అంపకాల్లో కోడిగుడ్డు దీపం | 2025 Story Written by Malathi Chandur | Sakshi
Sakshi News home page

అంపకాల్లో కోడిగుడ్డు దీపం

Published Sun, Jul 21 2019 9:08 AM | Last Updated on Sun, Jul 21 2019 9:08 AM

2025 Story Written by Malathi Chandur - Sakshi

మనిషికో కారు –పడవల్లా ఉన్న పెద్ద కార్లు ఆ వీధిలో ఆగి ఉన్నాయి. ఒక్కొక్క కారులోంచి ఆడా–మగా అంతా దిగారు. అందులో ఆడవాళ్లెవరో.. మొగవాళ్లెవరో.. గుర్తుపట్టడానికి వీలులేకుండా ఉంది. ఒక్కామెకి మాత్రం సుమారు అరవై ఏళ్లుంటాయి. చీర కట్టుకుని స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ వేసుకుంది. ఇంతమంది మనిషికో కారుతో పెద్ద పెద్ద కార్లు వేసుకుని రావడం ఆ ఊళ్లో ఎవరూ వింతగా చూడలేదు. విడ్డూరం అనుకోలేదు. ఎందుకంటే ఎలక్ట్ర్‌సిటీలో నడిచేకార్లు. పగలంతా బ్యాటరీలు ఎండలో పెడితే వాటంతటవే సోలార్‌ ఎనర్జీతో శక్తిని పుంజుకుని నలభై ఎనిమిది గంటలు నడుస్తాయి ఢోకా లేకుండా. ప్రతి ఇంటి గుమ్మం ముందు కప్పు మీదా పూల తోట్టెలకు బదులు సోలార్‌ బ్యాటరీ సెట్స్‌ కనిపిస్తున్నాయి.

యాభై ఏళ్ల క్రితం ఈ ఊరు మాదిరి పల్లెగా పరిగణింపబడినా, ఈనాడు అది బస్తీ అయింది. ఊరు నిండా జనం కంటే కార్ల సంఖ్యే ఎక్కువ ఉంది. రోడ్డుకిరువైపులా పూర్వకాలంలో చెత్త ఉండేది. ఇప్పుడు చెడిపోయిన కార్లు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లు, వాషింగ్‌ మెషిన్లు, టెలిప్రింటర్‌ డొక్కులు ఎక్కడికక్కడే ఖాళీడబ్బాల్లాగా దొర్లుతున్నాయి. నెలకొసారి కార్పొరేషన్‌ వారు పట్టుకుపోతుంటారు. 
కార్లోంచి చీరకట్టుకున్న స్త్రీ దిగింది. ఆవిడ పేరు ‘ఈగా’. గత శతాబ్దిలో ఈడ్పుగంటి గాయత్రి అన్న పేరు కలిగిన ఆ ‘ఈగా’ గారి కొడుకు ‘జె’ పెళ్లిచూపులకి వచ్చాడు ఆ ఊరు. ఈ 21 శతాబ్దిలో పేర్లు కుదించి ఒక్క అక్షరంలో క్లుప్తంగా పేర్లు పెట్టుకోవడం రివాజైంది. ఒక్క అక్షరం అయితే కంప్యూటర్‌ ప్రాగ్రామ్‌ తేలిగ్గా సెట్‌ అవుతుంది. ఆన్సర్‌ ఠక్కున వచ్చేస్తుంది.

‘జె’ ఆ ఊర్లో సూరయ్యగారి మనువరాలు ‘యస్‌’ని ప్రేమించాడు. పెళ్లి చేసుకునే ముందు సూరయ్యగారు, ఆయన అక్కగారు వెంకాయమ్మా ఈ ఇద్దరినీ మగపెళ్లివారి తాలుకు వారు వచ్చి చూసి వెళ్లాలని కోరిక. సూరయ్యగారికి తొంభై అయిదేళ్లు. భార్యపోయి చాలా రోజులయ్యింది. ఆయన అక్కగారు వెంకాయమ్మ పూర్వ సువాసిని – ఆమె సెంచరీ చేసి ఆరేళ్లు అయ్యింది. కాస్త నడుం వంగినా.. చూపు శుభ్రంగా ఉంది. ఒకసారి చత్వారం వచ్చిపోయింది. అంచేత దగ్గిర వస్తువులూ, దూరం  వస్తువులూ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి వెంకాయమ్మగారికి. ఆవిడకు బాల్యంలోనే భర్తపోయాడు. చిన్నప్పటి నుంచీ తమ్ముడు సూరయ్యగారికి దగ్గరే ఉంది. ఆవిడకు పెళ్లికూతురు ‘యస్‌’ అంటే ప్రాణం. ఆ పిల్లని చేసుకోబోయే పెళ్లికొడుకూ, ఆత్తమామలూ, ఆడబడుచూ, మరిదీ ఎలా ఉంటారో చూడాలని కోరిక. వాళ్లని వెంటబెట్టుకొచ్చింది పెళ్లికూతురు ‘యస్‌’.

వస్తూనే ఈ పెళ్లివారు వీధిగుమ్మంలో నిల్చుండిపోయారు. అందరి దృష్టి ఆ ఇంటి ముందున్న పూలమొక్కలూ, వీధి గుమ్మంలో కాంపౌండు, లోపల ఉన్న పెద్ద మామిడి చెట్టు మీద నిల్చిపోయింది. ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు ఆ వచ్చినవాళ్లు.
‘మామ్‌ ఇదేమిటి?’ కీచు గొంతుతో అడిగాడు ‘జె’. ‘జె’కి గాని ఆ ఇంట్లో వాళ్లకి గానీ తెలుగురాదు. ‘జె’ తల్లిదండ్రులకి తెలుగు వచ్చు గానీ నగరాల్లో ఉండటం చేత తెలుగు పూర్తిగా మర్చిపోయారు. ఇంట్లో వాడుక భాష ఇంగ్లీష్‌ అవడం చేత తెలుగు అవసరం ఎవరికీ లేదు.
‘‘అది ‘ట్రీ’ జె’’ అంది ఈగా.
‘‘ట్రీ –అంటే ఇలా ఉంటుందా?’’ అడిగారు ‘జె’, అతని చెల్లెలూ ఆత్రంగా. వాళ్లెప్పుడూ చెట్లు చూసి ఎరుగరు. వాళ్లు పుట్టాక–పచ్చని చెట్టు చూడటం ఇదే మొదటిసారి. ‘ట్రీ’ గురించి చదివారు. సినిమాల్లో, పెయింటింగ్స్‌లో చూశారు. లీవ్స్, ఫ్రూట్స్, స్టెమ్స్, రూట్స్‌ వీటితో చెట్లు ఉంటాయని చదివి తెలుసుకున్నారు గానీ కళ్లారా చూడం ఇదే మొదటిసారి. పాతికేళ్లు లోపున్న వీరు ‘ట్రీ’ అనే ఒక అద్భుతం ఉన్నదని ఆనాడే తెలుసుకున్నారు.

‘‘మామ్‌ – ఈ ట్రీని తీసుకెళ్లిపోదాం. ‘యస్‌’కి వాళ్ల గ్రాండ్‌ఫా డౌరీ ఇస్తామంటున్నారుగా. ‘‘ఈ ‘ట్రీ’ని డౌరీగా అడుగు మామ్‌’’ అంటూ అశ్వత్థ ప్రదక్షణ చేసినట్లు చెట్టు చుట్టూ తిరుగుతున్న కొడుకుని చూసేప్పటికి, మాతృప్రేమ పొంగి పొరలింది ‘ఈగా’కి.
 ఈ లోగా ఇంటి వెనకవైపు నుంచి ‘అంబా’ అన్నకేక విని భయంగా తల్లి వెనక నక్కుతూ ‘‘వాట్‌.. వాట్‌’’ అని అడిగాడు  పెళ్లికొడుకు. ‘‘అది మా ఇంటి మాలక్ష్మి నాయనా. దాని పాలే  మా జీవనాధారం’’ అంది బోడి తలమీద ఉన్న చెంగు సవరించుకుంటూ సూరయ్యగారి అక్కగారు వెంకాయమ్మ. ఆవిడను చూడటంతోటే ‘‘నమస్కారం బామ్మగారూ’’ అంది ‘ఈగా’ గారు, తెలుగుని ఇంగ్లీషు వాళ్లలా మాట్లాడుతూ..
బామ్మగారి మాటలు పెళ్లికొడుక్కి అర్థం కాలేదు. సరిగదా ఆవిడ వలన నోరు తెరుచుకుని, మరో గ్రహం నుంచి వచ్చిన మనిషిని చూసినట్లు వింతగా చూస్తున్నాడు. ‘‘మామ్‌’’ అని తల్లిని శరణుజొచ్చాడు. ఎవరీ వింత జంతువు అన్నట్లు ప్రశ్నార్థకంగా మొహం పెట్టి.

‘‘నీ ఉడ్‌బీకి, గ్రానీరా’’ అంది ఆవిడ ఆపేక్షగా కొడుకు వైపు చూస్తూ. ‘జె’ నాలుగు మెలికలు తిరిగాడు, బామ్మగారి తీక్షణమైన చూపులకి తట్టుకోలేక.
‘‘నాయనా– నువ్వెప్పుడూ ఆవుని చూడలేదా ఆవు. కౌ’’ అంది ఆవిడ ఈ పిల్లవాడికి బోధపరచే విధంగా.
‘‘కౌ’’ అంటే.?
‘‘మిల్క్‌.. మిల్క్‌’’ అంది ఆవిడ ఇంటి వెనకవైపుకి దారితీస్తూ. ఇంచుమించు బామ్మగారి వయసులోనే ఉన్న ఒక ముసలి పాలేరు – చెంబు రెండు మోకాళ్ల మధ్యా ఉంచుకుని పాలు పిండుతున్నాడు. 
‘‘వాట్‌..వాట్, మామ్‌ వాట్‌’’ అంటూ పాలవాడి పక్కకెళ్లి కూచోబోతున్న ‘జె’ని చూసి.. ఆవు ఒక విదిలింపు విదిల్చి వెనక కాలుతో తన్నబోతున్న సమయంలో బామ్మగారు రెక్కపట్టుకుని ఇవతలకి లాగారు కాబోయే పెళ్లి కొడుకుని. ఆవిడ పట్టుకున్న జెబ్బని చేత్తో రాసుకుంటూ భయం భయంగా చూస్తున్న పెళ్లికొడుకుని చూసి ‘‘ఏం పిల్లలర్రా... ఉఫ్‌న గాలికి ఎరిగిపోతూ..’’ అంటూ నవ్వి పాల చెంబు అందుకుంది పాలేరు చేతుల్లోంచి వెంకాయమ్మ. ‘జె’ కాలిబోటన కొనవేళ్ల మీద నిల్చుని పాలచెంబులోకి కుతూహలంగా చూసి ‘‘మమ్మీ– మిల్క్‌ మిల్క్‌’’ అంటూ ఆశ్చర్యంగా అరిచాడు. ‘‘మమ్మీ, మిల్క్‌ బాటిల్స్‌లో ఉంటుంది కదా. ఈ ‘కౌ’లోకి  ఎల్లా వచ్చింది చాలా ఆశ్చర్యంగా ఉందే! మమ్మీ ఈ ‘కౌ’ని పట్టుకెడదాం. మా ఫ్రెండ్స్‌ చెప్పినా నమ్మరు. మిల్క్‌ కార్టన్స్‌లో తప్ప ఎక్కడా ఉండదంటారు’’ గారాలు పోతున్నాడు పెళ్లికొడుకు.

పెళ్లికొడుకూ, అతని చెల్లెలూ  ప్లాస్టిక్‌ ఫర్నిచర్‌ తప్ప కర్ర సామాను చూసి ఎరుగరు.
‘డాడీ, ఈ చైర్‌ కూల్‌గా ఉంది కదూ’’ అడుగుతోంది కూతురు ‘హిప్‌’. ఆ అమ్మాయి బాబ్‌ చేసుకుని, బ్లూ జీన్స్‌ మీద లూజ్‌ బనీను వేసుకుని ఉంది. ‘హిప్‌’ జేబులోంచి సిగిరెట్టు తీసి అంటించి –ఘాటుగా పొగ పీల్చి వదుల్తోంది. బామ్మగారు గుండు మీద కొంగు సవరించుకుంటూ కోపం – అసహ్యం మిళితమైన చూపుతో ఆ పిల్లవంక చూస్తున్నది. సిగరెట్‌ పొగపీల్చి ఆ అమ్మాయి అర్ధనిమీలితనేత్రాలతో బామ్మగారి వంక కుతూహలంగా చూస్తూ ఉంది. ఆ చూపులోని మత్తుని కాస్త వెనక్కి నెట్టి ‘‘డాడ్‌ ఆ హెయిర్‌ స్టైల్‌ నాకు బాగుంటుంది కదూ రేపు వెళ్లి క్లీన్‌ షేవ్‌’’ చెయ్యించుకుంటాను అంటోంది. ఆ అమ్మాయి తండ్రి తేలుకుట్టినట్టు కేక వెయ్యబోయి, తనని తాను సర్దుకుని.. జేబులోంచి చిన్న సీసా తీసి, గొంతులో పోసుకుని, గడగడ తాగి, మూతి తుడుచుకుని ‘‘బేబ్‌.. అది స్టైల్‌ కాదమ్మా – హెయిర్‌ స్టైల్‌ కానేకాదు’’ అంటూ సర్దిచెప్పబోయాడు.

‘‘వాట్‌’’ ఆశ్చర్యంగా అడిగింది ఆ అమ్మాయి.
‘‘ఆవిడ విడో. మనదేశంలో పూర్వకాలంలో ‘విడోస్‌’ ఇలా ఉండేవారు.’’
‘‘అయితే’’
‘‘నువ్వు మిస్‌వమ్మా.. నీకింకా పెళ్లికాలేదు’’
‘‘నాన్‌సెన్స్‌. డాడీ ఆ హెయిర్‌స్టైల్‌ చాలా బాగుంది క్లీన్‌ నీట్‌గా ఉంది’’ కలలు కంటూన్నట్టుగా మత్తుగా తూగుతూ చెబుతోంది ఆ అమ్మాయి.
బామ్మగారు కాఫీ –ఫలహారాలు తీసుకొచ్చి టేబుల్‌ మీద పెట్టారు. ఫలహారం చేసి అలవాటు ప్రకారం ప్లేటును టఫీమని మూలకి విసిరి పారేశాడు పెళ్లికొడుకు. ఆ ప్లేటు వెళ్లి గోడకి తగిలి వెయ్యిముక్కలయిపోయింది ఘల్లుమని శబ్దం చేస్తూ.
‘‘డాడీ వండర్‌ఫుల్‌ ఆ సౌండ్‌ చూడండి మ్యూజికల్‌ నోట్‌ ఎంత స్వీట్‌గా ఉందో’’

‘‘ఈగా’ గారు కొడుకువంక కోపంగా చూసింది. వెంకాయమ్మగారు ఏడుపు పర్యంతం అయ్యారు. ఆ గాజు ప్లేటుని వాళ్లు అతి జాగ్రత్తగా, అపురూపంగా చూస్తూ వస్తున్నారు. పురావస్తుశాఖలో కూడా దొరకని సామాన్లు. అవి భారతదేశానికి స్వాతంత్య్రం రాకమునుపు వెంకాయమ్మగారి తండ్రి కొన్న కప్పులూ, ప్లేట్లూనూ అవి. అయితే పెళ్లికొడుకు వారికి ఈ గాజు సామాను కొత్త. వాళ్లింట్లో రోజూ టిఫిన్‌ తినేసి, పేపరు ప్లేట్లు గురి చూసి వేస్టు పేపర్‌ బాస్కెట్‌లోకి విసిరి పారేస్తుంటారు. అట్లాగే చేశాడు ఇక్కడాను. బిక్కగా మొహం పెట్టిన పెళ్లికొడుకుని చూసి – ‘‘ఫరవాలేదులే డార్లింగ్‌’’ అంటూ, పెళ్లికూతురు అమాంతం ముద్దు పెట్టేసుకుంది పెదిమల మీద.

వెంకాయమ్మగారు ఈ దృశ్యం చూసి కొంచెం ఆగ్రహపడినా, ఆ చిన్నవాళ్ల మధ్యగల ప్రేమకి ముచ్చటపడిపోయింది. ‘జె’ మెలికలు తిరిగిపోయాడు ఆనందంతో..
కట్నకానుకల బేరసారాలు ప్రారంభమయాయి. కాలానుగుణంగా అమలులో ఉన్న పేపరు ఎన్ని టన్నులు కట్నంగా ఇవ్వగలిగేది తాతగారు చెప్పటం మొదలు పెట్టారు. కొడుకూ కోడలూ ప్లేన్‌ యాక్సిడెంట్‌లో చచ్చిపోవడం చేత ఈ మనుమరాలి బాధ్యత తనమీద పడింది. ఈ ప్రేమలయితే కొత్తగా వచ్చాయి గానీ, కట్నాలూ, కానుకలూ మా కాలంలోనూ ఉన్నాయి అంటూ ‘‘నాకు అయిదువేలు కట్నం ఇచ్చారు. మా అక్కయ్యకు వెయ్యి నూటపదహార్లు ఆడబడుచు లాంఛనలుగా ఇచ్చారు’’ అన్నాడు తాతగారు మీసాలు దువ్వుకుంటూ..

తెల్లని ఆయన మీసాలు చూస్తున్న కొద్దీ పెళ్లికొడుకు చెల్లెలికి మహాసరదాగా ఉంది. మామ్మగారి లాగా తల క్లీన్‌గా ఫేవ్‌ చేయించుకుని, తాతగారిలాగా మీసాలు ఉంచుకుంటే తమ సర్కిల్‌లో తాను కొత్త ఫ్యాషన్‌ ‘సెట్‌’ చేసినట్లవుతుంది. ఎలాగైనా మూతిమీద జుట్టు పెంచుకోవాలి.
తాతగార్ని అడిగింది ‘‘ఎట్లా వస్తుందండీ మూతి మీద జుట్టు?’’ అని.
‘‘ఆయన పరాచికంగా ‘‘మీ అన్నకే రాలేదు నీకెక్కడొస్తుంది. ఈ కాలంలో పేడి మూతి మొగవాళ్లూ, మీసాల ఆడవాళ్లు’’ అంటూ చేప్పేది మధ్యలో ఆపేశారు మొహమాటంగా, ఆ మాటలు అంటుంటే ‘ఈగా’మ్మగారి గడ్డం మీద వెంట్రుకలు రెండు మూడు గాలిలో అల్లల్లాడుతుంటం గమనించి.
‘‘మా తమ్ముడికి కట్నం పుచ్చుకున్నారు గానీ, నన్ను రెండువేలకి కొనుక్కున్నారు. నా పెళ్లి దొంగతనంగా జరిగింది’’ అంది బామ్మగారు నేలమీద కూచుని రెండు కాళ్లూజాచి.
‘‘రెండు టన్నుల పేపరు మనీ ఇస్తాను. అమ్మాయికి సారెగా ఫ్రిజ్, రిమోట్‌ కంట్రోల్‌ టీవీ, మైక్రో ఓవెన్, ఓ రెండు కార్లూ’’

‘‘ఆగండి ఇవేం పెద్ద గొప్పకాదు. మా ఇంట్లో కార్లకే చోటులేక చస్తుంటే మాకెందుకండీ ఇంకా కార్లు? మా ఇంట్లో మనిషికో టీవీ, ఓవెన్‌ బొచ్చెడున్నాయి. ఈ డొక్కు సామాను మేమేంచేసుకుంటాం. ఊహూ అక్కరలేదు’’ అంది ‘ఈగా’గారు ఈసడింపుగా.
‘‘అసలు మా వాడికి హెలికాప్టర్‌ ఇస్తామన్నారు మా బ్లాక్‌లో ఇరవయ్యో అంతస్తులో ఉన్న ఆ ‘సియా’గారు. అప్పటికే చివరి అంతస్తు టెర్రస్‌లో తనహెలికాప్టర్‌ పెట్టేసుకుని, స్థలం ఆక్రమించేసుకున్నాడు. మీరు ఇచ్చినా హెలికాప్టర్‌ పెట్టుకునే స్థలం లేదు మాకు’’
‘‘మరి ఏమిమ్మన్నారు మా పిల్లకి’’
‘‘ఆ సామానుకు బదులు మరో టన్ను రూపాయి కట్టలు’’
‘‘వద్దు బాబోయ్‌. చెదలు’’
‘‘చెదలా ఈ రోజుల్లో కూడానా? మందు వెయ్యడం లేదా?’’ అడిగింది బామ్మగారు.
‘‘వేస్తున్నామండీ. సంచి నిండా రూపాయి కట్టలు కోరి తీసికెడితే ఒక్క ప్లాస్టిక్‌ డబ్బా మందొస్తున్నది. వద్దండీ దానికి బదులు.’’

‘‘ఏం కావాలో అడగండి. మీరు అడిగే ముచ్చటా – ఇదే కదా’’  అన్నారు తాతగారు.
ఈ పెద్దలు ఏం బాష మాట్లాడుతున్నారో అర్థం కాక చిన్నవాళ్లు ముఖాలు చూసుకుంటున్నారు. పెళ్లికొడుక్కి ఆ ఇంట్లో ప్రతిదీ వింతగా మ్యూజియంలోని వస్తువులా కనిపిస్తోంది. అట్టపెట్టెలో ఉండాల్సిన పాలు, ఆవు అనబడే ఈ జంతువు పొట్టలోకి ఎలా వచ్చాయి? నిజంగా ఆవులోంచే వస్తున్నాయా? ఆ ముసలాడి వేళ్లలోంచా? ఇలా సందేహాల్లో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు పెళ్లికొడుకు. ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ అన్ని వస్తువులూ వేళ్లతో పట్టుకు చూస్తున్నాడు. పెళ్లి మాటలు మాట్లాడుతున్న బామ్మగారు, పెళ్లికొడుకు వంక అనుమానంగా చూస్తూ ఉంది. కొన్ని క్షణాల క్రితం బంగారంలాంటి గాజుప్లేటు విసిరికొట్టేశాడు. మళ్లీ ఏ పాడు పని చేస్తాడోనని గజగజలాడిపోతోంది.

పెళ్లికొడుకు కెవ్వున అరిచాడు. అది సంతోషమో– భయమో, ఆశ్చర్యమో ఎవరికీ బోధపడలేదు.
‘‘సన్‌’’ అంటూ లేచాడు పెళ్లికొడుకు తండ్రి.
‘‘డాడ్, నాకు ఆ చెట్టు కట్నంగా కావాలి. ఆ చెట్టు ఇస్తేనే పెళ్లి చేసుకుంటాను. లేకపోతే మనకీ ఎలయన్స్‌ వద్దు’’ అనేశాడు దృఢంగా.
ఎవరికీ ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. ఆ కూర్చున్న వారిలో ఒక్క బామ్మగారికి తప్ప. రామాయణం ఎవరికీ జ్ఞాపకం లేదు. హనుమంతుడు సంజీవని పర్వతం ఎత్తుకెళ్లినట్లు ఈ పెళ్లికొడుకు మామిడి చెట్టుని పట్టుకెడుతాడా? ఎట్లా పట్టుకెడతాడో చూద్దాం అన్నట్లు సెంచరీ చేసిన ఆవిడ కళ్లు అల్లరిగా తళుక్కుమన్నాయి. ‘‘అల్లాగే నాయనా నువ్వు వెళ్లి మీ ఇంట్లో పెట్టుకో’’ అన్నారు.
హుషారుగా ఒక్క డిస్కో పల్టీ కొట్టి, విజిల్‌ వేసి, చెట్టు దగ్గరకు పరుగెత్తి దానివంక చూస్తున్నాడు శివ ధనస్సుని ఎక్కుపెట్టే అలనాటి శ్రీరామచంద్రుడిలాగా.

ఇటు– అటు చూశాడు. లిఫ్ట్‌లో పైకి వెళ్లడం, ఎస్కలేటర్స్‌లో ఎత్తులకు వెళ్లడం తెలిసుగానీ చెట్టు ఎక్కడంతో పరిచయంలేని పెళ్లికొడుకు కొమ్మలని అందుకోటానికి పైకి గెంతాడు. ఊహూ లాభం లేకపోయింది. కనీసం ఆకులనైనా చేతికి చిక్కించుకోవాలని ప్రయత్నించి విపలమైన ఆ పిల్లవాడి అవస్థ చూస్తే బామ్మగారికి నవ్వొచ్చింది. లావుగా, బరువుగా ఉన్న ఇనుప గునపం ఆవిడ ఒక చేత్తో పట్టుకోస్తుంటే, అది ప్లాస్టిక్‌ రాడ్‌ ఏమోనని, అందుకోబోయి, దాని బరువుకి దభాలున చతికలపడిపోయాడు మట్టినేల మీద.
బామ్మగారు పెళ్లికొడుకుని చూసి జాలిపడి, ‘‘నాయనా నీకు నచ్చేది నువ్వు ఇంతవరకూ చూడనిదీ కట్నంగా ఇస్తాం. ఈ చెట్టును నువ్వు భరించలేవు’’ అంటూ అనునయంగా చెప్పి లోపలికి తీసుకెళ్లింది.

ఆ హాల్‌లో అస్తారుపదంగా, అతి జాగ్రత్తగా దాచుకుని కోడిగుడ్డు దీపం తీసి చిమ్నీని పయిట కొంగుతో తుడుస్తుంటే, పెళ్లికొడుకు చుట్టూ పరిసరాలు మరిచిపోయి బామ్మగారి పక్కన కూలబడ్డాడు. ఆవిడ చిమ్నీని చక్కగా ముగ్గుతో తుడిచింది. లోపల ఒత్తిని కిందకీ పైకీ, బర్నరు చెడిపోకుండా ఎలా తిప్పాలో చూపించింది. కిందనున్న ఇత్తడి బుడ్డిలో కిరసనాయిలు పోసింది. ఆ కిరసనాయిలు వాసన పెళ్లికొడుక్కి, కొత్తగా సువాసన భరితంగా అనిపించింది. బామ్మగారు దీపం వెలిగించారు. ఎలా వెలిగించాలో నేర్పారు. పెళ్లికొడుకు చేతికి ఆ కోడిగుడ్డు బెడ్‌లైట్‌ అస్తారుపద్దంగా అప్పజెప్పి, ప్రతి సాయంత్రం తన పేరు చెప్పుకుని ఆ దీపం వెలిగించుకోమని ఆశీర్వదించారు. ‘‘ఆ దీపం చెడిపోకుండా కాపాడవలసిన బాధ్యత నీ మీద ఉంది నాయనా’’ అంటూ అంపకాలు పెట్టారు అమ్మాయిని అప్పజెబుతూ..
‘కోడి గుడ్డు దీపం తన ముందు తరాలకోసం అతి జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నాడు నలుగురు పిల్లల తండ్రి అయిన ‘జె’.
- మాలతీ  చందూర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement