ఓ పేదరాలిని అక్కున చేర్చుకున్న సుభాష్
ఆదర్శం
మహారాష్ట్ర సంఘసంస్కర్త గాడ్గె బాబా మాటలు గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా మనసులో కొత్త కాంతి చేరినట్లు అని పిస్తుంది సుభాష్ షిండేకు. ఆ శక్తితోనే పదిమందికీ ఉపయోగపడే పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో షిండే ప్రసిద్ధ నగల వ్యాపారి. వ్యాపారంలో తనకు వచ్చిన లాభాలను, ఆస్తిపాస్తులను కూడబెట్టు కోవడానికి కాకుండా పేదవాళ్లకు, ఆపదలో ఉన్నవాళ్లకు వెచ్చిస్తూ శభాష్ అనిపించు కుంటున్నాడు సుభాష్. చిన్నప్పుడు సుభాష్ అల్లరి పిడుగు. చేయని కొంటెపని లేదు. ‘వీడిని దారిలో పెట్టడం మా వల్ల కాదు’ అని టీచర్లు ఫిర్యాదు చేసేవారు. తండ్రి నయాన భయాన చెప్పినా ఎలాంటి మార్పూ లేదు. అవే తుంటరి చేష్టలు.
అయితే ఎనిమిదవ తరగతి చదువుతున్న రోజుల్లో ఒక రాత్రి నిద్రలో... ‘నేను మంచివాడిగా మారతాను’ అని కలవరించసాగాడు సుభాష్. ‘ఏమైందిరా’ అని సుభాష్‌ను లేపి అడి గింది తల్లి. ‘నువ్వు మారతావు కదూ అని ఎవరో అడిగితే మారతాను అని చెప్పాను’ అన్నాడు సుభాష్. ఇక అప్పటి నుంచి అతడిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఎంత మార్పంటే... ‘వీడు మా అబ్బాయేనా?’ అని తల్లి దండ్రులు కూడా ఆశ్చర్యపడేంత. ‘‘నాన్నా.... కొత్త బట్టలు కొనడానికి డబ్బులు కావాలి’’ అని ఒకరోజు తండ్రిని అడిగాడు సుభాష్. ‘‘ఇప్పుడెందుకురా... పండగేమీ లేదు కదా?’’ అనడిగాడు తండ్రి. ‘‘నా కోసం కాదు మా ఫ్రెండ్ కోసం. పాపం రోజూ చినిగిన దుస్తులతోనే స్కూలుకు వస్తున్నాడు. వాడిని చూసి అందరూ నవ్వుతున్నారు. అందుకే కొత్త బట్టలు కొనిద్దామనుకుంటున్నాను’’ అన్నాడు సుభాష్.
తండ్రి కళ్లు చెమర్చాయి. కొత్త బట్టల కోసం కొడుకు చేతిలో డబ్బు పెట్డడమే కాదు... ‘వాడి కోసం మన ఇంట్లో పాయసం వండిస్తాను. ఇద్దరూ కలిసి స్కూల్లో తినండి’ అన్నాడు. పేదపిల్లాడికి సుభాష్ కొత్త దుస్తులు బహూకరించిన విషయం స్కూలంతా తెలిసిపోయింది. అటెండర్ నుంచి హెడ్‌మాస్టర్ వరకు అందరూ సుభాష్‌ను పొగిడారు. ఎప్పుడూ తిట్లే తినే సుభాష్‌కు ఆ ప్రశంసలతో సరి కొత్త ఉత్తేజం వచ్చింది. ‘ఇంకా చాలా మంచి పనులు చేయాలి’ అనే సంకల్పానికి నాడే అంకురార్పణ జరిగింది. చదువు అబ్బకపోవడంతో తండ్రితో పాటు ఒక నగల దుకాణంలో పని చేయడం మొదలు పెట్టాడు. మెల్లగా నగల వ్యాపారంలో మెళకువలు తెలుసుకున్నాడు. దాంతో సొంతగా నగల వ్యాపారం చేయాలనే కోరిక పెరిగింది. తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేసి నగల దుకాణం తెరిచాడు. దుకాణం ప్రారంభోత్సవం రోజు నగరంలోని నగల వ్యాపారులతో పాటు పేదసాదలను కూడా పిలిచాడు. వారికి విందు ఏర్పాటు చేశాడు.
వ్యాపార మెళకువలు కొట్టిన పిండి కావడంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది సుభాష్‌కి. దూసుకుపోయాడు. కానీ గర్వం తలకెక్క లేదు, ధన వ్యామోహం పెరగలేదు. తాను బాగున్నాడు కాబట్టి మరికొందరు బాగుం డేలా చేయాలి అనుకున్నాడు. ఇస్త్రీ చేసి బతికే పన్నాలాల్ కూతురికి గుండె ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ ఖర్చును భరించడం పన్నాలాల్ వల్ల కాదు. అది తెలిసి సుభాషే ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయించాడు. అలా ఇప్పటి వరకు నాలుగొందల మంది హార్ట్ పేషెంట్లకు సహాయపడ్డాడు. ఎంతోమంది పేదలకు కంటి ఆపరేషన్లు చేయించాడు. అనాథలకు అండగా నిలుస్తున్నాడు. పేద వృద్ధులకు కొడుకులా సాయపడుతున్నాడు. ఎవరికే కష్టం వచ్చినా ‘నేనున్నాను’ అని ముందుకు వచ్చే సుభాష్ షిండేపై అతడి మిత్రుడు శ్రీరామ్ ‘అసామాన్య సామాన్య మానుష్’ పేరుతో ఒక పుస్తకం రాశాడు. అది చదివితే సుభాష్ సామాన్యులలో అసామాన్యుడు అన్న వాస్తవం తెలుస్తుంది!
‘ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చు. నీడ లేని వారికి నీడనివ్వు. పేదవాళ్లకు చేయూతనివ్వు. బలహీనులకు ధైర్యాన్ని ఇవ్వు’ అన్న గాడ్గె బాబా మాటల్ని సుభాష్ తన మనసు నిండా నింపుకున్నాడు. వాటినే అనుక్షణం తలచుకుంటూ, ఆ మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు.
-గాడ్గె బాబా