిన్సిప్ కాల్చి చంపడమే మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం. ఈ కారణంతోనే సెర్బు ఉగ్రవాదులకు ఊతమిచ్చిన సెర్బియా మీద ఆస్ట్రియా-హంగెరీ చక్రవర్తి ఫ్రాంజ్ జోసెఫ్ యుద్ధం ప్రకటించాడు. ఎనభయ్ ఏళ్ల వయసులో యుద్ధం ప్రకటించడానికి సందేహిస్తున్న ఆస్ట్రియా చక్రవర్తి ఫ్రాంజ్ జోసెఫ్ చేత యుద్ధం ప్రకటించేటట్టు చేసినవాడు జర్మనీ చక్రవర్తి విల్‌హెల్మ్.
యువరాజు ఫెర్డినాండ్, విల్‌హెల్మ్ మంచి స్నేహితులే. ఫెర్డినాండ్ హత్యకు కేవలం వారం రోజుల ముందు విల్‌హెల్మ్ తన స్నేహితుడిని వియన్నాలోనే కలుసుకున్నాడు. జర్మనీ, ఆస్ట్రియా-హంగెరీల మధ్య మంచి బంధమే ఉంది కూడా. కానీ, అపార సైన్యం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న జర్మనీ ‘బ్లాంక్ చెక్’ ఇచ్చి ఆస్ట్రియా - హంగెరీని యుద్ధానికి పురికొల్పడానికి ఆ స్నేహబంధం ఒక్కటే కారణం కాదు. బాల్కన్ యుద్ధాలకు (1912-13) కీలకంగా ఉండి టర్కీ ఓటమికి కారణమైన సెర్బియా మీద విల్‌హెల్మ్‌కు ఉన్న పగ అసలు కారణం. టర్కీతో విల్‌హెల్మ్ గాఢమైన బంధం ఏర్పరుచుకున్నాడు. కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న టర్కీని ఆదుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు కూడా. తనని తాను టర్కీ రక్షకుడినని ప్రకటించుకున్నాడు. చివరకు తాను ఇస్లాం సంరక్షకుడినని కూడా విల్‌హెల్మ్ చెప్పుకున్నాడు. (కొన్ని పత్రికలైతే విల్‌హెల్మ్ ఇస్లాం స్వీకరిస్తాడని వ్యంగ్యంగా రాశాయి). కానీ ఇవన్నీ విల్‌హెల్మ్ గుండె నుంచి వచ్చిన మాటలు కాదు. టర్కీతో విల్‌హెల్మ్ నెరప దలుచుకున్న బంధం వెనుక ఉన్నది మళ్లీ చమురు రాజకీయమే. మధ్య ఆసియా మీద ఆధిపత్యం కోసమే.
1870 నాటికి ఉక్కు, బొగ్గు, విద్యుత్, రైల్వే నిర్మాణంలో ఇంగ్లండ్ కంటె జర్మనీ చాలా ముందుకు వెళ్లింది. ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం పుణ్యమా అని ఫ్రాన్స్‌లోని అల్సేస్, లోరేన్ ప్రాంతాలు జర్మనీ అధీనంలోకి వచ్చాయి. అవన్నీ ఉక్కు గని ప్రాంతాలే. వాటిని ఉపయోగించుకుని జర్మనీ బాగా పెరిగింది. అన్నింటికీ మించి ‘సముద్ర మహారాజ్ఞి’ అన్న ఇంగ్లండ్ బిరుదును సవాలు చేసే స్థాయికి కూడా జర్మనీ ఎదిగింది. ఇది ఇంగ్లండ్‌కు మరింత కంటగింపుగా మారింది. దీనికి తోడు ప్రపంచ ఆధిపత్యం మీద జర్మనీ పెంచుకుంటున్న కాంక్ష మరొకటి. వీటన్నిటి ఫలితమే బెర్లిన్-బాగ్దాద్ రైలు మార్గ నిర్మాణం. టర్కీ అధీనంలో ఉన్న పర్షియన్ గల్ఫ్ దగ్గర నౌకాశ్ర యం నిర్మించడం జర్మనీ ఆశయం. టర్కీ, సిరియా, ఇరాక్ మీదుగా సాగే వేయి మైళ్ల మార్గమిది. 1899లో జర్మనీ బ్యాంకర్లు, పెట్టుబడిదారులు కొందరు కలిసి ఒట్టోమన్ రాజ్యం నుంచి ఈ రైల్వే నిర్మాణం కోసం అనుమతి పొందారు. ఆ సంవత్సరమే నిర్మాణం మొదలయింది కూడా. మధ్య ఆసియాలో మార్కెట్ల కోసం వేట ప్రారంభించిన జర్మనీ అప్పుడే టర్కీతో కొన్ని ఆర్థిక ఒప్పందాలు కూడా చేసుకుంది. ఇదంతా గమనించిన ఇంగ్లండ్ బెర్లిన్-బాగ్దాద్ నిర్మాణం పని కొంత జరిగాక అభ్యంతరాలు చెప్పడం మొదలు పెట్టింది. భారత్, ఈజిప్ట్‌లలో తన ఆధిపత్యానికి ఈ పరిణామం గండి కొడుతుందన్న అనుమానం ఇంగ్లండ్‌కు ఉంది. అది అనుమానం కాదు. విల్‌హెల్మ్ ఆశయం కూడా అదే. కానీ ఇంగ్లండ్ ఆ సంగతి పసిగట్టింది. కాబట్టే బస్రా దగ్గర నిర్మాణం ఆపాలని షరతు పెట్టింది.
తాను సహజ శత్రువుగా భావిస్తున్న టర్కీ- ‘ఐరోపా జబ్బు మనిషి’ అని పేర్కొనే టర్కీ జర్మనీ బంధంతో, ఇంకా చెప్పాలంటే దాని అండతో బలపడడం రష్యాకు ఇష్టం లేదు. ఇస్లామిక్ దేశం టర్కీలో క్రైస్తవుల హక్కుల రక్షణ పేరుతో రష్యా దాడులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. టర్కీని ఆగర్భశత్రువుగా పరిగణించే సెర్బులకు అండగా ఉన్నది కూడా రష్యాయే.
ఇరవయ్యో శతాబ్దం ఆరంభం నుంచి చెలరేగిపోతున్న జర్మనీని నిరోధించడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఇంగ్లండ్‌కు ఫెర్డినాండ్ హత్య తరువాతి పరిణామాలు కలిసి వచ్చాయి.
నిజానికి యుద్ధ మేఘాలు కమ్ముకున్న వెంటనే జర్మన్ చక్రవర్తి విల్‌హెల్మ్ సోదరుడు హెన్రీ ఇంగ్లండ్ వెళ్లి బకింగ్‌హామ్ రాజమందిరంలో జార్జి చక్రవర్తిని కలుసుకున్నాడు. ఆ వాతావరణంలో ఇంగ్లండ్ మనోగతం తెలుసుకోవడం అతడి ఉద్దేశం. చిత్రంగా, బ్రిటన్ యుద్ధంలో పాల్గొన వలసిన అవసరం ఏమీ కనిపించడం లేదని జార్జి అప్పుడు చెప్పాడు. అంతవరకు విల్‌హెల్మ్ కూడా ఇంగ్లండ్‌తో స్నేహ సంబంధాల కోసం పరి తపిస్తున్నట్టే పైకి ప్రకటనలు ఇచ్చేవాడు. అందుకు కారణం తనలో సగం ఇంగ్లిష్ రక్తమే ప్రవహిస్తోందని కూడా ప్రకటించేవాడు.
కానీ జార్జి తన మాట మీద నిలబడలేదు. పైగా, యువరాజును పోగొట్టుకున్న ఆస్ట్రియా-హంగెరీ తరఫున కానీ, ఆస్ట్రియా - హంగెరీ వంటి పెద్ద శక్తితో పోరాడుతున్న చిన్న దేశం సెర్బియా తరఫున కానీ ఇంగ్లండ్ యుద్ధంలోకి ప్రవేశించలేదు. ఫ్రాన్స్ మీద దండెత్తడానికి వెళుతూ తటస్థ దేశం బెల్జియంను సర్వనాశనం చేసినందుకు జర్మనీ మీద ఇంగ్లండ్ యుద్ధం ప్రకటించింది. టర్కీకి అనుకూలంగాను, సెర్బియాకు వ్యతిరేకంగాను ఉన్న జర్మనీకి రష్యా సహజ శత్రువుగా మారిపోయింది. ఐరోపా ఖండ దక్షిణాది స్లావ్ జాతీయులైన సెర్బుల రక్షణ తన బాధ్యతగా రష్యా సుదీర్ఘకాలంగా భావిస్తున్నది. పైగా ష్లీఫెన్ పథకం ప్రకారం మొదట ఫ్రాన్స్‌ను ఓడించి ఆపై రష్యాను ఓడించాలన్నది కూడా జర్మనీ దీర్ఘకాలిక ప్రణాళిక. బెల్జియం విధ్వంసంతో దానికి తొలి అడుగు పడింది.
ఇంత వైరం పెంచుకుని, బలమైన కారణం ఏమీ లేకుండానే మొదటి ప్రపంచ యుద్ధాన్ని రుద్దిన విల్‌హెల్మ్ (జర్మనీ), జార్జి ప్రభువు (ఇంగ్లండ్), నికోలస్(రష్యా) మధ్య రక్తసంబంధం ఉందంటే నమ్మగలమా! కానీ అది వాస్తవం.
విక్టోరియా మహారాణి (మే 24, 1819-జనవరి 22, 1901)కి ‘ఐరోపా అమ్మమ్మ’ అన్న పేరు ఉంది. 63 సంవత్సరాల 7 మాసాల పాటు బ్రిటిష్ సింహాసనాన్ని అధిరోహించిన విక్టోరియా... రాచ కుటుంబాల మధ్య వైవాహిక సంబంధాలకు పెద్ద పీట వేసింది. దీనితో ఐరోపాలో శాంతి నెలకొంటుందని రాణి అభిప్రాయమని చెబుతారు. ఆ కారణంగానే దాదాపు పది దేశాలకు రాణి సమీప బంధువులే పాలకులయ్యారు. ఆమె కన్నుమూసే నాటికి దాదాపు నలభయ్ మంది మనుమలు మనుమరాండ్రు ఉన్నారు.
విల్‌హెల్మ్ తల్లి విక్టోరియా మహారాణి పెద్ద కూతురు. జార్జి తల్లి, విల్‌హెల్మ్ తల్లి సొంత అక్క చెల్లెళ్లు. అంటే విక్టోరియా కుమార్తెలు. కాబట్టి విల్‌హెల్మ్, జార్జి విక్టోరియా మహారాణి మనుమలు. నికోలస్ నేరుగా మనుమడు కాదు. అయితే జార్జి తల్లి, నికోలస్ తల్లి మళ్లీ వరసకు అక్కచెల్లెళ్లే. చిత్రంగా జార్జి, నికోలస్ దగ్గర పోలికలతో ఉంటారు. నికోలస్ భార్య అలెగ్జాండ్రా విక్టోరియా మనుమరాలే. మళ్లీ విల్‌హెల్మ్‌కు ఈమె సోదరి వరస. ఈమె కూడా జర్మనీలోనే పుట్టింది. విక్టోరియా మహారాణి కన్నుమూసినపుడు విల్‌హెల్మ్, జార్జి, నికోలస్ ఇంగ్లండ్‌లో కలుసుకున్నారు కూడా. ఇంకా చిత్రం, మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు బొల్షివిక్ బెడదను ఎదుర్కొంటున్న నికోలస్‌కు అండగా ఉండడానికి విల్‌హెల్మ్ రహస్యంగా మంతనాలు నడిపాడు. ఈ విషయాలన్నీ బ్రిటిష్ చరిత్రకారుడు మిరాండా కార్టర్ ఇటీవలి తన పుస్తకంలో ఉటంకించాడు. చిత్రంగా బొల్షివిక్‌లు అధికారంలో వచ్చిన తరువాత నికోలస్ రాజకీయ ఆశ్రయం కోసం జార్జికి రాయబారం పంపాడు. కానీ జార్జి నిరాకరించాడు. బొల్షివిక్‌లు నికోలస్‌ను కుటుంబంతో సహా తుద ముట్టించారు. నిజానికి, యుద్ధం మొదలవుతోందని నికోలస్ చెప్పగానే అతడి భార్య అలెగ్జాండ్రా ‘ఇక అంతా సర్వనాశనమే!’ అని ప్రకటించి, తన మందిరంలోకి వెళ్లిపోయి విలపించింది.
ఆమె అంచనా తప్పలేదు.
- డా॥నారాయణరావు